విదేశాల్లో ప్రధాని విమర్శలపై రగడ
రాజ్యసభలో విపక్షాల ధ్వజం
ప్రధానిని వెనకేసుకొచ్చిన జైట్లీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలి తన విదేశీ పర్యటనల్లో 60 ఏళ్ల మురికిని శుభ్రం చేస్తానంటూ గత ప్రభుత్వాలపై గుప్పించిన విమర్శలు మంగళవారం రాజ్యసభలో రగడకు దారి తీశాయి. ప్రధాని దేశ గౌరవాన్ని మంటగలిపారని విపక్షాలు తప్పుపట్టగా, అధికారపక్షం ఆయనను గట్టిగా వెనకేసుకొచ్చింది. తీవ్ర వాగ్వాదంతో సభ పలుసార్లు వాయిదా పడింది. అయితే విదేశీ గడ్డపై విపక్షాల గురించి మాట్లాడకుండా ప్రధానిపై నిషేధ ఉత్తర్వులేవీ లేవని, సభా నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ స్పష్టం చేశారు.
‘ప్రధాని వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు ఆందోళన క లిగించడాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే అవినీతితో కాకుండా అవినీతి ప్రస్తావనతోనే భారత్ పరువుపోతుందని జేడీయూ, సీపీఎం భావిస్తున్నాయా?’ అని అన్నారు. అంతకుముందు.. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి మోదీ వ్యాఖ్యలపై చర్చించాలంటూ కాంగ్రెస్ డిప్యూటీ నేత ఆనంద్ శర్మ నోటీసు ఇచ్చారు.
జన ఓషధిలో మరిన్ని మందులు
జన ఓషధి పథకంలో 14 కేన్సర్ నిరోధక, 23 గుండెజబ్బు మందులు, 14 మధుమేహ మందులను చేర్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు రసాయనాలు, ఎరువుల సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ లోక్‌సభకు తెలిపారు. మావోయిస్టుల సమస్యను ఎదుర్కోడానికి పార్టీలన్నీ ఏకతాటిపై రావాలని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కోరారు.
గిడ్డంగుల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
కేంద్ర గిడ్డంగుల సంస్థ(సీడబ్లూసీ)కి పూచీదారు బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడానికి ఉద్దేశించిన గిడ్డంగుల సంస్థ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. గత నెల లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లుకు మంగళవారం రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. దీంతో సీడబ్ల్యూసీకి మరింత ఆర్థిక స్వాతంత్య్రం రానుంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు(ఆర్‌ఆర్‌బీ) మూలధనాన్ని పెంచుకోవడానికి ఉద్దేశించిన సవరణ బిల్లుకు కూడా పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గత డిసెంబర్‌లో లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లును మంగళవారం రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.