జీఎస్‌టీతో వృద్ధి జోరు.. చెత్త!
♦ ప్రస్తుతమున్న స్వరూపం అనుకూలం కాదు
♦ బహుళ పన్ను రేట్లతో సమస్యలు
♦ 13వ ఆర్థిక సంఘంలో పేర్కొన్నదే ఆదర్శనీయం
♦ నీతి ఆయోగ్ సభ్యుడు వివేక్ దేవ్‌రాయ్ విమర్శలు
న్యూఢిల్లీ: కీలకమైన ఆర్థిక విధానాల్లో ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే నీతి ఆయోగ్ సంస్థ సభ్యుడు, ప్రముఖ ఆర్థిక నిపుణుడు వివేక్ దేవ్‌రాయ్... ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్‌టీపై విమర్శలు గుప్పించారు. ముందుగా ఖరారైన స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారని, దీనితో జీడీపీ వల్ల ఒరిగేది ఏమీ ఉండదనే తీరులో ఆయన మాట్లాడారు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు తర్వాత స్థూల దేశీయోత్పత్తి 1 నుంచి 1.5 శాతం మేర వృద్ధి చెందుతుందంటూ వస్తున్న వార్తలన్నీ ‘పూర్తి పనికిమాలినవి’గా కొట్టి పడేశారు. అయితే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా సైతం జీఎస్‌టీతో జీడీపీ పుంజుకుంటుందని ప్రకటించారు కదా! అని విలేకరులు ప్రశ్నించగా... తాను వారితో విభేదించనని దేవ్‌రాయ్ స్పష్టం చేశారు.
హిందీ వార్తా చానల్ ఆజ్‌తక్ జీఎస్‌టీపై నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న దేవ్‌రాయ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘అసంపూర్ణ జీఎస్‌టీతో జీడీపీ ఎంత మేర పెరుగుతుందన్న సంఖ్యపై నాకు అవగాహన లేదు. ఇది ఎక్కువే ఉండొచ్చు లేదా తక్కువ కావచ్చు. కానీ 1.5 శాతం పెరుగుతుందన్నది మాత్రం ఆదర్శవంతమైన జీఎస్‌టీతో. ఈ సంఖ్య 13వ ఆర్థిక సంఘం నివేదికలో భాగంగా పేర్కొన్న జీఎస్‌టీ ఆధారంగా ఇచ్చినది. మనం దీనికి దగ్గర్లో కూడా లేమిప్పుడు’ ’అని వివేక్ దేవ్‌రాయ్ తన అభిప్రాయాలను కుండ బద్ధలు కొట్టినట్టు చెప్పారు.
మనకు తగినది కాదు...
భారత జీఎస్‌టీ ఆదర్శనీయమైనది కాదన్నారు. మన జీఎస్‌టీ సమాఖ్య స్వరూపంలో ఉండడమే అందుకు కారణంగా పేర్కొన్నారు. ఒకటికి మించిన రేట్ల స్వరూపం ఇబ్బందికరమేనని అభిప్రాయపడ్డారు. బహుళ పన్ను రేట్లు అడ్డంకులకు దారితీస్తాయని, తాను మాత్రం ఏక పన్నును సిఫారసు చేస్తానని చెప్పారాయన. ‘‘ఉన్నత వర్గాల వారు వాడుకునే వాటిపై అధిక పన్ను రేటు, పేద వారు వినియోగించే వాటిపై తక్కువ పన్ను రేటు విధిస్తారా..? ఓ ఆర్థిక వేత్తగా అలా చేయకూడదు. కావాలంటే ఈ పనిని ప్రత్యక్ష పన్నుల్లో చేసుకోవాలి. అంతేకానీ, పరోక్ష పన్నుల్లో కాదు. ఈ అంశాలకు పరిష్కారం వేరే విధంగా చూడాలి’’ అని దేవ్‌రాయ్ అభిప్రాయపడ్డారు. ఇక ప్రపంచంలో 140–160 దేశాల్లో జీఎస్‌టీ అమల్లో ఉందంటూ వస్తున్న వార్తలు కూడా చెత్తేనని, ఆరేడు దేశాలకు మించి దీన్ని అమలు చేయడం లేదన్నారు.
చిన్న స్టీల్ కంపెనీలకు సమస్యే
న్యూఢిల్లీ: జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన తర్వాత స్వల్ప కాలంలో స్టీల్ పరిశ్రమలోని అవ్యవస్థీకృత విభాగంలో ఉన్న వారికి ఇబ్బందులు ఎదురుకావచ్చని భారత స్టెయిన్‌లెస్ స్టీల్ అభివృద్ధి సంఘ(ఐఎస్‌ఎస్‌డీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. వీరందరూ టెక్నాలజీని అందిపుచ్చుకోలేరని పేర్కొంది. ‘‘వ్యవస్థీకృత తయారీదారులు సన్నద్ధం కాగలరు. వారు ఉద్యోగులు, వనరులను సమకూర్చుకోగలరు. సలహాదారులను, చార్టర్డ్ అకౌంటెంట్లను నియమించుకోగలరు. అవ్యవస్థీకృత రంగంలోని వారికి (చిన్న తరహా సంస్థలు) ఇవి సాధ్యం కావు. కొంత కాలం పాటు గందరగోళం ఉంటుంది. కొత్త పన్ను చట్టం ఎక్కువగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఆధారితమైనది. కానీ ఈ రంగంలో చిన్న సంస్థలు ఐటీని వినియోగించడం తక్కువే. దీన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది’’ అని ఐఎస్‌ఎస్‌డీఏ ప్రెసిడెంట్ కేకే పహూజా తెలిపారు.
ఆర్థిక రంగానికి ‘జీఎస్‌టీ’ బూస్ట్
న్యూఢిల్లీ: జీఎస్‌టీ పట్ల దేశీయ పరిశ్రమ అపార విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రేరణను ఇస్తుందని, అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహాన్నిస్తుందని కొనియాడింది. శనివారం నుంచి అమల్లోకి వస్తున్న కొత్త పన్ను వ్యవస్థ నిర్వహణకు తాము సర్వసన్నద్దంగా ఉన్నట్టు తెలిపింది.
ఎన్నో ప్రయోజనాలు
మధ్య కాలానికి స్థూల ఆర్థిక రంగంపై జీఎస్‌టీ ప్రభావం పూర్తిగా సానుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. పన్ను ఎగవేతలను అరికట్టడం వల్ల ద్రవ్యోల్బణం కూడా తగ్గుతుంది. పన్ను పరిధి విస్తరించడం వల్ల ప్రభుత్వానికి ఆదాయాలు కూడా పెరుగుతాయి. ద్రవ్యలోటు ఇక ముందూ నియంత్రణలోనే ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పరంగా పోటీతత్వం పెరుగుతుంది. ఎఫ్‌డీఐలకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. – చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్ జనరల్
వ్యాపారం మరింత సులభం
చరిత్ర సృష్టించడానికి బిగ్‌బ్యాంగ్ సంస్కరణ సిద్ధంగా ఉంది. ఈ ఒకే ఒక్క కీలకమైన పన్ను సంస్కరణతో వ్యాపార సులభతర నిర్వహణ విషయంలో అంతర్జాతీయంగా భారత్ ఎన్నో స్థానాలు ముందుకు వెళుతుంది. – సందీప్ జజోడియా, అసోచామ్ ప్రెసిడెంట్
అందరికీ లాభం
దేశ ఆర్థిక రంగానికి గణనీయమైన లాభం చేకూరుతుంది. పలు పన్ను చట్టాలను అర్థం చేసుకునే ఇబ్బంది తొలగిపోవడం వల్ల పన్ను చెల్లింపుదారుకూ ప్రయోజనం చేకూరుతుంది. – ఫిక్కీ