భోపాల్: మన దేశంలో వైద్యం.. సగటు మనిషికి ఇంకా అందనంత దూరంలోనే ఉంది. ఒకవైపు జనాలకు సరిపడా వైద్య సిబ్బంది లేనేలేరు. మరోవైపు.. నిత్యం ఏదో ఒక ఘటన వైద్య సౌకర్యాల, సదుపాయాల డొల్లతనాన్ని బయటపడుతూనే ఉంది. అలాంటిదే వైరల్ అవుతున్న ఈ ఘటన.
మధ్యప్రదేశ్ ఛతార్‌పూర్ జిల్లాలో తాజాగా జరిగిన ఓ ఘటన వైరల్ అవుతోంది. నాలుగేళ్ల పసికందు శవాన్ని భుజాన వేసుకుని కాలినడకన చేరుకున్నాడు ఓ తండ్రి. దారిలో ఉన్న ఓ ఊరి ప్రజలు కొందరు తీసిన ఈ వీడియో వైరల్ కావడంతో వైద్యాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆ చిన్నారి కుటుంబం పౌడీ గ్రామానికి చెందింది. సోమవారం ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తొలుత ఆమె కుటుంబం బుక్స్‌వాహా హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లింది. ఆపై పరిస్థితి విషమించడంతో మంగళవారం దామోహ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే అదేరోజు ఆ చిన్నారి కన్నుమూసింది.
బిడ్డ శవాన్ని ఊరికి తీసుకెళ్లేందుకు ఆంబులెన్స్ కోసం విజ్ఞప్తి చేయగా.. ఆస్పత్రి సిబ్బంది సానుకూలంగా స్పందించలేదు. దీంతో బిడ్డ శవాన్ని దుప్పటితో కప్పి.. నిద్రపోయినట్లుగా.. ఓ బస్సులో బుక్స్‌వాహాకు చేసుకున్నాడు ఆ బిడ్డ తండ్రి. అక్కడ బిడ్డ తండ్రి, నగర్ పంచాయితీ వాళ్లను ఏదైనా వాహనం సమకూర్చమని అడిగాడు. కానీ, అధికారులు అందుకు ఒప్పుకోలేదు. దీంతో డబ్బుల్లేక.. అక్కడి నుంచి కాలినడకనే బిడ్డ శవాన్ని భుజాన మోసుకుంటూ వెళ్లాడు ఆ తండ్రి. చివరికి.. ఓ ఊరి ప్రజలు ఆ ఘటనను వీడియో తీయడంతో పాటు ఆ బిడ్డ తండ్రికి సాయం చేశారు.
A family in Chhatarpur had to carry the dead body of a four-year-old girl on their shoulders as the authorities allegedly did not provide a hearse to them to return to their village @ndtv @ndtvindia pic.twitter.com/vyTJ0meRpp
— Anurag Dwary (@Anurag_Dwary) June 10, 2022
ఇదిలా ఉంటే.. సాగర్ జిల్లా గధాకోటలో ఓ వ్యక్తి చనిపోతే ఆంబులెన్స్‌కు నిరాకరించారు ఆస్పత్రి సిబ్బంది. గత్యంతరం లేక తోపుడుబండి మీద సోదరుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడు ఓ వ్యక్తి. మరో ఘటనలో భగవాన్‌పుర దగ్గర గర్భిణికి సకాలంలో ఆంబులెన్స్ అందకపోవడంతో కన్నుమూసింది. ఈ మూడు ఘటనలు వరుసగా వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ఆరోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. ఘటనలపై దర్యాప్తునకు ఆదేశించింది.
అయితే దామోహ్ ఘటనపై ఆస్పత్రి అధికారులు స్పందిస్తూ.. ఆంబులెన్స్ కోసం తమకు ఎలాంటి విజ్ఞప్తి రాలేదని చెప్తున్నారు. గధాకోట ఘటనపై మెడికల్ ఆఫీసర్ సుయాష్‌స్పందిస్తూ.. పోస్ట్ మార్టం అయ్యేదాకా ఎదురు చూడమంటే.. వినిపించుకోకుండా మృతదేహాన్ని తీసుకెళ్లారని చెప్పారు. భగవాన్‌పుర ఘటనపై మాత్రం దర్యాప్తునకు ఆదేశించినట్లు వైద్యాధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment