'కాపు కమిషన్ చైర్మన్ ఓ అసమర్థుడు'
పాలకొల్లు టౌన్(పశ్చిమగోదావరి జిల్లా): కాపు కులస్తుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో వ్యవహరించడంలేదని, కాపుల డిమాండ్లకు పరిష్కారాలు చూపకపోగా తూతూ మంత్రంగా కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని మాజీ ఎంపీ హరిరామజోగయ్య విమర్శించారు. 'చంద్రబాబు వైఖరిని నిరసించేందుకు కాపులంతా సన్నద్ధమవుతున్నవేళ కంటితుడుపు చర్యగా రూ. 100 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటుచేసి, టీడీపీకే చెందిన ఓ అసమర్థనాయకుడిని చైర్మన్ గా నియమించారు' అని దుయ్యబట్టారు.
బీసీ కార్పొరేషన్ అనుసరిస్తున్న విధివిధానాలను యథాతథంగా కాపు కార్పొరేషన్‌కు కూడా అమలు చేయాలని శుక్రవారం విడుదలచేసిన ఒక ప్రకటనలో హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న కాపు యువకులకు నెలకు రూ. 1,500 నుంచి రూ. 2 వేలు నిరుద్యోగ భృతిగా కార్పొరేషన్ ద్వారా అందజేయాలని, తద్వారా సీఎం చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం బీసీలుగా ఉన్న ఏ ఇతర సామాజిక వర్గానికి నష్టం కలగకూడదనేది కాపుల ఆకాంక్షని, దానిని చంద్రబాబు గ్రహించాలని జోగయ్య పేర్కొన్నారు.