గోరఖ్‌పూర్: బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ సీఎం మాయావతి ప్రధాని మోదీపై ఘాటు విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే అమాయకురాలైన భార్య జశోదాబెన్‌ను మోదీ వదిలేశారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీలోని మహిళా నేతలు కూడా మోదీలా తమ భర్తలు తమను వదిలేస్తారేమో అని కలవరపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మోదీ సెకనుకో కులం మార్చుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాబట్టి మోదీలాంటి వ్యక్తికి ఓటేయవద్దని దేశంలోని మహిళలందరికీ విజ్ఞప్తి చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాయావతి ప్రధానిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
బీజేపీ మహిళా నేతలకు భయం
రాజస్తాన్‌లోని ఆళ్వార్‌లో దళిత మహిళపై అత్యాచారం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలన్న మోదీ డిమాండ్‌పై మాయావతి స్పందిస్తూ.. ‘ఈ విషయంలో మోదీ నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. రాజకీయ ప్రయోజనాల కోసం సొంత భార్యనే వదిలేసిన వ్యక్తి ఇతరుల చెల్లెళ్లు, భార్యలను ఎలా గౌరవిస్తాడు? ఇటీవల నాకు ఓ కొత్త విషయం తెలిసింది. తమ భర్తలు మోదీకి సమీపంగా ఉండటం చూసి బీజేపీ మహిళా నేతలే ఆందోళనకు గురవుతున్నారట! వాళ్లంతా మోదీలాగే తమను వదిలేస్తారని భయపడుతున్నారట. మోదీ హయాంలో గుజరాత్‌లో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై తీవ్రమైన దాడులు జరిగాయి. కాబట్టి ఆళ్వార్ ఘటనపై మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదు’ అని స్పష్టం చేశారు. మోదీని తప్పించేవరకూ ఎస్పీ–బీఎస్పీ పొత్తు దృఢంగా ఉంటుందని స్పష్టం చేశారు.
మాయావతి క్షమాపణ చెప్పాలి: బీజేపీ
మోదీపై వ్యక్తిగత విమర్శలు చేసిన మాయావతి క్షమాపణలు చెప్పాలని కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాయావతి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీల వివరాలను సీతారామన్ మీడియా ముందు ప్రదర్శించారు. ‘దళిత హక్కుల సాధన కోసం బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన మాయావతి.. దళిత్ బేటీ(దళిత కులం యువతి) స్థాయి నుంచి దౌలత్‌కీ బేటీ(ధనికురాలైన మహిళ)గా మారారు’ అని దుయ్యబట్టారు. మోదీపై విమర్శలతో మాయావతి తన స్థాయిని దిగజార్చుకున్నారనీ, ఆమె ప్రజాజీవితానికి అనర్హురాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు.
భార్యను వదిలేసినోడు.. ఇతరుల చెల్లెళ్లను గౌరవిస్తాడా?
Published Tue, May 14 2019 4:21 AM | Last Updated on Tue, May 14 2019 9:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment