ఇంటి బయట కానుగ చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తూ, మట్టిలో పిచ్చి గీతలు గీసుకుంటున్న కోటయ్య, వ్యాను ఆగిన శబ్దానికి కంగారుగా తలెత్తి చూశాడు. అతని మనసంతా రాత్రి పెద్దాసుపత్రికి అంబులెన్సులో పోయిన తన కొడుకు రాములు గురించే ఆలోచిస్తోంది. ఏ క్షణాన ఏ వార్త వినాలో అనే ఆందోళన అతని ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇంతలో దడాలున వ్యాన్ డోరు తెరుచుకుంది. అందులోంచి తన కొడుకు స్నేహితుడు రమణ దిగాడు. రాత్రి వాడే రాములు హఠాత్తుగా గుండెల్లో నొప్పంటూ పడిపోతే అప్పటికప్పుడే అంబులెన్సుకి ఫోను జేసి, హడావుడిగా ఆసుపత్రికేసుకెళ్ళింది. కోటయ్య గుండె వేగంగా కొట్టుకుంటోంది. లేచి నిలబడి ఏమైందని అడగబోతుండగా‘రే రమణ జాగ్రత్తగా పట్టుకుని దింపురా’ అంటూ లోపల్నించి ఎవరివో మాటలు వినిపించాయి. ఆ మాటల్తో పాటు ఓ స్ట్రెచర్ డోరులోంచి బయటికొచ్చింది. దాన్ని రమణ, ఇంకో వ్యక్తి ఇద్దరూ కలిసి జాగ్రత్తగా కిందికి దించారు. కోటయ్య మెల్లగా అడుగులు వేసుకుంటూ స్ట్రెచర్ దగ్గరికొచ్చి నిలబడి, రమణ వైపు ఏమైందన్నట్టు చూశాడు. రమణ సమాధానం చెప్పకుండా తలొంచుకుని నిలబడ్డాడు. వణుకుతున్న చేతిని నెమ్మదిగా ముందుకు చాచి, స్ట్రెచర్ మీదున్న తెల్లగుడ్డను తొలగించి చూశాడు కోటయ్య. రాములు...!నిర్జీవంగా...! మొదలు నరికిన చెట్టులాగా ఒక్కసారిగా కూలిపోయాడా అరవై ఏళ్ళ వృద్ధుడు. నోటి నుండి మాటలు రావడం లేదతనికి.
‘హమ్మా... ఎంత పని చేసినావురా దేవుడా...!? ఆ తీసుకొనిపొయ్యేదేదో నన్ను తీసుకోని పోగూడదట్రా స్వామీ...!’ అంటూ తలబాదుకుంటూ ఏడవటం మొదలుపెట్టాడతను. ఆ ఏడుపుకి చుట్టుపక్కల ఇళ్ళలోని వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు ఏమైందేమోనని. కొంతమంది అతన్ని పట్టుకుని లేవదీసి, ఓదార్చడం మొదలుపెట్టారు. కొంతమంది ఎలా జరిగిందని ఆరాలు తీయడం మొదలుపెట్టారు.ఈ హడావుడికి ఇంటి గుమ్మానికి ఆనుకుని నిద్రపోతున్న మల్లి మెల్లిగా కళ్ళు తెరిచి చూసింది. ఇంటి ముందంతా జనం. ఏమైందో అర్థమయ్యేలోపు ఓ నలుగురు ఆడవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి, ఆమెను పట్టుకుని ఏడవటం మొదలుపెట్టారు. కొందరు శవాన్ని తీసుకొచ్చి, గుమ్మంలో పరిచిన చాప మీద దక్షిణ దిశగా తల వుండేట్టు పడుకోబెట్టారు. నెమ్మదిగా లేచి వెళ్ళి రాములు శవం పక్కన కూర్చుంది మల్లి. అంతా ఏదో మాయలా ఉందామెకి. చుట్టూ ఉన్న జనమంతా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రమణ, కోటయ్య దగ్గర నంబర్లు తీసుకుని బంధువులందరికీ ఫోన్లు చేస్తున్నాడు. ఊళ్ళో పెద్దలంతా వచ్చి ఇంటి ముందేసిన షామియానా కింద కాసేపు కూర్చుని వెళ్ళిపోతున్నారు. ఆడవాళ్ళంతా రాగాలు తీస్తూ ఏడుస్తున్నారు. కానీ మల్లి మాత్రం ఏడవటం లేదు. ఎందుకో ఆమెకి ఏడుపు రావడం లేదు. ‘మొగుడు చచ్చినా దాని కంట్లోంచి చుక్క నీళ్ళు కూడా రావడం లేదు! ఏం మనుషులో, ఏం సంసారాలో..!’ఎవరో దెప్పిపొడుస్తున్నారు. ‘అయినా ఇప్పట్లో మొగుడికంత విలువ ఎవరిస్తున్నార్లే.. ఆ కాలం ఎప్పుడో పోయింది.’ మరెవరో అందిస్తున్నారు.అవేమీ వినిపించడంలేదామెకి. గతమంతా మనసులో సుళ్ళు తిరుగుతుండగా, రాముల్నే చూస్తోందామె. ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు.
గురవయ్యకున్న ఇద్దరి కూతుర్లలో మొదటి కూతురు మల్లి. రెండో కూతురు జయ. మల్లి జయంత అందంగా ఉండదు. జయ కూడా పెద్ద అందగత్తేం కాదు. ఇద్దరూ చిన్నతనంలోనే అమ్మను పోగొట్టుకున్నారు. అప్పట్నుంచీ పెళ్ళాం మీద దిగులుతో గురవయ్య తాగుడు మొదలుపెట్టాడు. పిల్లల్ని పట్టించుకునేవాడే కాదు. తెల్లవారుజామున పోతే ఎక్కడెక్కడో తిరిగి, దాదాపు అర్ధరాత్రి అవుతుండగాతూలుతూ ఇంటికొచ్చేవాడు. అంతవరకూ బిక్కు బిక్కుమంటూ ఎదురుచూస్తూ కూర్చునేవాళ్ళిద్దరూ. అమ్మ లేకపోవడంతో నానా అవస్థలు పడుతూ తమ పనులు తామే చేసుకునే వాళ్ళు.కొన్నాళ్ళ తర్వాత గురవయ్య స్తోమతలేక మల్లిని బడి మాన్పించేశాడు. జయ మాత్రం రోజూ బడికి వెళ్ళేది. ఇంట్లో మల్లిఒక్కతే ఒంటరిగా అన్ని పనులు చేసేది. ఖాళీగా ఉన్నప్పుడు ఏమీ తోచక అమ్మ నేర్పించిన పాటలు పాడుకునేది. తనలో తాను నవ్వుకునేది.ఏడ్చుకునేది. అప్పుడప్పుడు కూలి పనులకు వెళ్ళేది. శాంతమ్మ టిఫిన్ సెంటర్లో పాత్రలు కడిగేది. ఎవరైనా అడిగితే చిన్న చిన్న పనులు చేసి పెట్టేది.ఆ వచ్చిన డబ్బుల్ని తన కంటే చెల్లికే ఎక్కువ ఖర్చుపెట్టేది. జయ అంటే అంత ఇష్టం తనకి. మల్లికి పదిహేనేళ్ళు రాగానే మొదటిసారిగా ఓ పెళ్ళి సంబంధం వచ్చింది. మగపెళ్ళి వాళ్ళొచ్చి పిల్లను చూసి వెళ్ళారు. కానీ వాళ్ళకి మల్లి నచ్చలేదు. జయ నచ్చింది. మల్లి బాధపడలేదు. సంతోషించింది. తను కాకపోయినా తన చెల్లయినా ఓ కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోందని. జయకి పెళ్ళై వెళ్ళిపోగానే, మల్లికి దిగులు మొదలైంది. ఎప్పుడూ పరధ్యానంగా, ఏదో ఆలోచించుకుంటూ ఉండేది. గురవయ్య మాట్లాడించినా మాట్లాడేది కాదు. ఇంట్లోంచి బయటికి వచ్చేదే కాదు. ఎన్నెన్ని కలలు కనింది తను. ఎన్నెన్ని ఆశలు పెట్టుకుంది జీవితం మీద. అవన్నీ అడియాసలైపోతున్నాయన్న ఊహే, బతుకు మీద విరక్తి పుట్టించేదామెకి. మరమనిషిలా అన్ని పనులు చేసేది. తిండి ధ్యాసే లేదు. గురవయ్య మరీ బలవంతపెడితే, నాలుగు ముద్దలు తినేది.
కొన్ని కొన్ని సార్లు ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే ఆమెకు భయమేసేది. అందుకే పెందలకడనే అన్ని పనులు చక్కబెట్టుకుని, గుడిసెలో దీపం వెలిగించి, తండ్రి కోసం ఎదురుచూస్తూ కూర్చునేది. గురవయ్య ఎప్పటిలాగే బాగా చీకటి పడ్డాకగాని వచ్చేవాడు కాదు. కానీ ఆ వేళ మాత్రం కొంచెం తొందరగానే వచ్చేశాడు. వస్తూ వస్తూ తనతో పాటూ కోటయ్యని కూడా వెంటబెట్టుకొచ్చాడు. రావడం రావడమే ‘నాయనా...? నాయనా...?’ అంటూ మల్లిని కేకేశాడు. మల్లి భయం భయంగా బయటికొచ్చింది. ‘రొండు మంచినీళ్ళు తేపో... మావకి.’ తూలుతూ అన్నాడు గురవయ్య. నోట్లోంచి గుప్పుమంది సారాయి వాసన. నీళ్ళు తెచ్చిచ్చి తలుపు దగ్గర నిలబడుకుంది మల్లి. నీళ్ళు తాగి చెప్పడం మొదలు పెట్టాడు కోటయ్య.‘‘ఇంకేం రా గురవా...? పిల్లని చూస్తే మంచి బిడ్డ గానే ఉండాది. నీకిష్టమని ఒకమాట చెప్పేసినావంటే, ఈ వారమన్నా లేదా రేపు వారమన్నా వచ్చి చూసుకోనిపోతాం. ఏవంటావా?’‘అట్నే కానీ మావా’ అన్నాడు గురవయ్య మళ్ళీ తూలుతూ.‘పిల్లని కూడా ఒకమాట అడిగి చూడు. ఏమంటాదో. ’ అన్నాడు కోటయ్య మల్లి వైపు చూసి.‘ఆ పిల్ల ఏమంటాది మావా... నేనెంత చెప్తే అంత. నా కూతురు నా మాట జవదాటదు.’ నవ్వాడు గురవయ్య.‘సరే! మరి నేనింక బయలుదేరుతా. నువ్వేమీ భయపడాల్సిన అవసరంలేదు.నాగ్గూడా ఆడబిడ్డలు లేరు. ఇచ్చినావంటే నా కూతురు మాదిరిగా చూసుకుంటా. ఇద్దో ఇదే నా కొడుకు ఫోటో. సూడు.’ అంటూ గురవయ్యకి ఫోటో ఇచ్చి, మంచంలోంచి పైకి లేచాడు కోటయ్య.మల్లి తలుపు చాటు నుంచి మాటలన్నీ వింటూనే ఉంది. మరి కాసేపటికి కోటయ్య వెళ్ళిపోయాడు. గురవయ్య ఫోటో గూట్లో పెట్టి, గబగబా నాలుగు మెతుకులు తిని మత్తుగా పడుకుండిపోయాడు. మల్లికి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. ఎందుకో ఆ ఫోటో చూడాలనిపించింది. నెమ్మదిగా వెళ్ళి గూట్లో ఉన్న ఫొటో తీసి, దీపపు కాంతిలో చూసింది. చాలా కాలం తర్వాత ఆ రోజు మల్లి ముఖంలోకి వెలుగొచ్చింది.పెదాలపై చిరునవ్వు పూసింది.
ఇది జరిగిన ఓ వారం పది రోజులకు ఊరి చివర కొండ మీదున్న గుడిలో ఏ హంగు, ఆర్భాటాలు లేకుండా మల్లికి రాములుతో పెళ్ళి జరిగింది. పెళ్లయిన తర్వాత ఆమె చాలా ఒద్దికగా ఉండేది. ఎప్పుడూ భర్తను కనిపెట్టుకుని, అతనికేం కావాలో అడక్కుండానే చేసిపెట్టేది. అతను పనికెళ్ళి వచ్చేసరికి అన్ని పనులు చేసేసి, వేడి నీళ్ళు పెట్టి, దగ్గరుండి స్నానం చేయించేది. అన్నాలు తిన్నాక, ఇద్దరూ మేడ మీద పడుకుని కబుర్లు చెప్పుకునే వాళ్ళు. ‘జీవితం మొత్తం ఇలానే గడిచిపోతే బాగుణ్ణు.’ అనిపించేదామెకి. కానీ అన్నీ అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది. పెళ్ళైన నెల తర్వాత ఓ రోజు, పనికి వెళ్ళిన రాములు గుండె నొప్పంటూ మధ్యాహ్నానికే ఇంటికొచ్చేశాడు. సమయానికి ఇంట్లో కోటయ్య కూడా లేకపోయేసరికి మల్లికి కంగారు మొదలయ్యింది. ‘డాక్టరుకి చూపిద్దాం పద బావా.’ అంటూ రాముల్ని బయల్దేరదీసింది. రాములు వినలేదు.‘వద్దులేవే. ఊరికే ఎందుకు డాక్టర్ దగ్గరికి పొయ్యేది? మొన్నే పట్నం పొయ్యి చూపించుకుని వచ్చినాం. అప్పుడు తెచ్చుకున్న మాత్రలు అట్నే ఉండాయి. అవి ఏసుకుని పడుకుంటే తగ్గిపోతాదిగానీ. సొంబులో నీళ్ళు ముంచుకొని, ఆ మాత్రల సంచి ఇట్టా ఎత్తుకుని రా.’ అన్నాడు నొప్పికి అల్లాడిపోతూ.మల్లి మాత్రలు, నీళ్ళు తెచ్చి ఇచ్చింది. కాసేపటి తర్వాత నొప్పి తగ్గి కాస్త ఉపశమనం కలిగింది రాములుకి.తర్వాత కూడా అప్పుడప్పుడు రాములు కడుపు నొప్పితో బాధ పడేవాడు. అలా జరిగిన ప్రతిసారీ మాత్రలో, నాటు మందులో తీసుకునేవాడు. నొప్పి తగ్గుముఖం పట్టేది. కోటయ్య కూడా అక్కడితో వదిలేసేవాడు. మల్లికి మాత్రం రాములు నొప్పితో బాధ పడుతున్న ప్రతిసారీ చివుక్కుమనేది. ఏం జరుగుతుందో ఏమోనని మనసు గాభరా పడేది. అలా మరో రెండు నెలలు గడిచిపోయాయి. మల్లి మనసులో మళ్ళీ జీవితం మీద ఆశలు చిగురించడం మొదలుపెట్టాయి. రోజు రోజుకీ రాములు మీద మమకారం పెరిగిపోతోంది. ఇద్దరి మధ్యా బంధం గట్టిపడుతోంది.ఆ రోజురాత్రి మల్లి ఎందుకో సంతోషంగా ఉంది. ఇద్దరూ మిద్దె మీద వెన్నెల్లో, చాప మీద పడుకుని శరత్కాలపు వెన్నెలను ఆస్వాదిస్తున్నారు. కానుగ చెట్టు గాలికి మెల్లిగా ఊగుతోంది. కాసేపు మాట్లాడుకున్నాక, ‘బావా...’ అంది మల్లి నిర్మలంగా ఉన్న ఆకాశం కేసి చూస్తూ.‘ఊ...’ అన్నాడు రాములు కళ్ళు మూసుకుని.‘నీకో మాట చెప్పాలి.‘ అందామె‘చెప్పు.’ అన్నాడు రాములు కళ్ళు తెరవకుండానే.‘ఇప్పుడు నాకూ...’ అని మల్లి ఇంకా ఏదో చెప్పబోతుంటే‘...అమ్మా...!’ అంటూ మూలిగాడు రాములు.ఉలిక్కిపడి చూసింది మల్లి.రాములు గుండె నొప్పితో మెలికలు తిరుగుతున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పందిట్లో పడుకున్న కోటయ్యను లేపుకొచ్చిందామె. ఇద్దరూ కలిసి రాములు చేత మాత్రలు మింగించారు. అయినా నొప్పి తగ్గలేదు. ఈసారి నాటు మందులు కూడా విఫలమయ్యాయి. అర్ధరాత్రి అయ్యేసరికి నొప్పి తారస్థాయికి చేరింది. రాములు నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు. ఊపిరి సరిగ్గా ఆడటం లేదతనికి. శరీరం ఉబ్బిపోతోంది. చెమటలు పోసేస్తున్నాయి. ఇక లాభం లేదని, కోటయ్య పక్కింటి రమణని కేకేశాడు. రమణ రావడం, అంబులెన్సుకి ఫోను చెయ్యడం, మరో ఇద్దరి సాయంతో ఆస్పత్రికి ఏసుకెళ్ళడం అన్నీ నిముషాల్లో జరిగిపోయాయి. ఆ రాత్రంతా గుమ్మానికి ఆనుకుని ఏడుస్తూనే ఉంది మల్లి. ఎప్పుడో తెల తెలవారుతుండగా నిద్రపట్టిందామెకి.
