స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర
స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర
Published Tue, Jul 25 2017 8:46 PM | Last Updated on Mon, Jul 30 2018 7:57 PM
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : కాపు నాయకుడు తన స్వప్రయోజనాల కోసమే పాదయాత్ర చేయడానికి పూనుకున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ విమర్శించారు. స్థానిక జెడ్పీ అతిథి గృహంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం చేపట్టిన పాదయాత్ర గతంలో తుని తరహాలో హింసాత్మకం కాకూడనే ఉద్దేశంతోనే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. కాపులకు ఉద్యోగ, విద్యాపరమైన రిజర్వేషన్ కల్పించే కార్యాచరణ ప్రణాళిక త్వరలో పూర్తి కాబోతుందని, ఎవరు ఎన్ని కల్లబొల్లి మాటలు చెప్పినా కాపు కులస్తులు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాపులను బీసీ జాబితాలో చేర్చే విషయంలో బీసీలు కూడా సుముఖంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాపు కార్పొరేషన్ ద్వారా గతేడాది 80 వేల మందికి స్వయం ఉపాధి రుణాలు అందించామని ఈ ఏడాది 64 వేల మంది కాపులకు రుణాలు అందించాలనే లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు నష్టం జరగకుండా కాపులను బీసీల్లో చేరుస్తామని చెప్పిన మాట వాస్తవమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళాభివృద్ధి సంస్ధ చైర్మన్ పాలి ప్రసాద్, కాపు సంఘ నాయకురాలు ఎ.మాళవిక పాల్గొన్నారు.
Advertisement