స్ట్రెచర్‌పైనే పెళ్లి | Wedding on stretcher itself | Sakshi
Sakshi News home page

స్ట్రెచర్‌పైనే పెళ్లి

Published Mon, Feb 29 2016 1:50 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

స్ట్రెచర్‌పైనే పెళ్లి - Sakshi

స్ట్రెచర్‌పైనే పెళ్లి

కొలిమిగుండ్ల: రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమారునికి గాయాలు కావడంతో స్ట్రెచర్‌పైనే అతనికి వివాహం చేశారు. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలో చోటుచేసుకుంది. ఉమ్మాయిపల్లెకు చెందిన ఆదినారాయణరెడ్డి కుమారుడు లక్ష్మినారాయణరెడ్డికి ఆళ్లగడ్డ మండలం పెద్ద కంబలూరుకు చెందిన లక్ష్మీతో వివాహం కుదిరింది. కొలిమిగుండ్లలోని షిర్డీసాయి ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బంధువులతో కలసి వరుడు కారులో బయలు దేరాడు. కారు తోళ్లమడుగు సమీపంలోకి రాగానే మలుపు వద్దనున్న కల్వర్టును బలంగా ఢీకొంది.

ఈ ప్రమాదంలో పెళ్లి కుమారుడి కాలు విరగగా, సమీప బంధువులు ధనుంజయరెడ్డి, భారతితో పాటు మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. వరుడికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. అయితే పెళ్లిని వాయిదా వేయకుండా యథావిధిగా జరిపించాలని బంధువులు చెప్పడంతో కాలికి కట్టుకట్టి..స్ట్రెచర్‌పైనే వరుడిని ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో కల్యాణ మండపానికి చేర్చారు. అనుకున్న ముహూర్తం మించిపోయినా...తొమ్మిది గంటలకు స్ట్రెచర్‌పైనే పెళ్లి తంతు జరిపించారు. వివాహ కార్యక్రమం ముగియగానే చికిత్స నిమిత్తం వరుడిని కర్నూలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement