న్యూఢిల్లీ: మూడు నెలల క్రితం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో ఎన్డీయే ప్రభుత్వం శుక్రవారం కీలక మార్పులు చేసింది. దేశవ్యాప్తంగా జీఎస్టీపై విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో జీఎస్టీని సులభతరం చేస్తూ పలు సవరణలు చేసింది. వివిధ శ్లాబుల్లో ఉన్న 27 వస్తువుల పన్నురేట్లను తగ్గించింది.
జీఎస్టీలో పన్ను చెల్లింపులు, రిటర్ను దాఖలు విధివిధానాలు క్లిష్టంగా ఉన్నాయంటూ చిన్న, మధ్యస్థాయి వర్తకులు వాపోతున్న నేపథ్యంలో వారికి ఊరట కలిగించేలా ఆయా విధానాలను కూడా సరళీకరిస్తూ శుక్రవారం జరిగిన 22వ భేటీలో జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకుంది. ఎగుమతిదారులకు కూడా నిబంధనలను సడలించింది. మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు.
దేశంలో పరోక్ష పన్ను వ్యవస్థను సమూలంగా మార్చివేస్తూ ప్రభుత్వం జూలై 1న జీఎస్టీని అమల్లోకి తీసుకురావడం తెలిసిందే. గత మూడు నెలల్లో ఎదురైన సమస్యలు, అనుభవాలను దృష్టిలో ఉంచుకుని తాజా నిర్ణయాలు తీసుకున్నట్లు జైట్లీ తెలిపారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై నవంబరు 9న జరిగే మండలి భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు.
జీఎస్టీ మండలి నిర్ణయాలు
► రూ.కోటిన్నర లోపు వార్షిక టర్నోవర్ కలిగిన వ్యాపార సంస్థలు ఇకపై ప్రతినెలా కాకుండా మూడు నెలలకోసారి పన్నును చెల్లించడంతోపాటు, రిటర్నులు దాఖలు చేయవచ్చు. దీనివల్ల 90 శాతం వ్యాపారులకు ఊరట కలగనుంది.
► ఇప్పటి వరకు రూ.75 లక్షల వరకు టర్నోవర్ కలిగిన కంపెనీలను కాంపోజిషన్ పథకంలో చేరేందుకు అనుమతిస్తుండగా, తాజాగా ఆ పరిమితిని కోటి రూపాయలకు పెంచారు. కాంపోజిషన్ పథకంలో ఉన్న వర్తకులు మూడు నెలలకోసారి తమ పన్నులు చెల్లించి, రిటర్నులు దాఖలు చేయవచ్చు. వివరంగా రికార్డులను నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పటివరకు 90 లక్షల మంది వర్తకులు జీఎస్టీ కింద నమోదు చేసుకోగా వారిలో 15 లక్షల మంది కాంపోజిషన్ పథకాన్ని ఎంపిక చేసుకున్నారు.
► ఎగుమతిదారులు జూలై నెలలో ఎగుమతులకు సంబంధించి చేసిన పన్ను చెల్లింపులకు సంబంధించిన రీఫండ్‌ను అక్టోబరు 10లోపు, ఆగస్టు నెల ఎగుమతులకు రీఫండ్‌ను అక్టోబరు 18లోపు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన కాలానికి ఎగుమతిదారులను మినహాయింపు పొందిన వర్గంగా పరిగణిస్తారు. వారు తాత్కాలికంగా నామమాత్రపు 0.1 శాతం జీఎస్టీ చెల్లిస్తే చాలు. 2018 ఏప్రిల్ 1 కల్లా ఎగుమతిదారుల కోసం ఈ– వాలెట్ ప్రారంభించి మూలధన సమస్య రాకుండా చూస్తుంది.
► భవిష్యత్తులో పన్ను రేట్లను ఏ ప్రాతిపదికన సవరించాలనే దానిపై ఓ నిర్దేశ పత్రాన్ని రూపొందించారు.
► రెస్టారెంట్లపై పన్నులను హేతుబద్ధీకరించడం, అంతర్రాష్ట్ర అమ్మకాల వర్తకులకు కూడా కాంపోజిషన్ పథకం సౌకర్యం కల్పించడంపై అధ్యయనం చేసే బాధ్యతలు మంత్రివర్గ బృందానికి అప్పగించారు. సాధారణంగా కాంపోజిషన్ పథకాన్ని ఎంచుకున్న వర్తకులకు ఇన్‌పుట్ క్రెడిట్ రాదు. ఈ పథకం కింద ప్రస్తుతం రెండు శాతం పన్ను చెల్లిస్తున్న తయారీదారులు ఇన్‌పుట్ క్రెడిట్ పొందే అవకాశం ఉంటుందా అన్న విషయాన్ని కూడా మంత్రివర్గ బృందం అధ్యయనం చేస్తుంది.
జీఎస్టీ మరింత సులభతరం: మోదీ
తాజాగా జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాలతో వస్తుసేవల పన్ను చెల్లింపు మరింత సులభతరం అయిందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్‌లో తెలిపారు. ఈ సందర్భంగా జీఎస్టీని ఆయన గూడ్స్ అండ్ సింపుల్ ట్యాక్స్‌గా మరోసారి అభివర్ణించారు. ఈ నిర్ణయం ప్రజలకు లబ్ధి చేకూర్చడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. వేర్వేరు వర్గాలతో విస్తృతంగా సంప్రదించి జీఎస్టీలో మార్పులు చేపట్టిన ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ఆయన బృందానికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. జైట్లీ తాజా సిఫార్సుల వల్ల చిన్న, మధ్య తరగతి వ్యాపారస్తులకు లబ్ధి కలుగుతుందని మోదీ పేర్కొన్నారు. కాంపోజీషన్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దామనీ, కేంద్రం ప్రస్తుత చర్యలతో జీఎస్టీ మరింత సమర్థవంతంగా తయారవుతుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇప్పటికే చాలా ఆలస్యమైంది : కాంగ్రెస్
జీఎస్టీలో మార్పులు చేపట్టడం ఇప్పటికే చాలా ఆలస్యమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తాజాగా జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాలను స్వాగతించిన కాంగ్రెస్.. ఈ సిఫార్సులు సామాన్య ప్రజలకు అత్యల్ప లబ్ధిని మాత్రమే చేకూరుస్తాయని పేర్కొంది. తప్పుడు నిర్ణయాలతో మోదీ ప్రభుత్వం దేశ జీడీపీని అదనంగా 2% పెంచే అవకాశాన్ని కోల్పోయిందని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ విభాగం చీఫ్ రణ్‌దీప్ సూర్జేవాలా తెలిపారు.
సవరించిన జీఎస్టీ పన్ను రేట్లు
వస్తువు పాత పన్నురేటు సవరించిన రేటు
బ్రాండెడ్ కాని నమ్‌కీన్ 12 శాతం 5 శాతం
ఆయుర్వేద ఔషధాలు 12 శాతం 5 శాతం
ముక్కలుగా కోసి ఎండబెట్టిన మామిడికాయలు 12 శాతం 5 శాతం
గుజరాత్, రాజస్తాన్‌లలో ప్రసిద్ధి పొందిన ఖాఖ్రా ఆహార పదార్థం 12 శాతం 5 శాతం
సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద పాఠశాల విద్యార్థులకు ఇచ్చే ఆహార పొట్లాలు 12 శాతం 5 శాతం
చేతివృత్తులైన జరీ, ఇమిటేషన్ జ్యువెలరీ, ఆహార పదార్థాల తయారీ, ప్రింటింగ్ 12 శాతం 5 శాతం
ఎక్కువ మంది కార్మికులు అవసరమయ్యే ప్రభుత్వ కాంట్రాక్టులు 12 శాతం 5 శాతం
యంత్రాలతోకాకుండామనుషులుతయారుచేసేనూలు 18శాతం 12 శాతం
స్టేషనరీ వస్తువులు 18 శాతం 12 శాతం
గ్రానైట్, మార్బుల్ మినహా నేలపై పరచడానికి ఉపయోగించే బండలు 18 శాతం 12 శాతం
నీటి పంపులు, డీజిల్ ఇంజిన్ల విడిభాగాలు 28 శాతం 18 శాతం
ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(ఈ–వేస్ట్) 28 శాతం 5 శాతం
Comments
Please login to add a commentAdd a comment