Stretcher
-
కాలులేని భార్యను భుజంపై మోసుకొని..
ఎంజీఎం: వరంగల్ ఎంజీఎంలో స్ట్రెచర్ అందుబాటులో లేక చికిత్స అనంతరం ఓ వృద్ధుడు తన భార్యను భుజాలపై మోసుకెళ్లిన ఘటన శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన మాలోతు లక్ష్మికి నవంబర్‌లో కుడికాలి రక్తప్రసరణ ఆగిపోయింది. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు మోకాలు కింద నుంచి కాలును తొలగించారు. రోగిని 15 రోజులకోసారి డ్రెస్సింగ్ కోసం తీసుకురావాలని సూచించారు. దీంతో లక్ష్మి ని ఆమె భర్త శుక్రవారం ఆస్పత్రికి తీసుకుచ్చాడు. అక్కడున్న సిబ్బంది ‘పెద్ద సార్ లేరు.. రేపు రావాలని చెప్పారు. ఆ సమయంలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో మండుతున్న ఎండలోనే భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లాడు. ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్పందించారు. డ్రెస్సింగ్ అనంతరం సిబ్బంది రోగిని వీల్‌చైర్‌లో క్యాజువాలిటీ నుంచి బయటకు తీసుకొచ్చారన్నారు. కాలిపర్ (కాలుకు అమర్చే లోహ పరికరం) కోసం వెళ్లగా శనివారం అందుబాటులో ఉంటుందని, అప్పుడు రావాలని సిబ్బంది చెప్పారన్నారు. తిరిగి వెళ్లే క్రమంలో ఎండ తీవ్రత దృష్ట్యా భర్త తన భార్యను ఒక చెట్టు వద్దకు తీసుకెళ్లేందుకు భుజంపై ఎక్కించుకొని వెళ్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారన్నారు. ఇలాంటి ఘటనలతో ఆస్పత్రిని అభాసుపాలు చేయవద్దని కోరారు. -
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. రోగి కాళ్లు పట్టి లాక్కెళ్లారు..
నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అనారోగ్య సమస్యతో నడవలేని స్థితిలో ఓ రోగి ఆస్పత్రికి వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేక.. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోక.. బంధువులే అతని కాళ్లు పట్టుకుని వైద్యుని దగ్గరకు లాక్కెళ్లారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. గత నెల 31న సాయంత్రం జబ్బు పడిన ఓ వ్యక్తిని అతని బంధువులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఓపీకి కొద్ది దూరంలో కూర్చోబెట్టారు. ఓపీ మధ్యాహ్నం వరకే ఉండటంతో అతను ఆ రాత్రంతా అక్కడే ఉండిపోయాడు. మరుసటి రోజు ఏప్రిల్ 1న ఉదయం ఓపీ ప్రారంభమైన తరువాత... అతడితో వచ్చి న వారు ఓపీలో రిజిస్టర్ చేయించారు. వారు అతడిని రెండో అంతస్తులో వైద్యుడి వద్దకు వెళ్లాలని ఓపీ రాసిచ్చారు. అనంతరం ఆ వ్యక్తిని లిఫ్ట్ వరకు తీసుకెళ్లడానికి స్ట్రెచర్ అవసరం పడింది. అక్కడ స్ట్రెచర్ లేకపోవటంతో బంధువులు అతని కాళ్లు పట్టి లాక్కెళ్లారు. అక్కడ ఉన్నవారు అది చూసి ఆశ్చర్యపోయారు. రోగి కాళ్లు పట్టి లాగుతున్నా అక్కడి వైద్య సిబ్బంది పట్టించుకోక పోవటం గమనార్హం. అతడిని రెండో అంతస్తుకు చేర్చాక అక్కడ కూడ స్ట్రెచర్, వీల్ చైర్ అందుబాటులో లేకపోవటంతో అక్కడి నుంచి కూడా వైద్యుడి గది వరకు కాళ్లు పట్టి లాక్కెళ్లారు. స్ట్రెచర్, వీల్‌చైర్ లేకపోవడం, లాక్కెళుతున్నా సిబ్బంది పట్టించుకోక పోవటంపై విమర్శలు వస్తున్నాయి. -
పేరుకే పెద్ద ఆస్పత్రి..కనీసం స్ట్రెచర్ లేక వృద్ధుడి పాట్లు: వీడియో వైరల్
కొన్ని ప్రభుత్వాస్పత్రులు పేరుకే పెద్ద ఆస్పత్రులు గానీ అందులో సౌకర్యాలు మాత్రం నిల్. దీంతో చికిత్స కోసం వచ్చే రోగులు పడే ఇబ్బందులు అంత ఇంత కాదు. చిన చితక పనులు చేసుకునే పేదలకు ఆ ఆస్పత్రులే గతి. దీంతో అక్కడ ప్రభుత్వోద్యోగులు వీళ్లపట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటారు. అచ్చం అలాంటి పరిస్థితి ఓ ప్రభుత్వాస్పత్రిలో వృద్ధుడు ఎదుర్కొన్నాడు. కనీసం రోగిని తీసుకువెళ్లేందకు స్ట్రెచర్లు లేక అతని తీసుకువెళ్తున్న విధానం చూస్తే ఆ ఆస్పత్రి సిబ్బందిపై ఆగ్రహం రాక మానదు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్‌లో సుమారు వెయ్యి పడకల ప్రభుత్వాస్పత్రికి ఓ వృద్ధుడు వచ్చాడు. అతని కాలు విరిగిపోవడంతో చికిత్స కోసం తన కోడలితో కలిసి ఆస్పత్రికి వచ్చాడు. ఐతే అక్కడ ఆర్థోపెడిక్ విభాగంలోని శ్రీకిషన్ ఓజా(65)ను ట్రామా విభాగానికి తరలించాలని సూచించారు. ఐతే అతన్ని తీసుకువెళ్లేందు కోసం స్ట్రెచర్ కోసం వెళ్లింది కానీ వాటికి చక్రాలు లేవు. దీంతో తన మామను ఒక తెల్లటి క్లాత్‌లో కూర్చొబెట్టి లాక్కుని వెళ్లింది. అక్కడ నుంచి ఆటో తీసుకుని ట్రామాకేర్ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఐతే అక్కడ రోగులు స్ట్రెచర్లు ఉన్నాయే కానీ పనిచేయనవని చెబతున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. Video: No Hospital Stretcher, Elderly Man With Broken Leg Dragged On Cloth In Gwalior Hospital https://t.co/2NAOIfdZ6W pic.twitter.com/F0uWTMiPk3 — NDTV (@ndtv) March 25, 2023 (చదవండి: మీ ఛాతీపై బీజేపీ బ్యాడ్జి పెట్టుకోండి అంటూ విలేకరిపై రాహుల్ ఫైర్) -
11 రోజులుగా స్ట్రెచర్ మీదే : అస్థిపంజరంలా
ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఘోరంగా కుళ్లిపోయి, దయనీయ స్థితిలో మృతదేహం పడి ఉన్న వైనం వెలుగులోకి వచ్చింది. మహారాజా యశ్వంతరావు ఆసుపత్రి మార్చురీలోని స్ట్రెచర్ మీద దాదాపు అస్థిపంజరంలా మారిన డెడ్ బాడీ అక్కడి వారిని షాక్ కు గురిచేసింది. వివరాలను పరిశీలిస్తే..గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గత 11 రోజులుగా అక్కడ పడి ఉంది. కుళ్లి కంపుకొడుతున్నాసిబ్బంది పట్టించుకోలేదు. చివరికి అస్థిపంజరంలా మారి భయం గొల్పుతూ ఉండటంతో ఆసుపత్రిలోని ఇతరులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. సోషల్ మీడియాలో దీనికి సంబంచిన ఫోటో వైరల్ అయింది. అయితే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఏదైనా ఎన్జీవో, లేదా ఇండోర్‌కు చెందిన పౌర సంస్థ కోసం వస్తుందని ఎదురుచూస్తున్నామని అందుకే అలా స్ట్రెచర్ మీదే ఉంచినట్లు ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభిస్తామని, బాధ్యులైన వారికి నోటీసులు ఇవ్వనున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీఎస్ ఠాకూర్ తెలిపారు. రోజూ సుమారు 16-17మృతదేహాలు వస్తాయనీ, జిల్లాలో కరోనాతో ఈ సంఖ్య రెట్టింపు అయిందని తెలిపారు. దీంతో మార్చురీపై భారం పెరిగిందనీ, ఫ్రీజర్ల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్న ఇప్పటికే కోరామని ఆయన చెప్పారు. కాగా ఒకదానికి బదులుగా మరో మృతదేహాన్ని అప్పగించిన వైనం ఇటీవల కలకలం రేపింది. ఆసుపత్రి తీవ్ర నిర్లక్ష్యంతో తమ కుమారుడి బదులుగా వేరే బాడీని అప్పగించిందంటూ ఆ కుటుంబం ఆసుపత్రిపై ఫిర్యాదు చేసింది. -
అయ్యో! తాతకోసం చిన్నోడి కష్టం
సాక్షి, లక్నో: ప్రభుత్వ ఆసుపత్రులలో లంచాల కోసం పీక్కుతినే సిబ్బందికి సంబంధించి చాలా కథనాలు గతంలో విన్నాం. తాజాగా మరో హృదయ విదారకమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్ట్రెచర్ కోసం లంచం అడిగిన రాబందులను సంతృప్తి పర్చలేక ఒక నిరుపేద కుటుంబంలోని ఆరేళ్ల బాలుడే స్వయంగా స్ట్రెచర్‌ను తోసుకుంటూ వెళ్లిన వైనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్, డియోరియా జిల్లా ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే డియోరియా జిల్లాలోని గౌర గ్రామానికి చెందిన చెడి యాదవ్ రెండు రోజుల క్రితం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆయన కాలు ఫ్యాక్చర్ కావడంతో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సర్జికల్ వార్డులో ఉన్న యాదవ్‌ను డ్రెస్సింగ్ కోసం వేరే వార్డుకు తరలించాల్సి వచ్చింది. అయితే స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు అక్కడున్న వార్డ్ బాయ్ 30 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో యాదవ్‌కు సాయంగా వచ్చిన ఆయన కుమార్తె బిందు వద్ద డబ్బులు లేకపోవడంతో వాళ్లే స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. అయితే తల్లి కష్టం చూసి ఆ పసివాడి మనసు చలించిందో ఏమోకానీ, అక్కడే ఉన్న బిందు ఆరేళ్ల కుమారుడు శివం కూడా తన వంతుగా ముందుకొచ్చాడు. బిందు ముందుండి స్ట్రెచర్ ను లాగితే.. శివం వెనుక తోస్తూ సాయం చేశాడు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన తండ్రి డ్రెస్సింగ్ కోసం స్ట్రెచర్‌ను వార్డుకు తీసుకెళ్లేందుకు హాస్పిటల్ సిబ్బంది ప్రతిసారీ 30 రూపాయలు డిమాండ్ చేశారనీ, డబ్బు ఇవ్వకపోతే, స్ట్రెచర్‌ను నెట్టడానికి నిరాకరించారని బిందు వాపోయారు. మరోవైపు ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ అమిత్ కిషోర్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. యాదవ్ కుటుంబాన్నిపరామర్శించారు. ఆసుపత్రి అసిస్టెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సంయుక్త దర్యాప్తు ప్యానల్‌ను ఏర్పాటు చేసి, వెంటనే నివేదికను సమర్పించాలని ఆదేశించారు. డబ్బులు డిమాండ్ చేసిన వార్డు బాయ్‌ను విధుల నుంచి తొలగించామనీ, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. -
ఇదీ ముంబై కేఈఎం హాస్పిటల్ : షాకింగ్ ట్వీట్
సాక్షి, ముంబై: ఒకవైపు దేశంలో కరోనా వైరస్ ప్రకంపనలు కొనసాగుతుండగా మరోవైపు ముంబైలోషాకింగ్ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యంగా ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ కారిడార్ లో మృతదేహాలు స్ట్రెచర్లపై పడి ఉన్నాయి. ఈ దిగ్భ్రాంతికరమైన ఫోటోను బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. ఇదీ ముంబైలోని కేఈఎం ఆసుపత్రి అంటూ ట్వీట్ చేశారు. అయితే ఆసుపత్రిలో ఈ కారిడార్ ప్రస్తుతం వినియోగంలో వుందా లేక ఖాళీగా ఉన్న ప్రదేశమా అనేది స్పష్టతలేదు. దీనిపై ఆసుపత్రి వర్గాలు అధికారికంగా స్పందించాల్సి వుంది. (ఉబెర్ : ఇండియాలో 600 మంది తొలగింపు) కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, మహారాష్ట్రలో ఇప్పటివరకు 52,667 కోవిడ్-19 కేసులు, 1695 మరణాలు నమోదయ్యాయి. వీటిల్లో సుమారు 40 వేలకు పైగా కేసులు ఆర్థిక రాజధాని, 'డ్రీమ్స్ సిటీ' ముంబైలో నమోదైనవే. ఇక్కడ వెయ్యికి పైగా మరణాలతో దేశంలోనే భారీగా ప్రభావితమైన నగరంగా ముంబై నిలిస్తే.. రెండవదిగా ఉన్న పూణే నగరంలో 5319 మంది ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. (కోవిడ్-19 : పరిశీలనలో అతి చవకైన మందు ) కాగా గతంలో కూడా నితేష్ రాణా ఇలాంటి ఒక షాకింగ్ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. కరోనా మృతదేహాల మధ్య కరోనా ఐసోలేషన్ వార్డును నిర్వహిస్తున్న తీరుపై ఆయన మండిపడిన సంగతి తెలిసిందే. This is KEM hospital Mumbai ! pic.twitter.com/5KQQcCrYCH — nitesh rane (@NiteshNRane) May 26, 2020 -
క్షణమొక యుగంలా..!
సాక్షి,దేవరాపల్లి (దేవరాపల్లి): పురిటినొప్పులు భరించి, ప్రసవించడం ఆడవాళ్లకు పునర్జన్మతో సమానం. అయితే బిడ్డను చూడగానే కష్టాన్నంతా మరిచిపోయి మమకారపు మధురిమలు ఆస్వాదిస్తారు. కానీ మన్యంలో మహిళలకు ప్రసవ వేదన కాస్తా నరకయాతనగా మారుతోంది. వారి జీవితాల్లో భయానక ఘటనగా మిగులుతోంది. ఇందుకు అనంతగిరి మండలం పినకోట పంచాయతీ చిందులపాడు గ్రామంలో శుక్రవారం జరిగిన ఘటనే నిదర్శనం.. గ్రామానికి చెందిన నిండు గర్భిణి జన్ని లక్ష్మి నరకయాతన అనుభవించింది. శుక్రవారం ఉదయం 4 గంటలకు పురిటినొప్పులు రావడంతో దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా కుటుంబ సభ్యులు తట్టలో కూర్చోపెట్టి ఐదు కిలోమీటర్లు డోలీ మోశారు. ఈ గ్రామానికి ఫోన్ సదుపాయంతో పాటు రహదారి సౌకర్యం కూడా లేక పోవడంతో ఎంత ప్రమాదకర పరిస్థితి అయినా కాలి నడకే దిక్కు. దీంతో పురిటి నొప్పులతో విలవిల్లాడిపోతున్న గర్భిణీని కొండలు, గుట్టలు దాటించి మోసుకొచ్చారు. తల్లీబిడ్డ క్షేమం.. దేవరాపల్లి పీహెచ్‌సీకి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్లిపురం గ్రామానికి ఆశా కార్యకర్త బుచ్చమ్మ కుటుంబ సభ్యుల సహకారంతో అతి కష్టం తీసుకొచ్చారు. లక్ష్మీ భర్త దేముడు ముందుగా బల్లిపురానికి చేరుకొని ఏఎన్ఎం పుష్పకు సమాచారం అందించడంతో ఆమె అక్కడి నుంచి ఆటోలో దేవరాపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. పీహెచ్సీ సిబ్బంది సుఖప్రసవం చేయించడంతో లక్ష్మి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఇంత దారుణమా! వైరల్ వీడియో
భారతదేశంలో వేళ్ళూనుకుపోయిన కుల వివక్ష వికృత రూపానికి అద్దం పట్టిన ఘటన ఒకటి తమిళనాడులో వెలుగు చూసింది. బతికి వున్నపుడు ఎలా ఉన్నా..చనిపోయిన వారికి కనీస గౌరవాన్నివ్వడం సమాజంలో ఒక సంస్కారంగా కొనసాగుతూ వస్తోంది. కానీ వెల్లూరులో కుప్పన్ అనే దళిత వ్యక్తి చనిపోయిన సందర్భంగా స్థానిక ఆధిపత్య కులానికి చెందిన కొంతమంది పెద్దలు దారుణంగా ప్రవర్తించారు. తమ పొలంలోంచి అతని మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి వీల్లేదని పట్టుబట్టారు. దీంతో వేరే గత్యంతరం లేని బంధువులు వంతెనపైనుంచి స్ట్రెచర్ ద్వారా మృతదేహాన్ని కిందికి దించి, అక్కడనుంచి దహన వాటికకు తరలించాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దీనికి సంబంధించిన వీడియో పలువురిని విస్మయ పరుస్తోంది. Ugly face of caste system! Everybody deserves a dignifid death! Kuppan, a dalit man died in Vellore. Some dominant caste people objected to carrying his body through their farm land. His body had to be lowered using a stretcher atop a bridge to reach the cremation ground. pic.twitter.com/MqrJGNRc6V — Vibhinna Ideas (@Vibhinnaideas) August 22, 2019 -
గోరువెచ్చని కన్నీరు
ఇంటి బయట కానుగ చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తూ, మట్టిలో పిచ్చి గీతలు గీసుకుంటున్న కోటయ్య, వ్యాను ఆగిన శబ్దానికి కంగారుగా తలెత్తి చూశాడు. అతని మనసంతా రాత్రి పెద్దాసుపత్రికి అంబులెన్సులో పోయిన తన కొడుకు రాములు గురించే ఆలోచిస్తోంది. ఏ క్షణాన ఏ వార్త వినాలో అనే ఆందోళన అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇంతలో దడాలున వ్యాన్ డోరు తెరుచుకుంది. అందులోంచి తన కొడుకు స్నేహితుడు రమణ దిగాడు. రాత్రి వాడే రాములు హఠాత్తుగా గుండెల్లో నొప్పంటూ పడిపోతే అప్పటికప్పుడే అంబులెన్సుకి ఫోను జేసి, హడావుడిగా ఆసుపత్రికేసుకెళ్ళింది. కోటయ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. లేచి నిలబడి ఏమైందని అడగబోతుండగా‘రే రమణ జాగ్రత్తగా పట్టుకుని దింపురా’ అంటూ లోపల్నించి ఎవరివో మాటలు వినిపించాయి. ఆ మాటల్తో పాటు ఓ స్ట్రెచర్ డోరులోంచి బయటికొచ్చింది. దాన్ని రమణ, ఇంకో వ్యక్తి ఇద్దరూ కలిసి జాగ్రత్తగా కిందికి దించారు. కోటయ్య మెల్లగా అడుగులు వేసుకుంటూ స్ట్రెచర్ దగ్గరికొచ్చి నిలబడి, రమణ వైపు ఏమైందన్నట్టు చూశాడు. రమణ సమాధానం చెప్పకుండా తలొంచుకుని నిలబడ్డాడు. వణుకుతున్న చేతిని నెమ్మదిగా ముందుకు చాచి, స్ట్రెచర్ మీదున్న తెల్లగుడ్డను తొలగించి చూశాడు కోటయ్య. రాములు...!నిర్జీవంగా...! మొదలు నరికిన చెట్టులాగా ఒక్కసారిగా కూలిపోయాడా అరవై ఏళ్ళ వృద్ధుడు. నోటి నుండి మాటలు రావడం లేదతనికి. ‘హమ్మా... ఎంత పని చేసినావురా దేవుడా...!? ఆ తీసుకొనిపొయ్యేదేదో నన్ను తీసుకోని పోగూడదట్రా స్వామీ...!’ అంటూ తలబాదుకుంటూ ఏడవటం మొదలుపెట్టాడతను. ఆ ఏడుపుకి చుట్టుపక్కల ఇళ్ళలోని వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైందేమోనని. కొంతమంది అతన్ని పట్టుకుని లేవదీసి, ఓదార్చడం మొదలుపెట్టారు. కొంతమంది ఎలా జరిగిందని ఆరాలు తీయడం మొదలుపెట్టారు.ఈ హడావుడికి ఇంటి గుమ్మానికి ఆనుకుని నిద్రపోతున్న మల్లి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఇంటి ముందంతా జనం. ఏమైందో అర్థమయ్యేలోపు ఓ నలుగురు ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, ఆమెను పట్టుకుని ఏడవటం మొదలుపెట్టారు. కొందరు శవాన్ని తీసుకొచ్చి, గుమ్మంలో పరిచిన చాప మీద దక్షిణ దిశగా తల వుండేట్టు పడుకోబెట్టారు. నెమ్మదిగా లేచి వెళ్ళి రాములు శవం పక్కన కూర్చుంది మల్లి. అంతా ఏదో మాయలా ఉందామెకి. చుట్టూ ఉన్న జనమంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రమణ, కోటయ్య దగ్గర నంబర్లు తీసుకుని బంధువులందరికీ ఫోన్లు చేస్తున్నాడు. ఊళ్ళో పెద్దలంతా వచ్చి ఇంటి ముందేసిన షామియానా కింద కాసేపు కూర్చుని వెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళంతా రాగాలు తీస్తూ ఏడుస్తున్నారు. కానీ మల్లి మాత్రం ఏడవటం లేదు. ఎందుకో ఆమెకి ఏడుపు రావడం లేదు. ‘మొగుడు చచ్చినా దాని కంట్లోంచి చుక్క నీళ్ళు కూడా రావడం లేదు! ఏం మనుషులో, ఏం సంసారాలో..!’ఎవరో దెప్పిపొడుస్తున్నారు. ‘అయినా ఇప్పట్లో మొగుడికంత విలువ ఎవరిస్తున్నార్లే.. ఆ కాలం ఎప్పుడో పోయింది.’ మరెవరో అందిస్తున్నారు.అవేమీ వినిపించడంలేదామెకి. గతమంతా మనసులో సుళ్ళు తిరుగుతుండగా, రాముల్నే చూస్తోందామె. ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు. గురవయ్యకున్న ఇద్దరి కూతుర్లలో మొదటి కూతురు మల్లి. రెండో కూతురు జయ. మల్లి జయంత అందంగా ఉండదు. జయ కూడా పెద్ద అందగత్తేం కాదు. ఇద్దరూ చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నారు. అప్పట్నుంచీ పెళ్ళాం మీద దిగులుతో గురవయ్య తాగుడు మొదలుపెట్టాడు. పిల్లల్ని పట్టించుకునేవాడే కాదు. తెల్లవారుజామున పోతే ఎక్కడెక్కడో తిరిగి, దాదాపు అర్ధరాత్రి అవుతుండగాతూలుతూ ఇంటికొచ్చేవాడు. అంతవరకూ బిక్కు బిక్కుమంటూ ఎదురుచూస్తూ కూర్చునేవాళ్ళిద్దరూ. అమ్మ లేకపోవడంతో నానా అవస్థలు పడుతూ తమ పనులు తామే చేసుకునే వాళ్ళు.కొన్నాళ్ళ తర్వాత గురవయ్య స్తోమతలేక మల్లిని బడి మాన్పించేశాడు. జయ మాత్రం రోజూ బడికి వెళ్ళేది. ఇంట్లో మల్లిఒక్కతే ఒంటరిగా అన్ని పనులు చేసేది. ఖాళీగా ఉన్నప్పుడు ఏమీ తోచక అమ్మ నేర్పించిన పాటలు పాడుకునేది. తనలో తాను నవ్వుకునేది.ఏడ్చుకునేది. అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్ళేది. శాంతమ్మ టిఫిన్ సెంటర్లో పాత్రలు కడిగేది. ఎవరైనా అడిగితే చిన్న చిన్న పనులు చేసి పెట్టేది.ఆ వచ్చిన డబ్బుల్ని తన కంటే చెల్లికే ఎక్కువ ఖర్చుపెట్టేది. జయ అంటే అంత ఇష్టం తనకి. మల్లికి పదిహేనేళ్ళు రాగానే మొదటిసారిగా ఓ పెళ్ళి సంబంధం వచ్చింది. మగపెళ్ళి వాళ్ళొచ్చి పిల్లను చూసి వెళ్ళారు. కానీ వాళ్ళకి మల్లి నచ్చలేదు. జయ నచ్చింది. మల్లి బాధపడలేదు. సంతోషించింది. తను కాకపోయినా తన చెల్లయినా ఓ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోందని. జయకి పెళ్ళై వెళ్ళిపోగానే, మల్లికి దిగులు మొదలైంది. ఎప్పుడూ పరధ్యానంగా, ఏదో ఆలోచించుకుంటూ ఉండేది. గురవయ్య మాట్లాడించినా మాట్లాడేది కాదు. ఇంట్లోంచి బయటికి వచ్చేదే కాదు. ఎన్నెన్ని కలలు కనింది తను. ఎన్నెన్ని ఆశలు పెట్టుకుంది జీవితం మీద. అవన్నీ అడియాసలైపోతున్నాయన్న ఊహే, బతుకు మీద విరక్తి పుట్టించేదామెకి. మరమనిషిలా అన్ని పనులు చేసేది. తిండి ధ్యాసే లేదు. గురవయ్య మరీ బలవంతపెడితే, నాలుగు ముద్దలు తినేది. కొన్ని కొన్ని సార్లు ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ఆమెకు భయమేసేది. అందుకే పెందలకడనే అన్ని పనులు చక్కబెట్టుకుని, గుడిసెలో దీపం వెలిగించి, తండ్రి కోసం ఎదురుచూస్తూ కూర్చునేది. గురవయ్య ఎప్పటిలాగే బాగా చీకటి పడ్డాకగాని వచ్చేవాడు కాదు. కానీ ఆ వేళ మాత్రం కొంచెం తొందరగానే వచ్చేశాడు. వస్తూ వస్తూ తనతో పాటూ కోటయ్యని కూడా వెంటబెట్టుకొచ్చాడు. రావడం రావడమే ‘నాయనా...? నాయనా...?’ అంటూ మల్లిని కేకేశాడు. మల్లి భయం భయంగా బయటికొచ్చింది. ‘రొండు మంచినీళ్ళు తేపో... మావకి.’ తూలుతూ అన్నాడు గురవయ్య. నోట్లోంచి గుప్పుమంది సారాయి వాసన. నీళ్ళు తెచ్చిచ్చి తలుపు దగ్గర నిలబడుకుంది మల్లి. నీళ్ళు తాగి చెప్పడం మొదలు పెట్టాడు కోటయ్య.‘‘ఇంకేం రా గురవా...? పిల్లని చూస్తే మంచి బిడ్డ గానే ఉండాది. నీకిష్టమని ఒకమాట చెప్పేసినావంటే, ఈ వారమన్నా లేదా రేపు వారమన్నా వచ్చి చూసుకోనిపోతాం. ఏవంటావా?’‘అట్నే కానీ మావా’ అన్నాడు గురవయ్య మళ్ళీ తూలుతూ.‘పిల్లని కూడా ఒకమాట అడిగి చూడు. ఏమంటాదో. ’ అన్నాడు కోటయ్య మల్లి వైపు చూసి.‘ఆ పిల్ల ఏమంటాది మావా... నేనెంత చెప్తే అంత. నా కూతురు నా మాట జవదాటదు.’ నవ్వాడు గురవయ్య.‘సరే! మరి నేనింక బయలుదేరుతా. నువ్వేమీ భయపడాల్సిన అవసరంలేదు.నాగ్గూడా ఆడబిడ్డలు లేరు. ఇచ్చినావంటే నా కూతురు మాదిరిగా చూసుకుంటా. ఇద్దో ఇదే నా కొడుకు ఫోటో. సూడు.’ అంటూ గురవయ్యకి ఫోటో ఇచ్చి, మంచంలోంచి పైకి లేచాడు కోటయ్య.మల్లి తలుపు చాటు నుంచి మాటలన్నీ వింటూనే ఉంది. మరి కాసేపటికి కోటయ్య వెళ్ళిపోయాడు. గురవయ్య ఫోటో గూట్లో పెట్టి, గబగబా నాలుగు మెతుకులు తిని మత్తుగా పడుకుండిపోయాడు. మల్లికి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. ఎందుకో ఆ ఫోటో చూడాలనిపించింది. నెమ్మదిగా వెళ్ళి గూట్లో ఉన్న ఫొటో తీసి, దీపపు కాంతిలో చూసింది. చాలా కాలం తర్వాత ఆ రోజు మల్లి ముఖంలోకి వెలుగొచ్చింది.పెదాలపై చిరునవ్వు పూసింది. ఇది జరిగిన ఓ వారం పది రోజులకు ఊరి చివర కొండ మీదున్న గుడిలో ఏ హంగు, ఆర్భాటాలు లేకుండా మల్లికి రాములుతో పెళ్ళి జరిగింది. పెళ్లయిన తర్వాత ఆమె చాలా ఒద్దికగా ఉండేది. ఎప్పుడూ భర్తను కనిపెట్టుకుని, అతనికేం కావాలో అడక్కుండానే చేసిపెట్టేది. అతను పనికెళ్ళి వచ్చేసరికి అన్ని పనులు చేసేసి, వేడి నీళ్ళు పెట్టి, దగ్గరుండి స్నానం చేయించేది. అన్నాలు తిన్నాక, ఇద్దరూ మేడ మీద పడుకుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ‘జీవితం మొత్తం ఇలానే గడిచిపోతే బాగుణ్ణు.’ అనిపించేదామెకి. కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. పెళ్ళైన నెల తర్వాత ఓ రోజు, పనికి వెళ్ళిన రాములు గుండె నొప్పంటూ మధ్యాహ్నానికే ఇంటికొచ్చేశాడు. సమయానికి ఇంట్లో కోటయ్య కూడా లేకపోయేసరికి మల్లికి కంగారు మొదలయ్యింది. ‘డాక్టరుకి చూపిద్దాం పద బావా.’ అంటూ రాముల్ని బయల్దేరదీసింది. రాములు వినలేదు.‘వద్దులేవే. ఊరికే ఎందుకు డాక్టర్ దగ్గరికి పొయ్యేది? మొన్నే పట్నం పొయ్యి చూపించుకుని వచ్చినాం. అప్పుడు తెచ్చుకున్న మాత్రలు అట్నే ఉండాయి. అవి ఏసుకుని పడుకుంటే తగ్గిపోతాదిగానీ. సొంబులో నీళ్ళు ముంచుకొని, ఆ మాత్రల సంచి ఇట్టా ఎత్తుకుని రా.’ అన్నాడు నొప్పికి అల్లాడిపోతూ.మల్లి మాత్రలు, నీళ్ళు తెచ్చి ఇచ్చింది. కాసేపటి తర్వాత నొప్పి తగ్గి కాస్త ఉపశమనం కలిగింది రాములుకి.తర్వాత కూడా అప్పుడప్పుడు రాములు కడుపు నొప్పితో బాధ పడేవాడు. అలా జరిగిన ప్రతిసారీ మాత్రలో, నాటు మందులో తీసుకునేవాడు. నొప్పి తగ్గుముఖం పట్టేది. కోటయ్య కూడా అక్కడితో వదిలేసేవాడు. మల్లికి మాత్రం రాములు నొప్పితో బాధ పడుతున్న ప్రతిసారీ చివుక్కుమనేది. ఏం జరుగుతుందో ఏమోనని మనసు గాభరా పడేది. అలా మరో రెండు నెలలు గడిచిపోయాయి. మల్లి మనసులో మళ్ళీ జీవితం మీద ఆశలు చిగురించడం మొదలుపెట్టాయి. రోజు రోజుకీ రాములు మీద మమకారం పెరిగిపోతోంది. ఇద్దరి మధ్యా బంధం గట్టిపడుతోంది.ఆ రోజురాత్రి మల్లి ఎందుకో సంతోషంగా ఉంది. ఇద్దరూ మిద్దె మీద వెన్నెల్లో, చాప మీద పడుకుని శరత్కాలపు వెన్నెలను ఆస్వాదిస్తున్నారు. కానుగ చెట్టు గాలికి మెల్లిగా ఊగుతోంది. కాసేపు మాట్లాడుకున్నాక, ‘బావా...’ అంది మల్లి నిర్మలంగా ఉన్న ఆకాశం కేసి చూస్తూ.‘ఊ...’ అన్నాడు రాములు కళ్ళు మూసుకుని.‘నీకో మాట చెప్పాలి.‘ అందామె‘చెప్పు.’ అన్నాడు రాములు కళ్ళు తెరవకుండానే.‘ఇప్పుడు నాకూ...’ అని మల్లి ఇంకా ఏదో చెప్పబోతుంటే‘...అమ్మా...!’ అంటూ మూలిగాడు రాములు.ఉలిక్కిపడి చూసింది మల్లి.రాములు గుండె నొప్పితో మెలికలు తిరుగుతున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పందిట్లో పడుకున్న కోటయ్యను లేపుకొచ్చిందామె. ఇద్దరూ కలిసి రాములు చేత మాత్రలు మింగించారు. అయినా నొప్పి తగ్గలేదు. ఈసారి నాటు మందులు కూడా విఫలమయ్యాయి. అర్ధరాత్రి అయ్యేసరికి నొప్పి తారస్థాయికి చేరింది. రాములు నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు. ఊపిరి సరిగ్గా ఆడటం లేదతనికి. శరీరం ఉబ్బిపోతోంది. చెమటలు పోసేస్తున్నాయి. ఇక లాభం లేదని, కోటయ్య పక్కింటి రమణని కేకేశాడు. రమణ రావడం, అంబులెన్సుకి ఫోను చెయ్యడం, మరో ఇద్దరి సాయంతో ఆస్పత్రికి ఏసుకెళ్ళడం అన్నీ నిముషాల్లో జరిగిపోయాయి. ఆ రాత్రంతా గుమ్మానికి ఆనుకుని ఏడుస్తూనే ఉంది మల్లి. ఎప్పుడో తెల తెలవారుతుండగా నిద్రపట్టిందామెకి. లేచి చూసేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. రాత్రి తెల్లటి అంబులెన్స్ వ్యానులో వెళ్ళిన రాములు, పొద్దునకల్లా నల్లటి మార్చురీ వ్యానులో శవమై తిరిగొచ్చాడు. ఏ తప్పు చేయకపోయినా కొందరి జీవితాలు ఎందుకిలా విషాదమయం అయిపోతాయో ఎవ్వరికీ తెలియదు.అంత జరిగినా కూడా ఆమె ఏడవటం లేదు. అదే అక్కడున్న వారందరికీ ఆశ్చర్యంగా ఉంది. కోటయ్య తరపున వాళ్ళు ఎవరెవరో వస్తున్నారు. రాములు వైపు బాధగానూ, మల్లి వైపు వింతగానూ చూసి వెళ్ళిపోతున్నారు.‘పొద్దు పోతోంది ఇంక ఎత్తుబడి కానీయ్యండయ్యా.’ ఊరిపెద్ద సలహా ఇస్తున్నాడు.‘ఇంకా ఆ పిల్ల బంధువులెవరూ రాలేదే.!’ ఇంకో పెద్ద మనిషి సంజాయిషీ చెప్తున్నాడు.‘ఆ గురవయ్య తాగేసి ఏ చెట్టు కిందో పడిపోయుంటాడు. వోడి కోసం కూర్చుంటే కాదు. కానీయండి. కానీయండి.’ అంటున్నాడు ఊరిపెద్ద.‘ఆ నా కొడుకేమో ఎవరికో ఒకరికి ఇచ్చి చేసేయాలని చేసేశాడు. ఈడు చచ్చిపోయా..! ఇంకో రెండు రోజులుంటే ఆ కోటయ్య కూడా పోతాడు. ఆ తర్వాత ఆ బిడ్డ బతుకెట్ట?’ పాడె కడుతున్న ముసలోడు గొణుగుతున్నాడు.‘వోడికి గుండె జబ్బు ఉందని వాళ్ళ అబ్బకి ముందే తెలుసు తాతా. అంతా తెలిసే పాపం ఆ పిల్ల గొంతు కోశారు.’ ముసలోడికి పాడె కట్టడంలో సాయం చేస్తున్న యువకుడు చెప్తున్నాడు.పాడె సిద్ధమైంది. శవం కాళ్ళ దగ్గర టెంకాయ కొట్టి, పాడె మీద పడుకో బెట్టారు. ముందు కోటయ్య కుండలో నిప్పులు పట్టుకుని నడుస్తుండగా, రమణ, అతనితో పాటూ మరో ముగ్గురు యువకులు పాడె ఎత్తుకుని శ్మశానానికి బయల్దేరారు. సరిగ్గా అప్పుడొచ్చింది జయ. ఎలా తెలుసుకొని వచ్చిందో ఏమో. ఆటో దిగి పరిగెత్తుకుంటూ వచ్చి, పాడె వెళ్ళిపోతున్న వైపు నిరామయంగా చూస్తూ నిలబడ్డ మల్లిని ఒక్కసారిగా పొదివి పట్టుకొని ఏడవడం మొదలుపెట్టిందామె. మల్లి మాత్రం నిశ్చలంగా ఉంది. ఒక ఉలుకూ లేదూ, పలుకూ లేదు.‘ఏవైందే నీకు? కనీసం ఇప్పుడైనా ఏడవ్వే.’ అంటూ వెక్కి, వెక్కి ఏడుస్తోంది జయ.మల్లి ముఖంలో ఎటువంటి భావము లేదు. ఆమె కళ్ళు కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి. ఆమె మనసులో ఓ మథనం జరుగుతోంది. వర్షం ముందు ఏర్పడే నిశ్శబ్దంలాంటిది కాస్సేపామెని చుట్టుముట్టిన తర్వాత, నెమ్మదిగా ఆమె కళ్ళలోంచి, బుగ్గల మీదుగా జారాయి గోరువెచ్చని కన్నీళ్ళు. దూరంగా వెళ్ళిపోతున్న రాములు శవం కనుమరుగవుతుండగా... ఆప్యాయంగా తన మూడు నెలల కడుపును తడుముకుంటూ మౌనంగా ఏడ్చిందామె. అది ఏడుపు కాదు. రోదన. వెంకట్ ఈశ్వర్ -
స్ట్రెచర్ లేదని నడిపించారు!
బేతుల్: ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఒక శిశువు నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా ఆస్పత్రిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘోడాడోంగ్రికి చెందిన వికాస్ వర్మ భార్య నీలూ నిండు గర్భిణీ. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు లేకపోవటంతో అంబులెన్స్ లో బేతుల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. నీలూ వర్మను స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సిన ఆస్పత్రి సిబ్బంది.. కాన్పుగదికి నడిపిస్తు్తండగానే ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నేలపై పడిన శిశువు అక్కడికక్కడే చనిపోయింది. తమ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని, బాధ్యులపై చర్యలు తీసు కుంటామని ఆస్పత్రి సివిల్ సర్జన్ ఏకే బరంగా తెలిపారు. -
స్ట్రెచర్‌పై నాలుగు కిలోమీటర్లు...
ఉట్నూర్ రూరల్: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు నాలుగు కిలోమీటర్లు స్ట్రెచర్‌పై మోసి మానవత్వం చాటుకున్నాడో వైద్యుడు. ఆస్పత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది ఆ తల్లి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి జెండాగూడ గ్రామానికి చెం దిన ఆత్రం అయ్యుబాయికి గురువారం పురిటినొప్పులు వచ్చాయి. అంగన్వాడీ కార్యకర్త ఆత్రం మల్కుబాఇయ సమాచారం మేరకు దంతన్‌పల్లి పీహెచ్సీ వైద్యాధికారి కిరణ్ వెంటనే అక్కడికి వచ్చారు. గ్రామ సమీపంలో వాగు ఉంది. రోడ్డు సరిగా లేక వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది. దీంతో వైద్యుడు కిరణ్, గ్రామ ఉపాధ్యాయుడు నగేశ్, ఏఎన్ఎం పావని, హెల్త్ అసిస్టెంట్ జాన్, అయ్యుబాయి భర్త బీర్చావ్, తల్లి సిడాం మింగుబాయి ఆమెను జెండాగూడ నుంచి తాటిగూడ వర కు 4 కిలోమీటర్లు స్ట్రెచర్‌పైనే మోసుకొచ్చారు. మధ్యలో నడుం లోతుతో ప్రవహిస్తున్న వాగునూ దాటారు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. -
స్ట్రెచర్ ఇలా కూడా వాడొచ్చా..?
ప్రత్తిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది రోగులను తరలించడానికి వినియోగించాల్సిన స్ట్రెచర్లను చెత్త ఎత్తివేయడానికి వినియోగిస్తున్నారు. స్థానిక సీహెచ్‌సీలో చెత్త డబ్బాలను సోమవారం ఉదయం ఇదిగో ఇలా స్ట్రెచర్‌పై తరలించారు. దాతలు ఎంతో సదుద్దేశంతో ఆస్పత్రికి అందజేసిన స్ట్రెచర్లను ఇలా చెత్త ఎత్తివేయడానికి వినియోగిస్తుండడంపై ప్రజలు, రోగుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఆస్పత్రి సిబ్బంది తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు. – ప్రత్తిపాడు -
హే..గాంధీ!
ఒకే స్ట్రెచర్‌పై ఇద్దరు రోగులు.. వార్డుకు తరలిస్తుండగా విరిగిన స్ట్రెచర్.. కిందపడిపోయి గాయాల పాలైన రోగులు గాంధీ ఆస్పత్రిలో నిర్వాకం గాంధీ ఆస్పత్రి : తుప్పుపట్టిన స్ట్రెచర్లపై రోగులను తరలిస్తుండగా హఠాత్తుగా స్ట్రెచర్ విరిగిపోవడంతో రోగులు కిందపడి గాయాలపాలయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. ప్రత్యక్షసాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీ ఆస్పత్రి ప్రధాన భవనం ఐదవ అంతస్థులోని నెఫ్రాలజీ వార్డులో చికిత్స పొందుతున్న ఇరువురు మహిళా రోగులను ఒకే స్ట్రెచర్‌పై కూర్చుండబెట్టి సెల్లార్లో ఉన్న రేడియాలజీ విభాగానికి తీసుకువచ్చి ఎక్స్‌రేలు తీయించారు. తిరిగి వార్డుకు తరలిస్తుండగా తుప్పుపట్టిన స్ట్రెచర్ విరిగిపోవడంతో దానిపై కూర్చున్న రోగులు ఒక్కసారిగా కిందపడిపోయారు. హఠాత్పరిణామంతో ఆందోళనకు గురైన రోగులు గట్టిగా కేకలు వేశారు. గమనించిన రోగి సహాయకులు, సెక్యూరిటీగార్డులు పరుగున వచ్చి కిందపడిన మహిళా రోగులను పైకిలేపి కూర్చోబెట్టారు. ఈ ఘటనలో ఇరువురు మహిళా రోగులు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం మరో స్ట్రెచర్ తీసుకువచ్చి రోగులను వార్డుకు తరలించారు. దీనిపై రోగుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
స్ట్రెచర్‌పైనే పెళ్లి
కొలిమిగుండ్ల: రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమారునికి గాయాలు కావడంతో స్ట్రెచర్‌పైనే అతనికి వివాహం చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో చోటుచేసుకుంది. ఉమ్మాయిపల్లెకు చెందిన ఆదినారాయణరెడ్డి కుమారుడు లక్ష్మినారాయణరెడ్డికి ఆళ్లగడ్డ మండలం పెద్ద కంబలూరుకు చెందిన లక్ష్మీతో వివాహం కుదిరింది. కొలిమిగుండ్లలోని షిర్డీసాయి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం 7 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బంధువులతో కలసి వరుడు కారులో బయలు దేరాడు. కారు తోళ్లమడుగు సమీపంలోకి రాగానే మలుపు వద్దనున్న కల్వర్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమారుడి కాలు విరగగా, సమీప బంధువులు ధనుంజయరెడ్డి, భారతితో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. వరుడికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అయితే పెళ్లిని వాయిదా వేయకుండా యథావిధిగా జరిపించాలని బంధువులు చెప్పడంతో కాలికి కట్టుకట్టి..స్ట్రెచర్‌పైనే వరుడిని ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో కల్యాణ మండపానికి చేర్చారు. అనుకున్న ముహూర్తం మించిపోయినా...తొమ్మిది గంటలకు స్ట్రెచర్‌పైనే పెళ్లి తంతు జరిపించారు. వివాహ కార్యక్రమం ముగియగానే చికిత్స నిమిత్తం వరుడిని కర్నూలుకు తరలించారు.