ఎంజీఎం: వరంగల్ ఎంజీఎంలో స్ట్రెచర్ అందుబాటులో లేక చికిత్స అనంతరం ఓ వృద్ధుడు తన భార్యను భుజాలపై మోసుకెళ్లిన ఘటన శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన మాలోతు లక్ష్మికి నవంబర్‌లో కుడికాలి రక్తప్రసరణ ఆగిపోయింది. శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు మోకాలు కింద నుంచి కాలును తొలగించారు.
రోగిని 15 రోజులకోసారి డ్రెస్సింగ్ కోసం తీసుకురావాలని సూచించారు. దీంతో లక్ష్మి ని ఆమె భర్త శుక్రవారం ఆస్పత్రికి తీసుకుచ్చాడు. అక్కడున్న సిబ్బంది ‘పెద్ద సార్ లేరు.. రేపు రావాలని చెప్పారు. ఆ సమయంలో స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో మండుతున్న ఎండలోనే భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లాడు. ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ స్పందించారు.
డ్రెస్సింగ్ అనంతరం సిబ్బంది రోగిని వీల్‌చైర్‌లో క్యాజువాలిటీ నుంచి బయటకు తీసుకొచ్చారన్నారు. కాలిపర్ (కాలుకు అమర్చే లోహ పరికరం) కోసం వెళ్లగా శనివారం అందుబాటులో ఉంటుందని, అప్పుడు రావాలని సిబ్బంది చెప్పారన్నారు. తిరిగి వెళ్లే క్రమంలో ఎండ తీవ్రత దృష్ట్యా భర్త తన భార్యను ఒక చెట్టు వద్దకు తీసుకెళ్లేందుకు భుజంపై ఎక్కించుకొని వెళ్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారన్నారు. ఇలాంటి ఘటనలతో ఆస్పత్రిని అభాసుపాలు చేయవద్దని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment