ఫిట్టర్‌దే పెత్తనం
► అప్పన్న గోశాల, నృసింహవనం..
► అక్కడంతా చిరుద్యోగిదే ఇష్టారాజ్యం
► ఈవోకు నమ్మినబంటు కావడమే అర్హత
► ఏఈవో, సూపరింటెండెంట్ ఉన్నా నామమాత్రమే
► లెక్కాపత్రం లేని జమాఖర్చులు పాలు, ఇతర ఫలసాయాలు
► ఎక్కడికెళుతున్నాయో తెలియదు
► అడిగే సాహసం ఎవరూ చేయరు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలోని గోశాల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు మొక్కు రూపంలో సమర్పిస్తున్న కోడెదూడల నిర్వహణ.. వాటి పోషణ నిమిత్తం దాతలు అందించే నిధుల లెక్కలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పన్న క్షేత్రానికి చెందిన గోశాల నాలుగేళ్ల కిందటి వరకు సింహాచలంలోనే ఈవో ఇంటికి సమీపంలోనే ఉండేది. భక్తులు సమర్పించిన కోడెదూడలను దేవస్థానం బహిరంగ వేలం వేసి విక్రయాలు జరిపేది. కానీ 2013లో కోడెదూడలను వేలం వేయరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అప్పటి నుంచి కోడెదూడలను గోశాలకు తరలిస్తున్నారు. అదే ఏడాది మే నెలలో సరైన సంరక్షణ లేక 40కిపైగా కోడెదూడలు ఒకేసారి మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. అప్పటి ప్రభుత్వ ఆదేశాలతో యుద్ధప్రాతిపదికన గోశాలను ముడసర్లోవ సమీపంలోని శ్రీకృష్ణాపురం వద్ద వంద ఎకరాల్లో నెలకొల్పారు. పాత గోశాలలో ఉన్న గోవులు, కోడెదూడలను అక్కడికి తరలించారు.
ఇక్కడ గోవుల మేతతోపాటు దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదానానికి కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నారు. గతంలో జరిగిన దుర్ఘటనలు పునరావృతం కాకుండా నిర్వహణ బాధ్యతలను ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఏఈవో). సూపరింటెండెంట్లకు అప్పజెప్పారు. ఆ లñ క్కన ప్రస్తుతం ఏఈవోగా పనిచేస్తున్న ఎం.కృష్ణమాచార్యులు, సూపరింటెండెంట్ డి.బంగారునాయుడు గోశాల, నృసింహవనాలను పర్యవేక్షించాలి. కానీ వాస్తవానికి అక్కడ జరుగుతున్న తంతే వేరు. ఆ ఇద్దరు అధికారులే కాదు.. ఏ ఉన్నతాధికారి కూడా గోశాల వైపు కన్నెత్తి చూడరు.
అంతా.. హరి..రాజ్యమే
గోశాల, నృసింహవనాల ఇన్‌చార్జిగా దేవస్థానంలోని ట్రాన్స్‌పోర్ట్ విభాగంలో ఫిట్టర్ కమ్ మెకానిక్‌గా ఉన్న డి.వి.ఎస్.రామరాజు అలి యాస్ హరి వ్యవహరించడం వివాదాస్పదమవుతోంది. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన ఇతను దేవస్థానం ఈవో రామచంద్రమోహన్‌కు నమ్మినబంటుగా పేరొందాడు. ఈ వో చేయాల్సిన పనులన్నీ ఇతగాడే చక్కబెడు తూ షాడో ఈవోగా ఇప్పటికే ముద్రపడ్డాడు. దే వస్థానంలో ఈవోతో ఏ పని అవ్వాలన్నా ముం దుగా హరిని సంప్రదిస్తే చాలన్న ప్రచారం బ లంగా ఉంది. చందనోత్సవాల సమయంలో కూడా సదరు హరి చేసిన ఓవర్ యాక్షన్‌పై ప్రజాత్రినిధులు కూడా మండిపడ్డారు.
గత ఏడాది జరిగిన బదిలీల్లో సింహాచలం దేవస్థానం నుంచి వెళ్లిన పలువురు ఉద్యోగులను ఈ ఏడాది మళ్లీ ఇక్కడికి తీసుకురావడంలో ఈ హరే కీలకంగా వ్యవహరించాడన్న వాదనలు ఉన్నాయి. ఈవోతో అతని సాన్నిహిత్యం, దేవాదాయ శాఖలో అతని ప్రాబల్యం మాట ఎలా ఉన్నా.. ప్రతిష్టాత్మకమైన గోశాల పెత్తనాన్ని అతనికి కట్టబెట్టేయడం విమర్శల పాలవుతోంది. గోశాలలో ఎన్ని కోడెదూడలు ఉన్నాయి.. వాటి సంరక్షణ ఎలా ఉందనేదానిపై దేవస్థానం అధికారుల వద్ద కూడా సరైన సమాచారం లేదంటే.. దాని నిర్వహణ పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
గతంలో ఇదే గోశాలపై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తాయి, గోవులను బయటకి తరలించి అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కొత్తవలస సంత, పూర్ణామార్కెట్ సెంటర్‌లో వ్యాన్లలో ఆవులను తరలిస్తుండగా పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. మళ్లీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆరోపణలున్న ఓ చిరుద్యోగికి గోశాల నిర్వహణ అప్పజెప్పేయడంపై అభ్యంతరాలు వ్యకమవుతున్నాయి.
ఎవరి లెక్క వారికి వెళ్తోందా..?
ఇక గోశాలకు ఎన్ని విరాళాలు వస్తున్నాయి.. నిర్వహణకు ఎంత ఖర్చవుతుందనే జమాఖర్చుల లెక్క అంతా హరే చూడటంపై విమర్శలు రేగుతున్నాయి. ప్రతి పూట సుమారు 50 లీటర్ల పాలు దేవస్థానానికి ఇక్కడి నుంచి పంపిస్తుంటారు. అలాగే అన్నదానానికి కావాల్సిన కూరగాయలను ఇక్కడి నుంచే వంటశాలకు తరలిస్తుంటారు. అయితే పాలు, కూరగాయాలు ఎంతమేరకు సవ్యంగా దేవస్థానానికి చేరుతున్నాయన్నది అనుమానమే. దేవస్థానానికంటే ముందు అధికారులు, సంబంధిత ఉద్యోగులు ..నీకింత.. నాకింత అని వాటాలు పంచుకున్న తర్వాతే మిగిలినవి దేవస్థానానికి తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.