
కారును ఢీకొన్న ప్రైవేటు బస్సు
కారు దగ్ధం, తల్లీ కుమారుడు మృతి
భార్య, కొడుకు, అత్తకు గాయాలు
కడప నుంచి బెంగళూరుకు
వస్తుండగా చింతామణి వద్ద ఘోరం
కర్ణాటక: చిక్కబళ్లాపురం జిల్లా చింతామణి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. సొంతూరులో బంధువులను పలకరించి సంతోషంగా బెంగళూరుకు(Bangalore) వస్తున్న కుటుంబంలో విషాదం చిందింది. తల్లీ కుమారుడు సజీవ దహనమయ్యారు. చింతామణి సమీపంలోని కంచార్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మదనపల్లి రోడ్డులో జోగ్యానహళ్లి–గోపల్లి మధ్య ఆదివారం ఉదయం 10 గంటలప్పుడు దుర్ఘటన జరిగింది. వారు ప్రయాణిస్తున్న బ్యాలెనో కారును ప్రైవేటు బస్సు ఢీకొనడంతో కారు మంటల్లో కాలిపోయింది.
బంధువుకు కొడుకు పుట్టాడని..
వివరాలు.. ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy)(30), ఆయన తల్లి కళావతి (52), ధనుంజయరెడ్డి భార్య శోభారాణి, కొడుకు మాన్విత్ రెడ్డి (3), శోభారాణి తల్లి మహాలక్ష్మీ కారులో బెంగళూరుకు బయల్దేరారు. ధనుంజయరెడ్డి కారు నడుపుతున్నారు. ఆయన తండ్రి గోపాల్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో కడప నగరంలోని రాఘవేంద్ర టౌన్ షిప్‌లో నివాసముంటూ ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తున్నారు. ధనుంజయరెడ్డి, భార్య ఐటీ ఉద్యోగులు కాగా, బెంగళూరు మహదేవపురలో నివాసముంటున్నారు.
కడపలో శోభారాణి అన్న సుబ్బారెడ్డికి కొడుకు పుట్టడంతో శనివారం అందరూ వెళ్లి చిన్నారిని చూసి సంతోషంగా గడిపారు. బెంగళూరుకు తిరిగి వస్తుండగా చింతామణి దగ్గర ఎదురుగా బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతున్న శ్రీ భారతి ప్రైవేటు బస్సు వేగంగా కారును ఢీకొట్టింది. కారు రోడ్డు పక్కన పడి మంటల్లో చిక్కుకుంది. అప్పటికే కారులోని వారు బయటకు ఎగిరిపడ్డారు. ధనుంజయరెడ్డి, తల్లి కళావతికి మంటలు అంటుకుని సజీవ దహనమయ్యారు. మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. బస్సు కూడా బోల్తా పడింది. అందులోని కొందరికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి.
కారు పూర్తిగా దగ్ధం
స్థానికులు చేరుకుని క్షతగాత్రులకు సాయం చేశారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసేటప్పటికి కారు పూర్తిగా దహనమైంది. జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి, డీఎస్పీ మురళీధర్, సీఐ వెంకటరమణప్ప తదితరులు పరిశీలించారు. మృతదేహాలకు చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. శోభారాణి, కొడుకు మన్విత్, మహాలక్ష్మీలకు ప్రథమ చికిత్స నిర్వహించి బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. ఆస్పతి దగ్గర బంధువుల రోదనలు మిన్నంటాయి.
Comments
Please login to add a commentAdd a comment