లేచి చూసేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. రాత్రి తెల్లటి అంబులెన్స్ వ్యానులో వెళ్ళిన రాములు, పొద్దునకల్లా నల్లటి మార్చురీ వ్యానులో శవమై తిరిగొచ్చాడు. ఏ తప్పు చేయకపోయినా కొందరి జీవితాలు ఎందుకిలా విషాదమయం అయిపోతాయో ఎవ్వరికీ తెలియదు.అంత జరిగినా కూడా ఆమె ఏడవటం లేదు. అదే అక్కడున్న వారందరికీ ఆశ్చర్యంగా ఉంది. కోటయ్య తరపున వాళ్ళు ఎవరెవరో వస్తున్నారు. రాములు వైపు బాధగానూ, మల్లి వైపు వింతగానూ చూసి వెళ్ళిపోతున్నారు.‘పొద్దు పోతోంది ఇంక ఎత్తుబడి కానీయ్యండయ్యా.’ ఊరిపెద్ద సలహా ఇస్తున్నాడు.‘ఇంకా ఆ పిల్ల బంధువులెవరూ రాలేదే.!’ ఇంకో పెద్ద మనిషి సంజాయిషీ చెప్తున్నాడు.‘ఆ గురవయ్య తాగేసి ఏ చెట్టు కిందో పడిపోయుంటాడు. వోడి కోసం కూర్చుంటే కాదు. కానీయండి. కానీయండి.’ అంటున్నాడు ఊరిపెద్ద.‘ఆ నా కొడుకేమో ఎవరికో ఒకరికి ఇచ్చి చేసేయాలని చేసేశాడు. ఈడు చచ్చిపోయా..! ఇంకో రెండు రోజులుంటే ఆ కోటయ్య కూడా పోతాడు. ఆ తర్వాత ఆ బిడ్డ బతుకెట్ట?’ పాడె కడుతున్న ముసలోడు గొణుగుతున్నాడు.‘వోడికి గుండె జబ్బు ఉందని వాళ్ళ అబ్బకి ముందే తెలుసు తాతా. అంతా తెలిసే పాపం ఆ పిల్ల గొంతు కోశారు.’ ముసలోడికి పాడె కట్టడంలో సాయం చేస్తున్న యువకుడు చెప్తున్నాడు.పాడె సిద్ధమైంది. శవం కాళ్ళ దగ్గర టెంకాయ కొట్టి, పాడె మీద పడుకో బెట్టారు. ముందు కోటయ్య కుండలో నిప్పులు పట్టుకుని నడుస్తుండగా, రమణ, అతనితో పాటూ మరో ముగ్గురు యువకులు పాడె ఎత్తుకుని శ్మశానానికి బయల్దేరారు. సరిగ్గా అప్పుడొచ్చింది జయ. ఎలా తెలుసుకొని వచ్చిందో ఏమో. ఆటో దిగి పరిగెత్తుకుంటూ వచ్చి, పాడె వెళ్ళిపోతున్న వైపు నిరామయంగా చూస్తూ నిలబడ్డ మల్లిని ఒక్కసారిగా పొదివి పట్టుకొని ఏడవడం మొదలుపెట్టిందామె. మల్లి మాత్రం నిశ్చలంగా ఉంది. ఒక ఉలుకూ లేదూ, పలుకూ లేదు.‘ఏవైందే నీకు? కనీసం ఇప్పుడైనా ఏడవ్వే.’ అంటూ వెక్కి, వెక్కి ఏడుస్తోంది జయ.మల్లి ముఖంలో ఎటువంటి భావము లేదు. ఆమె కళ్ళు కురవడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయి. ఆమె మనసులో ఓ మథనం జరుగుతోంది. వర్షం ముందు ఏర్పడే నిశ్శబ్దంలాంటిది కాస్సేపామెని చుట్టుముట్టిన తర్వాత, నెమ్మదిగా ఆమె కళ్ళలోంచి, బుగ్గల మీదుగా జారాయి గోరువెచ్చని కన్నీళ్ళు. దూరంగా వెళ్ళిపోతున్న రాములు శవం కనుమరుగవుతుండగా... ఆప్యాయంగా తన మూడు నెలల కడుపును తడుముకుంటూ మౌనంగా ఏడ్చిందామె. అది ఏడుపు కాదు. రోదన.
వెంకట్ ఈశ్వర్
గోరువెచ్చని కన్నీరు
Published Sun, Sep 23 2018 12:26 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment