కేటీఆర్‌పై ఫోన్ ట్యాపింగ్ విమర్శలు
చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హైకోర్టుకు తెలిపిన ఈసీ విచారణ ముగింపు
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును టార్గెట్ చేస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలియజేసింది. దీంతో బీఆర్‌ఎస్ పిటిషన్‌లో విచారణను న్యాయస్థానం ముగించింది. ఎలాంటి ఆధారాలు లేకున్నా ఫోన్ ట్యాపింగ్ కేసును తమ పార్టీకి, నాయకులకు అంటగట్టాలని కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు చూస్తూ.. రెచ్చగొట్టేలా, పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసి అలాంటి వ్యాఖ్యలను అడ్డుకోవాలని కోరినా చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మార్చి 29న సీఎం రేవంత్‌రెడ్డి, ఏప్రిల్ 1న మంత్రి కొండా సురేఖ, ఏప్రిల్ 6న తుక్కుగూడ సభలో రాహుల్ గాం««ధీ, మరో సందర్భంలో బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్‌కు కేటీఆర్‌కు సంబంధం ఉందని నిరాధార విమర్శలు చేశారన్నారు.
ఈసీకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. బీఆర్‌ఎస్ ఇచ్చిన ఫిర్యాదును 3వ తేదీ(శుక్రవారం) పరిష్కరించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. దీంతో ఈ పిటిషన్‌లో విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment