హామీలు అమలు కాకుంటే మరో ఉద్యమం
త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం: కాపు నేత ముద్రగడ వెల్లడి
నల్లజర్ల రూరల్: కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు కాకుంటే మరోసారి ఉద్యమించక తప్పదని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో ఆదివారం నిర్వహించిన కాపు నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘అత్యంత నిరుపేదలకే రిజర్వేషన్లు అమలు చేయాలని అడుగుతున్నాం. మన ఆకలి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. మన కోసం కాకపోయిన భవిష్యత్ తరాల కోసం రిజర్వేషన్లు సాధించాల్సి ఉంది’ అని ముద్రగడ అన్నారు.
కాపు కార్పొరేషన్ రుణాలు జన్మభూమి కమిటీల పేరుతో ధనవంతులకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతున్నట్టు చాలా ప్రాంతాల నుంచి విమర్శలు వస్తున్నాయని, ఇది మంచి పద్ధతి కాదని పేర్కొన్నారు. కాపులను బీసీల్లో చేర్చే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రాజకీయ, స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని తాకట్టు పెట్టే నైజం తనది కాదని చెప్పారు. కాపు ఉద్యమం ఏ కులానికి, మతానికి,పార్టీకీ వ్యతిరేకం కాదని, అలాగని దేనికీ అనుకూలం కూడా కాదని పునరుద్ఘాటించారు.