వాషింగ్టన్: అమెరికాకు చెందిన అండర్‌వాటర్ టూరిజం కంపెనీ ఓషన్‌గేట్ తీరుపై మరోసారి తారాస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో ఐదుగురి ప్రాణాలను బలిగొన్న టైటాన్ సబ్ మెర్సిబుల్ విషాదం జరిగి పట్టుమని పదిరోజులు గడవక ముందే.. టైటానిక్ శకలాలు చూద్దమురారండి అంటూ యాడ్స్‌తో మళ్లీ ఊదరగొడుతోంది.
అట్లాంటిక్‌లో మునిగిన టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు ఇదే మా ఆహ్వానమంటూ తాజాగా ఓషన్‌గేట్ కంపెనీ ప్రకటనలు ఇచ్చింది. ఒక వైపు శకలాలను బయటకు తీసుకురావడం.. ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓషన్‌గేట్ వెబ్‌సైట్ ప్రకారం.. వచ్చే ఏడాది రెండు ట్రిప్‌లకు ప్రకటన ఇచ్చుకుంది. 2024 జూన్ 12వ తేదీ నుంచి జూన్ 20 మధ్య, అలాగే 2024 జూన్ 21 నుంచి జూన్ 29 మధ్య రెండు ట్రిప్పులు ప్లాన్ చేసినట్లు ఓషన్‌గేట్ కంపెనీ ఆ ప్రకటనల్లో పేర్కొంది. టికెట్ ధరను 2,50,000 డాలర్లుగా ప్రకటించింది. అయితే అది టైటాన్‌లోనా? మరేయిత సబ్‌మెర్సిబుల్‌లోనా? అనేది మాత్రం స్పష్టత ఇవ్వలేదు.
ఇక సబ్ పైలట్ పొజిషన్ కోసం సైతం కంపెనీ ఓ యాడ్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే.. టైటాన్ శకలాల గాలింపు కొనసాగిన వేళ ఈ పరిణామం చోటు చేసుకోగా.. విమర్శల నేపథ్యంలో ఆ జాబ్ యాడ్‌ను తొలగించింది ఓషన్‌గేట్.
టైటాన్ విషాదం తర్వాత వెల్లువెత్తిన విమర్శల నేపథ్యంలో ఓషన్‌గేట్ ఇకపై ఇలాంటి టూర్‌లు నిర్వహించదని అంతా భావించారు. పైగా ఈ ప్రమాదంలో కంపెనీ సీఈవో స్టాక్‌టన్ రష్ కూడా దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే కదా. కానీ, అనూహ్యంగా కంపెనీ మళ్లీ టైటానిక్ టూర్‌ను నిర్వహించేందుకు రెడీ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓషన్‌గేట్ టైటాన్ ప్రయాణంపై గతంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. సబ్ మెర్సిబుల్ నిర్మాణం అట్లాంటిక్ లోతుల్లో ప్రయాణానికి అనుకూలం కాదంటూ పలువురు నిపుణులు తేల్చేశారు కూడా. పైగా వీడియో గేమ్‌ల తరహా రిమోట్‌కంట్రోల్‌తో టైటాన్‌ను కంట్రోల్ చేయించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ టైటాన్‌తోనే టూరిజం వైపు మొగ్గు చూపించి.. ఐదుగురి ప్రాణాలు పోవడానికి కారణమైంది కంపెనీ.
ఇదీ చదవండి: ఐదు కోట్ల మందికి మూడేసి చొప్పున పుట్టిన తేదీలు!
Comments
Please login to add a commentAdd a comment