internal elections
-
తెలంగాణకు శోభా కరంద్లాజే.. ఏపీకి పీసీ మోహన్
సాక్షి, న్యూఢిల్లీ: సంస్థాగత మార్పుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పార్టీ నూతన అధ్యక్షుల నియామకానికి శ్రీకారం చుట్టింది. సంక్రాంతిలోగా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కౌన్సిల్ సభ్యులను నియమించేందుకు వీలుగా ప్రత్యేక ఎన్నికల అధికారుల పేర్లను ఖరారు చేసింది. శుక్రవారం 29 మందితో కూడిన జాబితాను బీజేపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఎన్నికల అధికారిగా కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటకకు చెందిన లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్‌లను నియమించింది. వీరితో పాటు తమిళనాడుకు కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఉత్తరప్రదేశ్‌కు పీయూష్‌గోయల్, అండమాన్ నికోబార్‌కు తమిళిసై సౌందర్‌రాజన్, బిహార్‌కు మనోహర్‌లాల్ ఖట్టర్, కర్ణాటకకు శివరాజ్ సింగ్ చౌహాన్, గుజరాత్‌కు భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్‌కు ధర్మేంద్ర ప్రధాన్, పుదుచ్చేరికి తరుణ్ ఛుగ్‌లకు ఎన్నికల అధికారులుగా బాధ్యతలు అప్పగించింది. -
ప్రైమరీలో నెగ్గితేనే పార్టీ అభ్యర్థి
కర్ణాటక శాసనసభ ఎన్నికలకు తెరలేచింది. మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ప్రధానంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్) ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాయి. ప్రచారంలో దూసుకు పోతున్నాయి. బీజేపీ మాత్రం అభ్యర్థులపై ఇంకా ప్రకటన చేయలేదు. పైగా ఈ ఎన్నికల్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టడం ఆసక్తి కలిగిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీలు అమలు చేసే ‘ప్రైమరీ’లను బీజేపీ అందిపుచ్చుకుంది. ఒకరకంగా ఇవి అంతర్గత ఎన్నికలని చెప్పుకోవచ్చు. బీజేపీ టికెట్లపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పార్టీ నేతలు, కార్యకర్తలే ఎంపిక చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఇలాంటి విధానాన్ని అమలు చేయడం ఇదే మొదటిసారి. సగటున 150 మంది ఓటర్లు ► కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ నాయకత్వం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో ప్రైమరీలు నిర్వహించింది. ఈ ఎన్నికల ద్వారా ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు మెరుగైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో సగటున 150 మంది ఓటు వేశారు. నియోజకవర్గ స్థాయిలో బీజేపీ ఆఫీసు–బేరర్లు, మండల కమిటీల అధ్యక్షులు, సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాలైన మహిళా మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఓబీసీ మోర్చా, యూత్ మోర్చా, రైతు మోర్చా, మైనార్టీ మోర్చా సభ్యులు ఓటర్లుగా నమోదయ్యారు. ప్రతి నియోజకవర్గంలో అంతర్గత ఎన్నికల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించడానికి ఇద్దరు బీజేపీ సీనియర్ నాయ కులను అధిష్టానం నియమించింది. రాష్ట్రమంతటా ప్రైమరీలు సజావుగా ముగిశాయి. అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించాల్సి ఉంది. పార్టీ ఆశిస్తున్నదేమిటి? ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సామే. గ్రూప్‌లు, అంతర్గత కుమ్ములాటల నడుమ అందరినీ సంతృప్తిపరుస్తూ సమర్థున్ని ఎంపిక చేయాలి. రకరకాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతర్గత ఎన్నికల ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయానికి పెద్దపీట వేసినట్లు అవుతుందని, ఎక్కువ మందికి నచ్చిన అభ్యర్థే ఎన్నికల్లో పోటీకి దిగుతాడని, దాంతో విజయావకాశాలు రెట్టింపవుతాయని కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు నిర్మల్‌కుమార్ సురానా చెప్పారు. అసమ్మతిని చల్లార్చడానికి, అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి రావడానికి ప్రైమరీలు దోహదపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను కార్యకర్తల చేతుల్లోనే పెట్టామని అన్నారు. 10న తుది జాబితా ప్రకటన.. ► బీజేపీ ‘ప్రైమరీ’కసరత్తు బాగానే ఉన్నప్పటికీ ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మాత్రం గుబులు మొదలైంది. ఈసారి తమ టికెట్ గల్లంతు అవుతుందని, తమ స్థానాల్లోకి కొత్త అభ్యర్థులు వస్తారని బెంబేలెత్తిపోతున్నారు. అయితే, గెలిచే సామర్థ్యం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్మల్‌కుమార్ సురానా చెప్పారు. అంతర్గత ఎన్నికల ఫలితాలతోపాటు గెలిచే సత్తా, సామాజిక న్యాయం తదితర సమీకరణాల ఆధారంగా అభ్యర్థులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రైమరీల్లో మూడు పేర్లను ఎంపిక చేశారు. జిల్లా కోర్ కమిటీలు ఆయా పేర్లను క్షుణ్నంగా పరిశీలించాయి. సదరు ఔత్సాహిక నేతలతో స్వయంగా మాట్లాడాయి. జిల్లా కోర్ కమిటీల సూక్ష్మ పరిశీలన దాదాపు పూర్తయ్యింది. ఇందులో వెల్లడైన ఫలితాల ఆధారంగా అభ్యర్థులను రాష్ట్ర కోర్ కమిటీ ఖరారు చేయనుంది. తుది జాబితాను బీజేపీ కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు పంపిస్తారు. ఈ జాబితాలోని పేర్లను ఈ నెల 10వ తేదీన కేంద్ర పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. అంటే ఎన్నికలకు సరిగ్గా ఒక నెల ముందు బీజేపీ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది. ప్రజాస్వామిక విధానం.. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రైమరీల లాంటి ప్రయోగమే చేసింది. దీనికి ‘ఎంచుకో, ఎన్నుకో’అని పేరు పెట్టింది. ఇప్పుడు జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు రుసుము కింద ఆశావహులు రూ.2 లక్షల చొప్పున పార్టీకి చెల్లించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్ నాయకత్వం వసూళ్ల ప్రక్రియగా మార్చేసిందని బీజేపీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు చలవాది నారాయణస్వామి విమర్శించారు. తాము డబ్బుతో సంబంధం లేకుండా కార్యకర్తలను భాగస్వాములను చేస్తూ పూర్తి ప్రజాస్వామిక విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని వివరించారు. ప్రైమరీ ఎన్నికలు అంటే? ► అమెరికాలో పార్టీల తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులను ప్రజలు, పార్టీల్లో రిజిస్టర్ అయిన కార్యకర్తలు ఎంపిక చేస్తారు. ఈ ఎన్నికలనే ప్రైమరీ ఎన్నికలు అంటారు. ► అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఏ పార్టీ తరపున ఎవరు బరిలో ఉండాలన్నది మాత్రమే నిర్ణయిస్తారు. ► సాధారణ ప్రజలు ఓటు వేసే ఎన్నికను ఓపెన్ ప్రైమరీ, పార్టీ కార్యకర్తలు ఓటు వేసే ఎన్నికను క్లోజ్డ్ ప్రైమరీగా వ్యవహరిస్తారు. ► అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగే పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను బడా నేతలు, ప్రముఖుల కు కాకుండా ప్రజలకు, పార్టీల కార్యకర్తలకు అప్పగించాలన్నదే ఈ ప్రైమరీల ఉద్దేశం. ► అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయా లనుకునేవారు ప్రైమరీలతో పనిలేకుండా నేరుగా నామినేషన్ దాఖలు చేయొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పార్టీ ఎన్నికల్లోనూ రిగ్గింగేనా?
భరూచ్/సురేంద్రనగర్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికను ఒక ప్రహసంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఎన్నిక జరగకమునుపే ఫలితం వెల్లడయిందని, ఏఐసీసీకి రాహుల్‌గాంధీయే అధ్యక్షుడవుతారని అందరి కీ తెలిసిపోయిందన్నారు. దీనిని బట్టి సంస్థాగత ఎన్నికల్లోనూ ఆ పార్టీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వెల్లడయిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సురేంద్రనగర్, భరూచ్లలో జరిగిన ర్యాలీల్లో ఆయన ప్రసంగించారు. పార్టీలోనే ప్రజాస్వామ్యం లేనప్పుడు దేశాన్ని ఎలా కాపాడగలుగుతారని కాంగ్రెస్‌ను ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు రిగ్గింగ్ ఆనవాయితీగా మారిందన్నారు. ముందుగా ఆ పార్టీలోనే ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు నిర్వహిం చాలని సూచించారు. జవహ ర్లాల్ నెహ్రూ కంటే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కే అప్పటి పార్టీ సమావేశంలో ఎక్కువ ఓట్లు వచ్చినా, కాంగ్రెస్ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడి నెహ్రూను ప్రధానిగా ఎన్నుకున్నారన్నారు. మొరార్జీ దేశాయ్ విషయం లోనూ ఇదే జరిగిందన్నారు. కాంగ్రెస్ నేత షెహ్జాద్ పూనావాలా కూడా పార్టీ అంతర్గత ఎన్నికల తీరును తప్పుబట్టారని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకులు తమ యువనేతను గద్దెపైన కూర్చోబెట్టేందుకు నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఆరోపించారు. సమాజాన్ని విభజించాలని చూస్తోంది కులాలు, మతాల ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ సమాజాన్ని విభజించాలని చూస్తోందని ప్రధానమంత్రి మోదీ విరుచుకుపడ్డారు. అన్నదమ్ములమధ్య, ధనిక పేద, వర్గాల ప్రజలకు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి, అక్షరాస్యులు, నిరక్షరాస్యులకు మధ్య విభేదాలు సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఆయా కులాల నాయకులు హార్దిక్‌పటేల్, జిగ్నేష్ మెవానీ, అల్పేశ్ ఠాకూర్ వంటి వారితో ఒప్పందాలు చేసుకుంటోందని విమర్శించారు. వాళ్లు చేయలేని పనిని మేం చేశాం.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతల విమర్శలను ప్రస్తావిస్తూ. వారు చేయలేని పనిని తాము చేస్తున్నందుకు కాంగ్రెస్‌కు మంటగా ఉందన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చౌకబారు విమర్శలకు చేస్తున్నారని అన్నారు. బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించటం వారికి ఇష్టం లేకుంటే ఎద్దుల బండ్లపై తిరగొచ్చునని ఎద్దేవాచేశారు. జాతీయతే మనల్ని సాయపడేలా చేస్తుంది: మోదీ అహ్మదాబాద్: జాతీయత భావమే తనకు, తన ప్రభుత్వానికి ప్రోత్సాహకంగా ఉంటూ, క్రైస్తవులు సహా వివిధ వర్గాల ప్రజలకు సాయపడేలా చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఆదివారం ఆయన శ్రీ స్వామి నారాయణ్ గురుకుల్ విశ్వ విద్యాప్రతిష్టానమ్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. గాంధీనగర్ ఆర్చిబిషప్ థామస్ మెక్వాన్ గత నెలలో క్రైస్తవులకు రాసిన లేఖను ప్రస్తావించారు. జాతీయవాద శక్తుల నుంచి దేశాన్ని కాపాడాలంటూ ప్రార్థన చేయాలని క్రైస్తవులను ఆ లేఖలో కోరటం తనను ఎంతో ఉత్తేజితుడిని చేసిందన్నారు. ఆ లేఖ ప్రతి భారతీయుడికి మార్గదర్శిగా పనిచేస్తుందన్నారు. -
20న టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్ష ఎన్నికలు
సంస్థాగత ఎన్నికల ప్రక్రియ అంతిమ దశకు వచ్చిందని, ఈ నెల 20న గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎన్నికల ఇన్చార్జ్ పెద్ది సుదర్శన్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ మైనంపల్లి హన్మంతరావు వెల్లడించారు. తెలంగాణభవన్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ క్రియాశీల, సాధారణ సభ్యత్వం కలిపి రాష్ట్రంలో 55.65 లక్షలు పూర్తయినట్టుగా చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల కమిటీలకు అధ్యక్షులు, అనుబంధసంఘాలకు ఎన్నికలు పూర్తయ్యాయన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షస్థానానికి ఈ నెల 20న ఎన్నికలు జరుగుతాయన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి ఎన్నికల పరిశీలకునిగా హాజరవుతారని, మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహ్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ సమక్షంలో ఎన్నికలు జరుగుతాయని పెద్ది, మైనంపల్లి వివరించారు.