సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మధ్య విజయావకాశాల వ్యత్యాసం క్రమంగా తగ్గుతూ పోటీ రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో ఇరు పార్టీలు కూడా తమ విధానాలు, మేనిఫెస్టో అంశాలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు, నిందారోపణలకు పాల్పడుతున్నాయి. గుజరాత్‌ను గత 22 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీనే పాలిస్తున్నందున ప్రజల్లో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అలాగే కేంద్రంలోని పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి నిర్ణయాలకు ప్రజల్లో నిరసనలు వ్యక్తం అవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ విధానాలను, ఇప్పటి వరకు చేపట్టిన అభివద్ధి పనుల గురించి పాలకపక్షాన్ని నిలదీసే అవకాశం ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పాలనతోని బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని అభివద్ధిని పోలుస్తూ కాంగ్రెస్ పార్టీని, దాని మేనిఫెస్టోలోని అంశాలను బీజేపీ ఎండగట్టవచ్చు.
తొలుత ఈ దిశగానే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఈ రెండు జాతీయ పార్టీలు ఇప్పుడు దిగజారిన ప్రాంతీయ పార్టీల మాదిరిగానే వ్యక్తిగత దూషణలకు, పరస్పర నిందారోపణలకు దిగుతున్నాయి. తాను నరేంద్ర మోదీ లాంటి వ్యక్తిని కానని, మనిషినని రాహుల్ గాంధీ చెప్పడం, ఔరంగ జేబు వారసుడు రాహుల్ గాంధీ అంటూ మోదీ విమర్శించడం అలాంటి కోవకు చెందిన విమర్శలే. కాంగ్రెస్ పత్రిక ‘యువదేశ్’ లో మోదీని అవమానించేలా చాయ్‌వాలా కామెంట్‌ను ట్వీట్ చేసింది. బ్రిటీష్ ప్రధాన మంత్రి థెరిస్సా మేను నరేంద్ర మోదీ ‘మే మే’ అని సంబోధించగా, ప్రధాన మంత్రిని ప్రీమ్ అని పిలుస్తారని పక్కనే ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహా ఇవ్వగా, నీకెందుకిదంతా ‘ఛాయ్ బేజ్’ అని థెరిస్సా మే సలహా ఇచ్చినట్లు ఫొటోలతో కామెంట్ రాశారు. ఆ తర్వాత సైట్ నుంచి ఈ ట్వీట్‌ను తొలగించారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన సందర్భంగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ మాట్లాడుతూ ‘జహంగీర్ వారసుడిగా షాజహాన్ ఎన్నికైనప్పుడు ఎన్నికలు జరుగలేదు. షాజహాన్ వారసుడిగా ఔరంగ జేబు ఎన్నికైనప్పుడు ఎన్నికలు జరగలేదు. వారంతా వారసత్వంగా రాజులయ్యారు. కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు జరిగినప్పుడు ఎవరైనా పోటీ చేయవచ్చు. రండీ పూనావాలా రాహుల్‌కు వ్యతిరేకంగా పోటీ చేయండి’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ, నరేంద్ర మోదీ తమకు అనుకూలంగా వక్రీకరించారు. కాంగ్రెస్ పార్టీది ఔరంగ జేబు రాజ్యమని, రాహుల్ గాంధీ ఆయన వారసుడని మోదీ విమర్శించారు. లిటిగెంట్‌గా మాట్లాడే మణిశంకర్ అయ్యర్ రాహుల్ గాంధీ ఎన్నికల సందర్భంగా మొఘల్ వారసత్వం గురించి అనవసరంగా ప్రస్తావించి వక్రీకరణకు పరోక్షంగా కారణం అయ్యారు.
ఇక అయోధ్య కేసుకు, ఎన్నికలకు సంబంధం ఏమిటంటూనే నరేంద్ర మోదీ వివాదాస్పద రామ మందిరం సమస్యను ఎన్నికల ప్రచారంలోకి తీసుకొచ్చారు. 2019లో సార్వత్రిక ఎన్నికలు జరిగే వరకు అయోధ్య వివాదంపై విచారణను, తీర్పును వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీం కోర్టులో విజ్ఞప్తి చేయడాన్ని మోదీ తనకు అనుకూలంగా మల్చుకునేందుకు ప్రయత్నించారు. కపిల్ సిబల్ కూడా అనవసరంగా ఇలాంటి విజ్ఞప్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment