ప్రైమరీలో నెగ్గితేనే పార్టీ అభ్యర్థి | Karnataka assembly elections 2023: BJP takes leaf out of US primaries to pick nominees | Sakshi
Sakshi News home page

Karnataka assembly elections 2023: ప్రైమరీలో నెగ్గితేనే పార్టీ అభ్యర్థి

Published Tue, Apr 4 2023 5:29 AM | Last Updated on Thu, Apr 20 2023 5:26 PM

Karnataka assembly elections 2023: BJP takes leaf out of US primaries to pick nominees - Sakshi

కర్ణాటక శాసనసభ ఎన్నికలకు తెరలేచింది. మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. ప్రధానంగా అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీ(ఎస్‌) ముందంజలో ఉన్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్‌) ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించాయి. ప్రచారంలో దూసుకు పోతున్నాయి.

బీజేపీ మాత్రం అభ్యర్థులపై ఇంకా ప్రకటన చేయలేదు. పైగా ఈ ఎన్నికల్లో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టడం ఆసక్తి కలిగిస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పార్టీలు అమలు చేసే ‘ప్రైమరీ’లను బీజేపీ అందిపుచ్చుకుంది. ఒకరకంగా ఇవి అంతర్గత ఎన్నికలని చెప్పుకోవచ్చు. బీజేపీ టికెట్లపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను పార్టీ నేతలు, కార్యకర్తలే ఎంపిక చేస్తున్నారు. కర్ణాటకలో బీజేపీ ఇలాంటి విధానాన్ని అమలు చేయడం ఇదే మొదటిసారి.  

సగటున 150 మంది ఓటర్లు  
► కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. బీజేపీ నాయకత్వం శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల స్థాయిలో ప్రైమరీలు నిర్వహించింది. ఈ ఎన్నికల ద్వారా ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురు మెరుగైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రతి అసెంబ్లీ స్థానంలో సగటున 150 మంది ఓటు వేశారు. నియోజకవర్గ స్థాయిలో బీజేపీ ఆఫీసు–బేరర్లు, మండల కమిటీల అధ్యక్షులు, సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాలైన మహిళా మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఓబీసీ మోర్చా, యూత్‌ మోర్చా, రైతు మోర్చా, మైనార్టీ మోర్చా సభ్యులు ఓటర్లుగా నమోదయ్యారు. ప్రతి నియోజకవర్గంలో అంతర్గత ఎన్నికల ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించడానికి ఇద్దరు బీజేపీ సీనియర్‌ నాయ కులను అధిష్టానం నియమించింది. రాష్ట్రమంతటా ప్రైమరీలు సజావుగా ముగిశాయి. అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించాల్సి ఉంది.  

పార్టీ ఆశిస్తున్నదేమిటి?  
ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సామే. గ్రూప్‌లు, అంతర్గత కుమ్ములాటల నడుమ అందరినీ సంతృప్తిపరుస్తూ సమర్థున్ని ఎంపిక చేయాలి. రకరకాల సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాలి. అంతర్గత ఎన్నికల ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయానికి పెద్దపీట వేసినట్లు అవుతుందని, ఎక్కువ మందికి నచ్చిన అభ్యర్థే ఎన్నికల్లో పోటీకి దిగుతాడని, దాంతో విజయావకాశాలు రెట్టింపవుతాయని కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు నిర్మల్‌కుమార్‌ సురానా చెప్పారు. అసమ్మతిని చల్లార్చడానికి, అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి రావడానికి ప్రైమరీలు దోహదపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను కార్యకర్తల చేతుల్లోనే పెట్టామని అన్నారు.

10న తుది జాబితా ప్రకటన..  
► బీజేపీ ‘ప్రైమరీ’కసరత్తు బాగానే ఉన్నప్పటికీ ఆ పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో మాత్రం గుబులు మొదలైంది. ఈసారి తమ టికెట్‌ గల్లంతు అవుతుందని, తమ స్థానాల్లోకి కొత్త అభ్యర్థులు వస్తారని బెంబేలెత్తిపోతున్నారు. అయితే, గెలిచే సామర్థ్యం ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిర్మల్‌కుమార్‌ సురానా చెప్పారు. అంతర్గత ఎన్నికల ఫలితాలతోపాటు గెలిచే సత్తా, సామాజిక న్యాయం తదితర సమీకరణాల ఆధారంగా అభ్యర్థులపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రైమరీల్లో మూడు పేర్లను ఎంపిక చేశారు. జిల్లా కోర్‌ కమిటీలు ఆయా పేర్లను క్షుణ్నంగా పరిశీలించాయి. సదరు ఔత్సాహిక నేతలతో స్వయంగా మాట్లాడాయి. జిల్లా కోర్‌ కమిటీల సూక్ష్మ పరిశీలన దాదాపు పూర్తయ్యింది. ఇందులో వెల్లడైన ఫలితాల ఆధారంగా అభ్యర్థులను రాష్ట్ర కోర్‌ కమిటీ ఖరారు చేయనుంది. తుది జాబితాను బీజేపీ కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు పంపిస్తారు. ఈ జాబితాలోని పేర్లను ఈ నెల 10వ తేదీన కేంద్ర పార్లమెంటరీ బోర్డు అధికారికంగా ప్రకటించనుంది. అంటే ఎన్నికలకు సరిగ్గా ఒక నెల ముందు బీజేపీ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుంది.

ప్రజాస్వామిక విధానం..
2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రైమరీల లాంటి ప్రయోగమే చేసింది. దీనికి ‘ఎంచుకో, ఎన్నుకో’అని పేరు పెట్టింది. ఇప్పుడు జరుగుతున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తు రుసుము కింద ఆశావహులు రూ.2 లక్షల చొప్పున పార్టీకి చెల్లించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కాంగ్రెస్‌ నాయకత్వం వసూళ్ల ప్రక్రియగా మార్చేసిందని బీజేపీ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యుడు చలవాది నారాయణస్వామి విమర్శించారు. తాము డబ్బుతో సంబంధం లేకుండా కార్యకర్తలను భాగస్వాములను చేస్తూ పూర్తి ప్రజాస్వామిక విధానంలో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని వివరించారు.  

ప్రైమరీ ఎన్నికలు అంటే?
► అమెరికాలో పార్టీల తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థులను ప్రజలు, పార్టీల్లో రిజిస్టర్‌ అయిన కార్యకర్తలు ఎంపిక చేస్తారు. ఈ ఎన్నికలనే ప్రైమరీ ఎన్నికలు అంటారు.
► అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకోరు. ఏ పార్టీ తరపున ఎవరు బరిలో ఉండాలన్నది మాత్రమే నిర్ణయిస్తారు.  
► సాధారణ ప్రజలు ఓటు వేసే ఎన్నికను ఓపెన్‌ ప్రైమరీ, పార్టీ కార్యకర్తలు ఓటు వేసే ఎన్నికను క్లోజ్డ్‌ ప్రైమరీగా వ్యవహరిస్తారు.
► అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగే పార్టీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను బడా నేతలు, ప్రముఖుల కు కాకుండా ప్రజలకు, పార్టీల కార్యకర్తలకు అప్పగించాలన్నదే ఈ ప్రైమరీల ఉద్దేశం.
► అధ్యక్ష ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయా లనుకునేవారు ప్రైమరీలతో పనిలేకుండా నేరుగా నామినేషన్‌ దాఖలు చేయొచ్చు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement