ఇంటికే మొక్క | Plants Distribution Soon in Hyderabad Haritha Haram | Sakshi
Sakshi News home page

ఇంటికే మొక్క

Published Tue, Jul 16 2019 11:15 AM | Last Updated on Fri, Jul 19 2019 10:44 AM

Plants Distribution Soon in Hyderabad Haritha Haram - Sakshi

నర్సరీల్లో సిద్ధంగా ఉన్న పూలమొక్కలు

సాక్షి, సిటీబ్యూరో: హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈసారి ప్రజలకు అందజేసే మొక్కల్ని నేరుగా వారి ఇళ్లకే చేర్చేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ప్రతి ఏటా ప్రజలు ఇళ్లలో నాటుకునేందుకు 50 లక్షల నుంచి 90 లక్షల మొక్కల వరకు పంపిణీ అవుతున్నట్లు లెక్కలు చూపుతున్నప్పటికీ, వాటిని ఎవరికి పంచుతున్నారో, ప్రజలు వాటిని నాటుతున్నారో లేదో తెలియడం లేదు. హరితహారంలో భాగంగా ఇప్పటికే కోట్ల మొక్కలు నాటడంతో నగరంలో కొత్తగా నాటేందుకు స్థలాలు కూడా దొరకడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరం గ్రేటర్‌ పరిధిలో మూడు కోట్ల మొక్కలు నాటాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలకు పంపిణీ చేసే మొక్కలను పకడ్బందీగా పంపిణీ చేయడంపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. సంవత్సరంలో మూడు కోట్ల మొక్కలు నాటాల్సి ఉన్నా.. తొలిదశలో భాగంగా కోటి మొక్కలు నాటేందుకు జీహెచ్‌ఎంసీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంది. ఇందులో 5 లక్షలు జీహెచ్‌ఎంసీ నాటనుండగా, మరో 5 లక్షలు జంక్షన్లలో నాటేందుకు ప్రతిపాదించారు.

విద్యాసంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు, ఇతరత్రా సంస్థలకు తగిన స్థలాలుండి మొక్కలు నాటేందుకు ముందుకొచ్చే వారికి ఇచ్చేందుకు 5 లక్షలు కేటాయించాలని నిర్ణయించారు. ఇలా 15 లక్షలు పోను మిగతా 85 లక్షల మొక్కలు తమ ఇళ్లలో నాటుకునేందుకు ప్రజలకే అందజేయనున్నారు. ఈ పంపిణీ సక్రమంగా జరిగేందుకు.. పకడ్బందీ చర్యల కోసం జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది. మొక్కల కోసం ప్రజలకు ఎక్కడకూ వెళ్లకుండా వారి ఇళ్లకే వీటిని చేర్చాలనే యోచనలో జీహెచ్‌ఎంసీ ఉంది. అందుకుగాను ఇంటింటికి వెళ్లే స్వచ్ఛ ఆటోల ద్వారా ఈ మొక్కలను పంపిణీ చేసే యోచన ఉంది. ఉదయం పూట స్వచ్ఛ ఆటోలు ఇళ్లనుంచి చెత్తను తరలించాక, మధ్యాహ్నం ఖాళాగానే ఉండటంతో వాటి ద్వారానే ప్రతి ఇంటికీ పంపిణీ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ఇతరత్రా మార్గాలను కూడా ఆలోచిస్తున్నామని జీహెచ్‌ఎంసీ జీవవైవిధ్య విభాగం అడిషనల్‌ కమిషనర్‌ వి.కృష్ణ తెలిపారు.  ఒక్కో ఇంటికి తొలిదశలో 5–10 మొక్కల చొప్పున పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. జోనల్‌ కమిషనర్ల పర్యవేక్షణలో ప్రతి ఇంటికీ హరితహారం మొక్కలు అందేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తగినంత వర్షం పడ్డాక వీటి పంపిణీ ప్రారంభించనున్నారు. చెత్త తరలించే కార్మికులకు అన్ని ఇళ్లూ తెలుసు కనుక వారిద్వారా అయితే ప్రతి ఇంటికీ పంపిణీ కాగలవని భావిస్తున్నారు. పకడ్బందీగా పంపిణీకి అధికారులందరితోచర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొక్కలు పంపిణీ సందర్భంగా  ఇంటి నెంబర్‌తో పాటు వారి సంతకం, ఫోన్‌ నెంబర్‌ వంటివి సేకరించడం ద్వారా పంపిణీలో అవకతవకలకు తావుండదని భావిస్తున్నారు. ఒక వేళ ఎవరికైనా మొక్కలు అందని పక్షంలో సమీపంలోని  నర్సరీల ద్వారా కూడా పంపిణీ చేయనున్నారు.

నర్సరీల్లో కోటి మొక్కలు..
హరితహారం కార్యక్రమంలో మొక్కల పంపిణీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండేందుకు జీహెచ్‌ఎంసీకి చెందిన నర్సరీల్లోనే కోటి మొక్కలు పెంచుతున్నారు. జూలైలో పంపిణీ చేసేందుకు 50 లక్షలు సిద్ధంగా ఉన్నాయని అడిషనల్‌ కమిషనర్‌ తెలిపారు. ఆగస్టులో 30 లక్షలు, సెప్టెంబర్‌లో 20 లక్షలు అందుబాటులో ఉంటాయన్నారు.  
గ్రేటర్‌ నగరంలోని బహిరంగ, ఖాళీ ప్రదేశాల్లో జీహెచ్‌ఎంసీ  ఐదు లక్షల మొక్కలు నాటనుంది. గతంలో మొక్కలు నాటిన మార్గాల్లోని గ్యాప్‌లతోపాటు ఇతరత్రా ఖాలీ ప్రదేశాల్లో, పార్కుల్లో నీడనిచ్చే పెద్దచెట్లుగా పెరిగే మొక్కలు నాటనున్నారు. నగరంలో  జీహెచ్‌ఎంసీకి చెందిన పార్కుల్లో 616 పార్కులకు ప్రహరీలతోపాటు  లోపల ఎంతో ఖాలీ స్థలమున్నప్పటికీ  ఎలాంటి నిర్వహణకు నోచుకోకుండా అధ్వాన్నంగా ఉన్నట్లు ఇటీవలి సర్వేలో గుర్తించారు. ఈ 616 పార్కుల్లోనూ వాక్‌వే పోను మిగతా ప్రదేశంలో నీడనిచ్చే మొక్కలు ఎక్కువగా నాటనున్నారు. వాటితోపాటు అందమైన పూల మొక్కలు కూడా నాటనున్నారు. తద్వారా పార్కులు పచ్చగా, సుందరంగా, ఆహ్లాదంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇంకా మేజర్‌ రోడ్ల వెంబడి, ప్రజలు ఎక్కువగా ప్రయాణించే మార్గాల్లో నీడనిచ్చే పెద్దచెట్లుగా ఎదిగే మొక్కల్ని నాటనున్నారు. తద్వారా కాలుష్యం కొంతమేర తగ్గి పర్యావరణపరంగానూ శ్రేయస్కరమని  అధికారులు పేర్కొన్నారు.  ఇలా ఒక్కో జోన్‌కు సగటున 80వేల మొక్కల్ని  పంపిణీ చేయనున్నారు.  

పార్కుల్లో, రహదారుల వెంబడి..
పార్కులు, రహదారుల వెంబడి, ఆయా సంస్థలు, ఇతర  ఖాలీస్థలాల్లో నాటే వాటిల్లో కదంబ, వేప, కాంచనం, రావి, మర్రి, రేల, కానుగ, పట్టెడ,నేరెడు, చింత, ఉసిరి, నెమలినార, చందనం, మహాగని, పొగడ, బ్యాడ్మింటన్‌బాల్‌ట్రీ, ఫౌంటెన్‌ ట్రీ, పింక్‌షవర్, జావా కేసియా, బట్టర్‌కప్‌ట్రీ, సిస్సు, బాదం,  అడవిబాదం, పింక్‌ టబేబుయా, పింక్‌ ట్రంపెట్, మేడి, కసోడ్, జువ్వి, సిల్వర్‌ఓక్,  ఎర్ర చందనం, టేకు, తెల్లమద్ది జాతులకు వంటివి ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

ఇళ్లల్లో నాటేందుకు..
ఇళ్లల్లో నాటుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపే పండ్లు, పూల జాతులతోపాటు ఔషధ, సుగంధ మొక్కలకు  ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. వాటిల్లో సీతాఫలం, జామ, నిమ్మ, నేరేడు, మునగ, బొప్పాయి, కనకాంబరం, నందివర్ధనం, గులాబీ, సబ్జాతులసి, లెమన్‌గ్రాస్, కలబంద, పుదీన, మనీప్లాంట్స్‌ తులసి, హెన్నా, అడ్డసరం, మాచపత్రి, సరస్వతి, వేము, బోగన్‌ విల్లా, క్రసాండ్ర, హైబిస్కస్, మల్లె, నీరియం, ప్లుంబాగో,నైట్‌క్వీన్, పారిజాతం తదితర రకాలుంటాయని తెలిపారు. రహదారుల కూడళ్లలో  అందంగా కనబడే సీజనల్‌ పూలమొక్కలు నాటుతామని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement