నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. బంధువులే అతని కాళ్లు పట్టుకుని వైద్యుని దగ్గరకు లాక్కెళ్లారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి.
గత నెల 31న సాయంత్రం జబ్బు పడిన ఓ వ్యక్తిని అతని బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఓపీకి కొద్ది దూరంలో కూర్చోబెట్టారు. ఓపీ మధ్యాహ్నం వరకే ఉండటంతో అతను ఆ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తరువాత... అతడితో వచ్చి న వారు ఓపీలో రిజిస్టర్ చేయించారు. వారు అతడిని రెండో అంతస్తులో వైద్యుడి వద్దకు వెళ్లాలని ఓపీ రాసిచ్చారు. అనంతరం ఆ వ్యక్తిని లిఫ్ట్ వరకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ అవసరం పడింది.
అక్కడ స్ట్రెచర్ లేకపోవటంతో బంధువులు అతని కాళ్లు పట్టి లాక్కెళ్లారు. అక్కడ ఉన్నవారు అది చూసి ఆశ్చర్యపోయారు. రోగి కాళ్లు పట్టి లాగుతున్నా అక్కడి వైద్య సిబ్బంది పట్టించుకోక పోవటం గమనార్హం. అతడిని రెండో అంతస్తుకు చేర్చాక అక్కడ కూడ స్ట్రెచర్, వీల్ చైర్ అందుబాటులో లేకపోవటంతో అక్కడి నుంచి కూడా వైద్యుడి గది వరకు కాళ్లు పట్టి లాక్కెళ్లారు. స్ట్రెచర్, వీల్‌చైర్ లేకపోవడం, లాక్కెళుతున్నా సిబ్బంది పట్టించుకోక పోవటంపై విమర్శలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment