భరూచ్/సురేంద్రనగర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికను ఒక ప్రహసంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఎన్నిక జరగకమునుపే ఫలితం వెల్లడయిందని, ఏఐసీసీకి రాహుల్‌గాంధీయే అధ్యక్షుడవుతారని అందరి కీ తెలిసిపోయిందన్నారు. దీనిని బట్టి సంస్థాగత ఎన్నికల్లోనూ ఆ పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వెల్లడయిందని వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సురేంద్రనగర్, భరూచ్‌లలో జరిగిన ర్యాలీల్లో ఆయన ప్రసంగించారు. పార్టీలోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు దేశాన్ని ఎలా కాపాడగలుగుతారని కాంగ్రెస్‌ను ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు రిగ్గింగ్ ఆనవాయితీగా మారిందన్నారు. ముందుగా ఆ పార్టీలోనే ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు నిర్వహిం చాలని సూచించారు.
జవహ ర్‌లాల్ నెహ్రూ కంటే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కే అప్పటి పార్టీ సమావేశంలో ఎక్కువ ఓట్లు వచ్చినా, కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడి నెహ్రూను ప్రధానిగా ఎన్నుకున్నారన్నారు. మొరార్జీ దేశాయ్ విషయం లోనూ ఇదే జరిగిందన్నారు. కాంగ్రెస్ నేత షెహ్‌జాద్ పూనావాలా కూడా పార్టీ అంతర్గత ఎన్నికల తీరును తప్పుబట్టారని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకులు తమ యువనేతను గద్దెపైన కూర్చోబెట్టేందుకు నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపించారు.
సమాజాన్ని విభజించాలని చూస్తోంది
కులాలు, మతాల ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని విభజించాలని చూస్తోందని ప్రధానమంత్రి మోదీ విరుచుకుపడ్డారు. అన్నదమ్ములమధ్య, ధనిక పేద, వర్గాల ప్రజలకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి, అక్షరాస్యులు, నిరక్షరాస్యులకు మధ్య విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఆయా కులాల నాయకులు హార్దిక్‌పటేల్, జిగ్నేష్ మెవానీ, అల్పేశ్ ఠాకూర్ వంటి వారితో ఒప్పందాలు చేసుకుంటోందని విమర్శించారు.
వాళ్లు చేయలేని పనిని మేం చేశాం..
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల విమర్శలను ప్రస్తావిస్తూ. వారు చేయలేని పనిని తాము చేస్తున్నందుకు కాంగ్రెస్‌కు మంటగా ఉందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ చౌకబారు విమర్శలకు చేస్తున్నారని అన్నారు. బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించటం వారికి ఇష్టం లేకుంటే ఎద్దుల బండ్లపై తిరగొచ్చునని ఎద్దేవాచేశారు.
జాతీయతే మనల్ని సాయపడేలా చేస్తుంది: మోదీ
అహ్మదాబాద్: జాతీయత భావమే తనకు, తన ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా ఉంటూ, క్రైస్తవులు సహా వివిధ వర్గాల ప్రజలకు సాయపడేలా చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఆదివారం ఆయన శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ విశ్వ విద్యాప్రతిష్టానమ్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. గాంధీనగర్ ఆర్చిబిషప్ థామస్ మెక్‌వాన్ గత నెలలో క్రైస్తవులకు రాసిన లేఖను ప్రస్తావించారు. జాతీయవాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలంటూ ప్రార్థన చేయాలని క్రైస్తవులను ఆ లేఖలో కోరటం తనను ఎంతో ఉత్తేజితుడిని చేసిందన్నారు. ఆ లేఖ ప్రతి భారతీయుడికి మార్గదర్శిగా పనిచేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment