నిధులు పెంచింది మేమే
ఉపాధి హామీ పథకంపై అరుణ్‌జైట్లీ
* కేంద్రం తీరుపై రాహుల్ విమర్శ
న్యూఢిల్లీ: ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా కేంద్రం చేస్తున్న వేడుకలపై అధికార, విపక్షాల మధ్య విమర్శల యుద్ధం మొదలైంది. అప్పుడు పథకం కాంగ్రెస్ వైఫల్యమన్న బీజేపీ.. పదేళ్ల సంబరాలు నిర్వహించటమేంటని కాంగ్రెస్ విమర్శించింది. ఢిల్లీలో కేంద్రం ‘ఉపాధి హామీ సమ్మేళన్’ పేరుతో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడుతూ.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాకే ఈ పథకానికి సరైన నిధులు అందుతున్నాయని వెల్లడించారు. యూపీఏ రెండో విడత పాలనలో ఈ పథకం.. గడ్డుపరిస్థితులు ఎదుర్కొందని వెల్లడించారు.
2013-14 సమయంలో (యూపీఏ రెండో విడత చివర్లో) ఈ పథకానికి బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించలేదని.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాకే నిధులు పెంచామన్నారు.. ‘కాంగ్రెస్ హయాంలో ఉపాధి హామీ పథకంలో అడుగడుగునా అవినీతి రాజ్యమేలింది. మేం అధికారంలోకి వచ్చాక.. పారదర్శకత, నిధులు పెంచాం. ఫలాలు నేరుగా ప్రజలకు చేరుతున్నాయి’ అని జైట్లీ తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక దీనిపై పార్లమెంటు లోపలా బయట చర్చ జరిగిందని.. పథకాన్ని ఉంచుతారా.. ఎత్తేస్తారా అనే అనుమానాలు వచ్చాయన్నారు.
గతంలో కంటే ఇప్పుడే పకడ్బందీగా గ్రామీణ ప్రజలకు ఉపాధి అందిస్తున్నామన్నారు. బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ బడ్జెట్‌ను రూ. 33వేల కోట్లనుంచి రూ. 36,997 కోట్లకు పెంచిన విషయాన్ని గమనించాలని గ్రామీణాభివృద్ధి మంత్రి చౌదరీ బీరేంద్ర సింగ్ తెలిపారు.
ఇదీ.. మోదీ రాజకీయ జ్ఞానం: రాహుల్ ‘యూపీఏ పథకాన్ని ఎన్డీఏ పొగడటం మోదీ రాజకీయ జ్ఞానానికి నిదర్శనం. ఉపాధి హామీ కాంగ్రెస్ వైఫల్యం అని ఆనాడు ప్రకటించిన మోదీ ఇప్పుడు దీన్ని విజయంగా ఒప్పుకోవాల్సి వస్తోంది’ అని రాహుల్ ట్వీట్ చేశారు.