ఈమధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రతీ అంశానికి భారత్‌ను ముడిపెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అయితే కిందటి ఏడాది పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ) సాక్షిగా ఇమ్రాన్ చేసిన సీరియస్ కామెంట్లు.. ఇప్పుడు తెరపైకి వచ్చి దుమారం రేపుతున్నాయి. ఉగ్రసంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ సమాజం దృష్టిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా పేరున్న ఒసామా బిన్ లాడెన్‌ను ‘అమరవీరుడి’గా ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇమ్రాన్‌ను వెనకేసుకొస్తున్నారు అక్కడి మంత్రులు.
ఇస్లామాబాద్: ‘‘పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వకుండానే అమెరికా దళాలు ఇక్కడి గగనతలంలో అడుగుపెట్టాయి. అబ్బొట్టాబాద్ లో అక్రమంగా ఆపరేషన్ నిర్వహించి ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుపెట్టాయి. దీంతో లాడెన్ అమరుడయ్యాడు. ఆ సందర్భంలో మన దేశం చాలా ఇబ్బంది పడింద’’ని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో ప్రసగించాడు. అయితే, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఇమ్రాన్‌ఖాన్‌పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇమ్రాన్ కామెంట్లపై పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి వివరణిచ్చాడు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొరబాటున నోరుజారి ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చాడు.
ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పటికీ ఓ ఉగ్రవాదిగానే భావిస్తుందని, అల్ ఖైదాను ఓ ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తామని ఫవాద్ స్పష్టం చేశాడు. అయినా, ఇమ్రాన్ వ్యాఖ్యలను వంకర కోణంలో చూస్తున్నారని పేర్కొన్నారు. పాక్ మీడియాలోని ఓ వర్గం దీన్ని భూతద్దంలో చూపిస్తోందని మండిపడ్డాడు. ఇంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి ముహమ్మద్ ఖురేషీ కూడా.. ఇమ్రాన్ వ్యాఖ్యలు అసందర్భోచితమైనవని చెప్పాడు. అమెరికా భద్రతా దళాలకు భయపడి బిన్ లాడెన్ పాకిస్థాన్ లోని అబ్బొట్టాబాద్ లో తలదాచుకోగా, అమెరికా నేవీ సీల్స్ కమాండోలు 2011లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి లాడెన్‌ను మట్టుపెట్టాయి.
బాలీవుడ్‌ను కాపీ కొట్టకండి
ఇదిలా ఉంటే బాలీవుడ్‌ను కాపీ కొట్టొద్దంటూ పాక్ ఫిల్మ్‌మేకర్లను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరాడు. ఇస్లామాబాద్‌లో జరిగిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ సినిమా.. బాలీవుడ్ వల్ల బాగా ప్రభావితం అయ్యిందని వ్యాఖ్యానించాడు. పాక్ సినిమా అక్కడి(భారత్) కల్చర్‌ను చూపిస్తోంది. ఇది పరోక్షంగా మరో దేశపు కల్చర్‌ను ప్రోత్సహించడమే అవుతుంది. ఇక్కడి నేటివిటీని చూపించే ప్రయత్నం చేయండి. సినిమాలు పోతాయని భయపడకండి. ఓటమికి భయపడితే గెలవలేం. నా స్వానుభవంతో చెప్తున్నా’ ఫిల్మ్ మేకర్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్.
Comments
Please login to add a commentAdd a comment