సాక్షి, హైదరాబాద్: డెబ్భై ఐదేండ్ల స్వతంత్ర భారతంలో.. ఆదేశికసూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నామన్నది చేదు నిజమని పేర్కొన్నారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఉచిత పథకాలు వద్దంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పత్రిక ప్రకటన ద్వారా తీవ్ర స్థాయిలోనే కేటీఆర్ స్పందించారు.
అసలు మీ దృష్టిలో ఉచితాలంటే ఏమిటి?.. బడుగు, బలహీనవర్గాల ప్రజలే మీ టార్గెటా?. పేదలకు ఇస్తే ఉచితాలు, పెద్దలకు ఇస్తే ప్రోత్సాహకాలా?. కాకులను కొట్టి గద్దలకు వేయడమే మీ విధానమా. రైతు రుణమాఫీ చేదు, కార్పొరేట్ రుణమాఫీ ముద్దా?. నిత్యావసరాల మీద జీఎస్టీ బాదుడు.. కార్పొరేట్లకేమో పన్ను రాయితీలా?. మీకు దేశ సంపదను పెంచే తెలివి లేదు. దాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు చేసే మనసు లేదు.
నైజీరియా కన్నా అధ్వానం!
ఇటీవల ప్రధాని మోదీ గారు అవకాశం దొరికినప్పుడల్లా ఫ్రీబీ (రేవ్డీ) కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. అయన మాటలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎనిమిదేళ్ల పాలనలో దేశ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సామాన్యుడి బతుకు భారం చేసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం, ఇప్పుడు పేదవాడి పొట్టకొట్టడానికి వేసిన కొత్త పాచిక ఈ ఉచిత పథకాల మీద చర్చ!. ఓవైపు పాలు, పెరుగు లాంటి నిత్యావసర వస్తువుల మీద కూడా జీఎస్టీ పన్ను వేసి సామాన్యుల రక్తాన్ని జలగల్లా జుర్రుకునే ప్రణాళికలు అమలుచేస్తున్నదీ కేంద్ర బీజేపీ సర్కార్. మరోవైపు దేశంలోని పేద ప్రజల నోటి కాడి కూడును లాగేసే దుర్మార్గానికి తెగించింది.
ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశంలో పేదరికం పెచ్చుమీరి ఇప్పుడు నైజీరియా కన్నా ఎక్కువమంది పేదలున్న దేశంగా అపకీర్తిని గడించాం. వరల్డ్ హంగర్ ఇండెక్స్ (ఆకలి సూచి)లో నానాటికి దిగజారి 116 దేశాల్లో 101వ స్థానానికి చేరుకున్నాం. దేశంలో పుట్టిన పిల్లల్లో 35.5% మంది పోషకాహార లోపంతో పెరుగుదల సరిగ్గా లేదని కేంద్రం విడుదల చేసిన గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. మోదీకి ముందున్న రూ.14 మంది ప్రధానులు కలిసి రూ. 56 లక్షల కోట్ల అప్పుచేస్తే, మోదీ ఒక్కరే సుమారు రూ.80 లక్షల కోట్లకు పైగా అప్పుచేశారు.రూ. అసలు ఇన్నేసి లక్షల కోట్ల అప్పు తెచ్చి ఎవరిని ఉద్ధరించారు?.
ఇదీ చదవండి: మునుగోడు వైపు పోనే పోను-వెంకట్‌రెడ్డి
అంత అప్పుతో ఏం జేసిన్రు?
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డూఅదుపూ లేకుండా చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికే దేశ వార్షిక రాబడిలో 37% ఖర్చు అవుతున్నదని ఈమధ్యనే కాగ్ తీవ్ర హెచ్చరిక చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం కేంద్రప్రభుత్వం జీడీపీలో 40 శాతానికి మించి అప్పులు చేయకూడదని కానీ, మోదీ సర్కారు ఇప్పటికే 54 శాతం అప్పులు చేసిందని కాగ్ తలంటింది. పరిస్థితి ఇలాగే పోతే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్నదని కాగ్ హెచ్చరించింది.
మరి ఇంత సొమ్ము అప్పుగా తెచ్చిన మోడి ఆ డబ్బును ఏ వర్గాల ప్రయోజనాల కోసం ఖర్చుచేశారో చెప్పాలె. తెచ్చిన ఆ అప్పుతో ఒక్క భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండ్రా, మరేదైనా జాతీయ స్థాయి నిర్మాణం చేసిండ్రా? పోనీ పేదల కడుపునింపే ఒక్క సంక్షేమ పథకమైనా తెచ్చిండ్రా?. ఇవేవీ చేయనప్పుడు మరి ఇన్ని లక్షల కోట్లు ఎవరి బొక్కసాలకు చేరిందో ఆయనే చెప్పాలె. లక్షల కోట్ల అప్పులు తెస్తారు, దానితో ప్రజోపయోగ పనులు చేయరు, ఉల్టా వాళ్లే పేదవాడి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా పథకాలు పెడితే వాటి మీద ఫ్రీబీ కల్చర్ అంటూ విషం చిమ్ముతారు.
ఆదేశిక సూత్రాలే పరమావధి, కానీ..
మన రాజ్యంగంలో రాసుకున్న ప్రకారం భారత దేశం ఒక "సంక్షేమ రాజ్యం" అని నేను ప్రధానమంత్రికి గుర్తుచేయదలిచాను. భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు రాజ్యం (ప్రభుత్వం) ప్రజల శ్రేయస్సు కొరకు, సామాజికాభివృద్ధి కొరకు పాటుపడుతూ, ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించేందుకు ఎల్లవేళలా పనిచేస్తుందని పౌరులకు భరోసా ఇస్తాయి. ఆదేశిక సూత్రాల ప్రకారం భారత ప్రభుత్వం తన పౌరులందరికీ స్త్రీ పురుష వివక్ష లేకుండా సమానంగా జీవనోపాధి కల్పించాలి. సంపద ఒక దగ్గరే కేంద్రీకృతం కాకుండా, ప్రజలందరిలో పంపిణీ జరిగేలా చూడాలి. గ్రామపంచాయతీలకు ప్రోత్సాహకాలిచ్చి, స్వయంపాలన చేసుకోగలిగే పరిస్థితులను రాజ్యం కల్పించాలి. నిరుద్యోగులు, వృద్ధులు, అనారోగ్య పీడితులు, దిక్కు లేని వారి కోసం రాజ్యమే కనీస వసతులను కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల విద్య, ఆర్థికాభివృద్ధి, సామాజికాభివృద్ధి కొరకు రాజ్యం పాటుపడాలి. ప్రజాసంక్షేమానికి అవసరమైన ఇంకా అనేక విషయాలను ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. వీటి సాధనకు రాజ్యం నిరంతరం కృషి చేయాల్సి ఉంటుంది. కానీ, 75 ఏండ్ల స్వతంత్ర భారతంలో మనదేశం ఈ ఆదేశికసూత్రాల అమలులో ఎంతో వెనుకబడి ఉన్నదనేది చేదు నిజం అని కేటీఆర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మోదీకి ప్రత్యామ్నాయం ఆ ముఖ్యమంత్రేనా?
Comments
Please login to add a commentAdd a comment