న్యూఢిల్లీ: దేశంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)ల విశ్వసనీయతపై చర్చ జరగడం సాధారణమే. అయితే ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతాలు ఆలస్యంగా ప్రకటించడంపైకి చర్చ మళ్లింది. దీనికి కారణం ఇప్పటి వరకు జరిగిన ఐదు విడతల పోలింగ్‌కు సంబంధించి ఫైనల్ ఓటర్ టర్నవుట్ డేటాలు ప్రకటించడానికి ఎన్నికల కమిషన్(ఈసీ) వారాల కొద్ది సమయం తీసుకోవడమే.
డేటా ఆలస్యమవడంతో పాటు పోలింగ్‌రోజు రాత్రి ప్రటించిన పోలింగ్ శాతానికి సమయం తీసుకుని ప్రకటించన డేటాకు మధ్య భారీ వ్యత్యాసముండటంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోపక్క ఎన్‌జీవోలు ఈ విషయంలో కోర్టుల తలుపులు తడుతున్నాయి. పోలింగ్ శాతం డేటాల్లో భారీ వ్యత్యాసాలపై ఇప్పటికే అసోసియేట్ ఫోరం ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) సుప్రీంకోర్టుకు వెళ్లింది.
ఏడీఆర్ వేసిన పిటిషన్‌ను మే17న తొలుత విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం ఓటర్ టర్నవుట్‌లు ప్రకటించడానికి ఆలస్యమెందుకవుతోంది, డేటాల్లో భారీ వ్యత్యాసమెందుకు ఉంటోందని ఈసీని ప్రశ్నించింది. మే 24న మళ్లీ ఈ కేసు విచారణకు వచ్చినపుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తొలి దశ పోలింగ్ శాతం డేటాకు ఏకంగా 11 రోజులు... అంకెల్లోనూ భారీ వ్యత్యాసం..
లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 19న జరిగితే ఈసీ యాక్చువల్ పోలింగ్ పర్సెంటేజీ ప్రకటించడానికి ఏకంగా 11 రోజులు పట్టింది. ఇక డేటా విషయానికి వస్తే పోలింగ్ ముగిసిన రోజు డేటా 60 శాతం అని తెలపగా 11 రోజుల తర్వాత ఈడేటా ఏకంగా 6 పర్సెంటేజీ పాయింట్లు పెరిగి 66.14 శాతానికి చేరింది.
దీనిపై ప్రతిపక్షాలతో పాటు ఎన్‌జీవోలు విస్మయం వ్యక్తం చేశాయి. పోలింగ్ శాతాల్లో ఇంత వ్యత్యాసమెందుకు వస్తోంది.. డేటా వెల్లడించడానికి ఎందుకంత సమయం తీసుకోవాల్సి వస్తోందని ఈసీకి ప్రశ్నల బాణాలు సంధిస్తున్నాయి. ఇదే తంతు సెకండ్ ఫేజ్ పోలింగ్‌కు మళ్లీ రిపీట్ అయింది. ఏప్రిల్ 26న సాయంత్రం పోలింగ్ శాతం 60.96 శాతం అని ప్రకటించగా అది కాస్తా ఏప్రిల్ 30న వాస్తవ డేటా ప్రకటించే సరికి 66.71శాతానికి పెరిగిపోయింది.
నాలుగు దశల్లో 1.07 కోట్ల ఓట్ల తేడా..
ఎన్నికల నాలుగు దశల పోలింగ్ శాతాల్లో ఈసీ ప్రకటించిన తొలి, తుది డేటాల వ్యత్యాసాన్ని ఓట్లలో పరిశీలిస్తే 1.07 కోట్ల ఓట్ల వ్యత్యాసం వచ్చింది. ఇప్పటివరకు పోలింగ్ పూర్తయిన 379 నియోజకవర్గాలకు ఈ ఓట్లను పంచితే ఒక్కో నియోజకవర్గానికి సగటున 28 వేల ఓట్ల తేడా వస్తున్నట్లు అంచనా.
అన్నింటికంటే ఎక్కువగా మే 13న పోలింగ్ జరిగిన ఆంధ్రప్రదేశ్‌లో 17 లక్షల ఓట్ల తేడా వచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారిగా చూసినపుడు ఈసీ ప్రకటించిన పోలింగ్ శాతాల డేటాల్లో తేడా అభ్యర్థుల గెలుపోటములను ఈజీగా ప్రభావితం చేయగలదన్న వాదన వినిపిస్తోంది.
2019లో ఎలా ప్రకటించారు.. ఇప్పుడేమైంది..
ఐదోవిడత పోలింగ్ సోమవారం(మే20)న జరిగింది. దీనికి సంబంధించి సోమవారం రాత్రి 11.30 గంటలకు ఓటర్ టర్నవుట్ 60.09గా ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. ఫైనల్ పోలింగ్ శాతం డేటాను ఎన్నికల ఫలితాల తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. దీనిపై అనేక ప్రశ్నలు సందేహాలు తలెత్తుతున్నాయి.
2019 ఎన్నికల సమయంలో పోలింగ్ పూర్తయిన కొద్దిసేపటికే ఎన్నికల కమిషన్ నియోజకవర్గాల వారిగా, స్ట్రీ,పురుషుల వారిగా అన్ని రకాల డేటాను ప్రకటించిందని, ఇప్పుడెందుకు ఈసీకి అది సాధ్యమవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
17సి ప్రామాణికం కాదా...
సాధారణంగా పోలింగ్ ముగిసిన తర్వాత కొద్ది సేపటికే ప్రతి పోలింగ్ బూత్‌లో ఉన్న పార్టీల పోలింగ్ ఏజెంట్లకు ఆ బూత్‌లో పోలైన ఓట్ల వివరాలను 17సి ఫామ్‌లో ఎన్నికల అధికారులు అందిస్తారు.
ఇది నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్‌లోనూ జరుగుతుంది. 17సి ఫామ్‌లతో అభ్యర్థులకు నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్ల వివరాలు తెలుస్తాయి. ఇంత క్లియర్‌గా 17సి ఉండగా ఫైనల్ డేటా విషయంలో సమస్య ఎక్కడ వస్తోందని కాంగ్రెస్ నేషనల్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే లేఖ ద్వారా ఎన్నికల సంఘాన్ని ఇప్పటికే ప్రశ్నించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment