![Telangana BJP Chief Bandi Sanjay Slams KCr Govt Over Sayanna Cremations - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/21/CM-KCR-bandi-sanjay.jpg.webp?itok=CuDKpXRl)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు మనవడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ఈ ప్రభుత్వం.. కంటోన్మెంట్ సాయన్న విషయంలో ఎందుకు వివక్ష ప్రదర్శించిందని? మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, సినీ ప్రముఖులు చనిపోతే.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదా? అని బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారాయన.
ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దళితుడు సాయన్న విషయంలోనే ఎందుకీ వివక్ష? అని కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించారు బండి సంజయ్. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే విషయంలో.. సర్కార్ అనుసరిస్తున్న తీరును బీజేపీ తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారాయన. శాసనసభ్యుడిగా ఐదు సార్లు గెలిచి ప్రజలకు సేవలందించిన వ్యక్తి సాయన్న. ఆయన మరణిస్తే అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించకపోవడం శోచనీయమని బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు వారసుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన ఒక శాసనసభ్యుడికి.. అదీ పదవిలో ఉండగానే మరణించిన వ్యక్తికి మాత్రం అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలకకపోవడం గర్హనీయమన్నారు. గతంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరణించిన నోముల నర్సింహయ్యతోపాటు మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎం.సత్యనారాయణరావు, సినీ రాజకీయ ప్రముఖుడు హరికృష్ణ లాంటి వాళ్లకు అధికారిక లాంఛనాలతో కేసీఆర్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు. దళితుడైన సాయన్న విషయంలో వివక్ష చూపడం క్షమించరాని విషయమన్నారు.
కేసీఆర్ స్పందనేది?
సాయన్న అంత్యక్రియల ఉదంతం మరవక ముందే.. ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డునున్న అంబర్ పేట నియోజకవర్గంలో గంగపుత్ర సామాజికవర్గానికి చెందిన 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించగా.. సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమని బండి సంజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, గిరిజన, బహుజనులంటే కేసీఆర్ కు ఎంత వివక్ష ఉందో రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలని ప్రజానీకానికి ఆయన పిలుపు ఇచ్చారు. ‘‘సమాజంలో అంతరాలుండకూడదని, అంటరానితనం నిర్మూలన జరగాలని కలలుకన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా పాలన కొనసాగిస్తూ.. కేసీఆర్ దళిత, గిరిజన, బలహీనవర్గాలను అణిచివేస్తున్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు సమానత్వం కోరుకునే నాయకులు, మేధావులు, బడుగు, బలహీనవర్గాల నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉండటం బాధాకరం. దళిత జాతికే అవమానం. తక్షణమే స్పందించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావ్రుతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment