ఎన్నికల్లో డబ్బు, మద్యం తదితర ప్రలోభాలను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న సోదాలు, హడావుడి ఈ సందర్భంగా ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లు సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులకు తీవ్రమైన చికాకు తెప్పిస్తున్నాయి.
ఎన్నికల్లో డబ్బు రవాణా, పంపిణీని నిలువరించేందుకు పటిష్టమైన ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడే బదులు.. అడుగడుగునా ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ల వద్ద రోజూ సాధారణ జనం నుంచి సైతం నిత్యం నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇంతా చేస్తే.. ఈ తతంగమంతా వృథా ప్రయాసగానే మారుతోందని, చాలావరకు కేసుల్లో అసలు దోషుల్ని గుర్తించడం లేదని, కొన్ని కేసులు విచారణకు సైతం నోచుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
90% డబ్బులు వెనక్కే..
గడిచిన రెండు సాధారణ ఎన్నికల్లోనూ భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన ఎన్నికల యంత్రాంగం.. ఎన్నికల అనంతరం నూటికి 96 శాతం తిరిగి సంబంధిత వ్యక్తులకు అప్పగించేశారు. ప్రస్తుతం కూడా వివిధ చెక్‌పోస్టుల్లో స్వాదీనం చేసుకుంటున్న కేసుల్లో 90 శాతం డబ్బును జిల్లా స్థాయి కమిటీలే తిరిగి సంబంధిత వ్యక్తులకు అందజేస్తున్నా..ఈ సందర్భంగా చిన్నా చితక వ్యాపారులు, సాధారణ జనాన్ని రోజుల తరబడి జిల్లా కలెక్టరేట్ల చుట్టూ తిప్పుతుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి ఎన్నికల్లో ప్రలోభాల కోసం రాజకీయ పక్షాలు అత్యధికంగా హవాలా, ప్రైవేటు బ్యాంకులు, విద్యా సంస్థలు, ఇతర వాణిజ్య సంస్థల నుండి భారీగా రవాణా చేస్తున్నా..అలాంటి వాటిని వదిలి పోలీసులు సాధారణ జనం మీద పడుతున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక సాధారణ ట్రాఫిక్ సాఫీగా ముందుకు సాగిపోయే వీల్లేకుండా రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వల్ల ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారనే విమర్శలు కూడా విన్పిస్తున్నాయి.
పన్ను కట్టించుకుని వదిలేస్తున్న ఐటీ
2014–2018 సాధారణ ఎన్నికల సందర్భంలోనూ స్వా«దీనం చేసుకున్న డబ్బు – శిక్షలు తదితర అంశాలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఆర్‌ఐటీ ద్వారా సమాచారం సేకరించగా, పది లక్షల లోపు అయితే జిల్లా అధికారులు, పది లక్షలు దాటితే ఐటీ అధికారులు పరిశీలించారు. ఐటీకి సంబంధించి ఒక వేళ పన్ను కట్టకపోతే పన్ను కట్టించుకుని, మరికొన్ని కేసుల్లో అడ్వాన్స్ పన్ను కట్టించుకుని ఆ మొత్తాలను తిరిగి ఇచ్చేసినట్లు తేలింది.హవాలా ద్వారా భారీ ఎత్తున వెళుతున్న డబ్బును స్వాధీనం చేసుకున్న మెజారిటీ కేసుల్లో ఇంకా న్యాయ విచారణలే మొదలు పెట్టకపోవటంతో ఒక్కరికీ శిక్ష పడలేదు.
అడ్వాన్స్ ట్యాక్స్‌లు.. సాగని విచారణలు
♦ 2018 ఎన్నికల్లో జనగామ వద్ద రూ.5.8 కోట్లతో వెళుతున్న కంటెయినర్‌ను పట్టుకున్న పోలీసులు కేసు నమోదు (576–2018) చేసి కోర్టుకు సమర్పించారు. ఈ కేసులో తీవ్ర అభియోగాలు నమోదు చేసినా.విచారణ ముందుకు సాగలేదు.
♦ ములుగు పరిధిలో పట్టుకున్న రూ.19.95 లక్షల కేసులోనూ రాజకీయ పార్టీ కి సంబంధించిన ఆధారాలున్నా ఆ దిశగా విచారణ ముందుకు సాగటం లేదు.
♦ 2104 ఎన్నిక సమయంలో బేగంబజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విశ్వాస్‌కుమార్ అనే వ్యక్తి నుండి స్వాదీనం చేసుకున్న రూ.8.38 లక్షల డబ్బును ఐటీ విభాగానికి అప్పగించగా, అందులోనుండి రూ.3.38 లక్షలు అడ్వాన్స్‌ట్యాక్స్‌గా కట్టించుకుని మిగిలిన డబ్బును తిరిగి అప్పగించారు.
♦ 2018లో కొడంగల్ నియోజకవర్గం మిర్జాపూర్‌లో రూ.17.5 కోట్ల నగదు ఉందని సమాచారం వస్తే ఐటీ అధికారులు దాడి చేసి నగదు స్వాదీనం చేసుకున్నారు. తీరా రూ.51 లక్షలు మాత్రమే స్వాదీనం చేసుకున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది.
♦ 2018లో పోలీసులు రూ.79.23 లక్షలు (500 డినామినేషన్) స్వాదీనం చేసుకుని కేసు నమోదు (190–2018) చేశారు. ఎన్నికలయ్యాక..అందులో రూ.23,000 మాత్రమే ఒరిజినల్ నోట్లుగా తేల్చి మిగిలినవి నకిలీగా పేర్కొన్నారు.
రాజకీయ లింకులు పరిశీలించాలి
ఎన్నికల సమయంలో యంత్రాంగం స్వాధీనం చేసుకునే మొత్తం రూ.10 లక్షల లోపు అయితే జిల్లా కమిటీకి, రూ.10 లక్షలు దాటితే ఆదాయపు పన్ను శాఖకు పంపుతున్నారు. కాగా జిల్లా స్థాయి కమిటీలు తగు రశీదులు సమర్పిస్తే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేస్తున్నాయి. అలా కాకుండా ప్రతి వ్యక్తి వెనుక రాజకీయ లింకులను లోతుగా పరిశీలించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐటీకి వెళ్లిన డబ్బు విషయంలో కూడా రవాణా చేస్తున్న వ్యక్తుల వివరాలు, ఇతరత్రా లోతుల్లోకి వెళ్లకుండా..కేవలం నల్లధనమా లేక తెల్లధనమా అనేది చూస్తున్నారు.
ఒక వేళ నల్లధనమైతే పన్ను కట్టించుకుని వదిలేస్తున్నారు. డబ్బును తీసుకువెళుతున్న కారణాన్ని విశ్లేషించి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఇక భారీ మొత్తాలు దొరికిన సమయాల్లో రాజకీయ పార్టీ ల కార్యకర్తలు, వారు నియమించిన కూలీలు దొరికిన సందర్భాల్లో లోతైన విచారణలు చేయాలి. అవసరమైతే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఇన్‌వాల్వ్ చేయాలని సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment