కలప అమ్మకాలపై సెస్‌   | Govt study discusses on Special Tax | Sakshi
Sakshi News home page

కలప అమ్మకాలపై సెస్‌  

Published Thu, Jan 31 2019 1:50 AM | Last Updated on Thu, Jan 31 2019 1:50 AM

Govt study discusses on Special Tax - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: అటవీ సంపద తరుగుతున్నా సర్కారు ఖజానాకు పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఇకపై కలప క్రయవిక్రయాలపై ప్రత్యేక పన్ను విధించాలని యోచిస్తోంది. విలువైన అటవీ సంపద కారణంగా టింబర్‌ డిపోలు, సామిల్లుల్లో కోట్ల రూపాయల్లో టర్నోవర్‌ జరుగుతోంది. అయినా.. దీని వల్ల రాష్ట్ర సర్కారు ఖజానాకు పెద్దగా ఒరిగిందేమీ ఉండటం లేదు. మరోవైపు, విలువైన టేకు వనాలు క్రమంగా మైదానాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ విస్తీర్ణాన్ని 35%కు పెంచాలనే లక్ష్యంతో.. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం ఏటా వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఇకపై.. కలప విక్రయాలపై విధించనున్న పన్ను మొత్తాన్ని.. హరితహారం కార్యక్రమానికి వినియోగించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని అటవీశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అటవీ చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని యోచిస్తోంది. ‘జంగిల్‌ బచావో.. జంగిల్‌ బడావో’అనే నినాదంతో అటవీరక్షణపై పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. కలప అక్రమ రవాణాను చూసీచూడనట్లు వ్యవహరించిన అటవీశాఖ ఉన్నతాధికారులపై కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా అటవీ నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఈ మార్పుల్లో భాగంగా ఫారెస్టు పన్నును కూడా విధించేలా నిబంధనలను మార్చాలని భావిస్తోంది. 

మార్కెట్‌ ఫీజు మాదిరిగా 
ఆయా వ్యవసాయ ఉత్పత్తులపై ప్రస్తుతం జీఎస్టీతో పాటు, 1% మార్కెట్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. మార్కెట్‌ యార్డుల్లోనే కాకుండా, ఆ మార్కెట్‌ కమిటీ పరిధిలో ఎక్కడ క్రయవిక్రయాలు జరిగినా 1% మార్కెట్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే టేకు కలపపై ప్రస్తుతం 18% జీఎస్టీ అమల్లో ఉంది. ఇందులో 9% ఎస్జీఎస్టీ, 9%సీజీఎస్టీ. ఈ పన్నులో 50% రాష్ట్ర వాటా ఉన్నప్పటికీ, అదనంగా కొంత పన్ను విధించడం ద్వారా హరితహారం వంటి అటవీ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు మరింత ప్రోత్సాహం ఉంటుందని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం టింబర్‌ డిపోలు, సామిల్లులపై సరైన నిఘా కొరవడటంతో.. కలపపై ఆదాయం ప్రభుత్వానికి వచ్చే నామమాత్రంగానే ఉంటోంది. వాణిజ్యపన్నుల శాఖ పరిధిలో ఉండే ఈ సామిల్లులు, టింబర్‌ డిపోలు ఎంత చెల్లిస్తే అంతే అన్న ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో రూ.కోట్ల విలువైన అటవీసంపద తరిగిపోతున్నా.. సర్కారు ఖజానాకు పెద్దగా ఒరిగిందేమీ లేకుండా పోతోంది. 

ఇతర దేశాల నుంచి దిగుమతి 
నిజామాబాద్‌ జిల్లాలో దాదాపు 105 టింబర్‌ డిపోలు, సామిల్లులు ఉన్నాయి. వీటిలో స్మగ్లింగ్‌ కలపతోనే ఏటా కోట్ల రూపాయల దందా చేసేవే ఎక్కువ. కొన్ని సామిల్లులకు మహారాష్ట్రలోని యా వత్‌మాల్, కిన్వట్, పాండ్రకవుడా అటవీశాఖ డి పోల నుంచి మధ్యప్రదేశ్, గుజరాత్‌ వంటి రాష్ట్రాల నుంచి కూడా కలప దిగుమతి అవుతోంది. మయన్మార్, చైనా తదితర దేశాల నుంచి కూడా రాష్ట్రానికి కలప దిగుమతి చేసుకుంటున్నారు.  ఘనా వంటి ఆఫ్రికా దేశాల నుంచి కూడా కలప వస్తోంది. బాంబే షిప్‌యార్డుల నుంచి ఇక్కడికి తరలించి స్థానిక అవసరాలకు కలపను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో రూ. వందల కోట్ల టర్నోవర్‌ జరుగుతోంది. జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది నామమాత్రమే.  మార్కెట్‌ ఫీజు మాదిరిగా కొంత మొత్తాన్ని ప్రత్యేక పన్నుగా విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement