ఇస్కాన్ మాయాపూర్‌కు చెందిన రెండు ఏనుగులు బిష్ణుప్రియ, లక్ష్మీప్రియల సంరక్షణ బాధ్యతలను జంతు పునరావాస కేంద్రం వంతారా తీసుకోనుంది. గత ఏప్రిల్‌లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసిన విషాద సంఘటన తరువాత ఈ మేరకు ఇస్కాన్, వంతారా మధ్య ఒప్పందం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ఆధ్వర్యంలోని జామ్‌నగర్‌లో ఉన్న వంతారా జంతు సంరక్షణ కేంద్రం ప్రసిద్ధి చెందింది.
అనంత్ అంబానీ స్థాపించిన వంతారా ఈ రెండు ఏనుగులకు శాశ్వత నివాసం కల్పించనుంది. ఈ ఏనుగుల బదిలీకి సంబంధించి త్రిపుర హైకోర్టు ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నుంచి పూర్తి ఆమోదం లభించింది. ఆపదలో ఉన్న అడవి జంతువులను రక్షించడం, ఒత్తిడి లేని వాతావరణాన్ని కల్పించడానికి అనువైన ప్రాంతాలను అన్వేషించడం ఈ కమిటీ బాధ్యత.
బిష్ణుప్రియ, లక్ష్మీప్రియ ఏనుగుల కోసం సహజ ఆవాసాన్ని ప్రతిబింబించేలా వంతారాలో ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇస్కాన్ మాయాపూర్ 2007 నుంచి లక్ష్మీప్రియను, 2010 నుంచి బిష్ణుప్రియను ఆలయ ఆచారాలకు, వివిధ పండుగ సందర్భాలకు ఉపయోగిస్తోంది. కొన్ని కారణాల వల్ల గత ఏప్రిల్‌లో బిష్ణుప్రియ మావటిపై దాడి చేసింది. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (పెటా) ఇండియా, వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్‌తో సహా జంతు సంరక్షణ సంస్థలు ఇస్కాన్ ఏనుగులను సంరక్షణ కేంద్రానికి తరలించాలని తెలిపాయి.
ఇదీ చదవండి: ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంబానీ హాజరు
వంతారా
అనంత్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 3వేల ఎకరాల్లో వంతారా పేరుతో కృత్రిమ అడవిని ఏర్పాటు చేశారు. ఇందులో జంతువులు నివసించేందుకు వీలుగా సహజంగా ఉండేలా వసతులు ఏర్పాటు చేశారు. ఈ అడవిలో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్దది. పూర్తిగా పోర్టబుల్ ఎక్స్‌రే యంత్రాలు, శస్త్ర చికిత్సల కోసం లేజర్ యంత్రాలు, పాథాలజీ ల్యాబ్‌లు, హైపర్‌బారిక్ ఆక్సిజన్ ఛాంబర్‌తోపాటు అధునాతన సదుపాయాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment