సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నం తెలుగుదేశం పార్టీలో మరోసారి రచ్చ జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి ఎంపిక సర్వే కలకలం రేపుతోంది. ఐవీఆర్‌ఓఎస్, ఎస్‌ఎంఎస్ పేరుతో జరుగుతున్న అభిప్రాయ సేకరణలో ఏది వాస్తవమో, ఏది నకిలీయో తెలియదు గాని రెండు వర్గాల మధ్య చిచ్చు రేపింది. టిక్కెట్ ఆశిస్తున్న కలమట వెంకట రమణ, మామిడి గోవిందరావు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వీరి మధ్య ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా బాహాబాహీకి దిగుతున్నాయి.
ఇద్దరికన్నా నోటాకే ఎక్కువ అభిప్రాయాలు
అధిష్టానం చేస్తుందో, ప్రైవేటు ఏజెన్సీలు చేస్తున్నాయో తెలియదు గానీ అభిప్రాయ సేకరణ పేరుతో నియోజకవర్గంలో రచ్చ నడుస్తోంది. ఒకసారి వెంకటరమణ, గోవిందరావు, కలమట సాగర్ పేరుతో అభిప్రాయ సేకరణ జరగ్గా.. మామిడికి ఎక్కువ సానుకూలత ఉన్నట్టు వారిలో వారే ప్రచారం చేసుకున్నారు. మరోసారి వెంకటరమణ, గోవిందరావు నోటా పేరుతో అభిప్రాయ సేకరణ జరగ్గా ఇద్దరి కన్న నోటాకే ఎక్కువ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇంకోసారి జరిగిన అభిప్రాయ సేకరణలో మామిడి కన్న కలమటకు ఎక్కువ మద్దతు వచ్చినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నారు. తాజాగా గోవిందరావు ప్రస్తావన లేకుండా వెంకటరమణ, జనసేన నాయకుడు గేదెల చైతన్య, నోటా పేరుతో అభిప్రాయ సేకరణ జరిగిందని టీడీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.
సోషల్ మీడియాలో రచ్చ
మరోవైపు గోవిందరావు జనసేన తీర్థం పుచ్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై గోవిందరావు తనపై ఫేక్ ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పాతపట్నం పోలీసు స్టేషన్‌లో కేసు పెడతానని సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. తమకు అనుకూలంగా వస్తే అసలైన సర్వే అని, వ్యతిరేకంగా వస్తే ఫేక్ సర్వే అని రెండు వర్గాలు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తున్నాయి.
కుమ్ములాటలు కొత్తకాదు..
పాతపట్నం టీడీపీలో కుమ్ములాటలు కొత్త కాదు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, మామిడి గోవిందరావు మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లిపోయింది. తరచూ పార్టీలు మార్చి అక్రమాలకు పాల్పడ్డారని, వంశధార నిర్వాసితుల పరిహారాన్ని మింగేయడమేన కాకుండా ప్యాకేజీ కోసం ఎమ్మెల్యేగా ఉండి పార్టీ ఫిరాయించారని మాజీ ఎమ్మెల్యే వెంకటరమణపై గోవిందరావు వర్గీయులు ఆరోపణలు చేస్తున్నారు.
దానికి ధీటుగా గోవిందరావుపై వెంకటరమణ వర్గం అంతే విమర్శలతో తిప్పికొడుతున్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో భూదందాలు చేశారని, ఆ డబ్బులతో రాజకీయం చేస్తున్నారని, పార్టీ పెద్దలంతా తన వెనకే ఉన్నారంటూ గోవిందరావుపై విమర్శలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment