
సాక్షి, కడప : ఇసుకపై ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు చేసే కపట దీక్షలను ప్రజలు నమ్మబోరని వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబు అన్నారు. గురువారం కడపలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ లేని విధంగా నూతన పాలసీని తీసుకొని ఉచిత ఇసుక పేరుతో వేలకోట్లు దోచేసిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.
ఎన్నో ఏళ్ల నుంచి క్యూబిక్ మీటర్ రూ.90–120గా ఉన్న దాన్ని అమాంతం పెంచేసి రైతులకు ఇవ్వకుండా, మామూళ్లు, టోల్‌గేట్లుపెట్టి, ఇతర రాష్ట్రాలకు తరలించి వేల కోట్లు దోపిడీ చేశారన్నారు. తెలంగాణలో నూతన ఇసుక పాలసీ ద్వారా రూ. 2900కోట్లు ఆదాయం రాగా, టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీలో రూ.50కోట్లకు మించి రాలేదన్నారు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుందని తహసీల్దార్ వనజాక్షిని దెందులూరు ఎమ్మె ల్యే చింతమనేని ప్రభాకర్ జుట్టు పట్టి ఈడ్చినా అతనిపై కేసు పెట్టకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రే రాజీ చేసిన విషయాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదన్నారు. ఇసుక మాఫియాగా ఏర్పడి టీడీపీ నేతలు సాగించిన అక్రమాల వల్లే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైందని ఎద్దేవా చేశారు.
టీడీపీ సర్కార్ చేసిన తప్పులను తమ ప్రభుత్వం చేసేందుకు సిద్ధగా లేదన్నారు. వరదలు తగ్గుముఖం పట్టినందున కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉందన్నారు. అందుకే కిలోమీటర్‌కు రూ.4.90 లతో ఇసుక ధర నిర్ణయించి సరఫరా చేస్తున్నామని, కొత్త రీచ్‌లు ఏర్పాటు చేసిన ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లపాటు ఇసుక దోపిడీ చేసి ఇప్పుడు తగుదునమ్మా అంటూ చంద్రబాబు దీక్ష చేయడం హాస్యాస్పదమని అన్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక కడుపు మంటతో దీక్ష చేస్తున్నారని, ఇలాంటివాటిని ప్రజలు నమ్మరని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment