హరిత హారం..మహా యజ్ఞం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : ‘హరితహారం’ శ్రీకారానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఈనెల 10 వరకు జిల్లాలో నిర్వహించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వారం రోజుల్లో 3.10 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమంలో అధికారయంత్రాంగంతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులు, విద్యాసంస్థలు మమేకమవుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 41 మండలాల్లోని 243 నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. మొక్కలు నాటడంలో అటవీ శాఖతోపాటు ఐటీడీఏ ఇతర ప్రభుత్వ శాఖలు పాలుపంచుకుంటున్నారుు.
టేకు మొక్కలు 52 లక్షలు, ఎర్రచందనం 2.50 లక్షలు, వెదురు 9.50 లక్షలు, పండ్ల మొక్కలు 22లక్షలు, పూలమొక్కలు 30 లక్షలు, యూకలిఫ్టస్ కోటి మొక్కలు, మిగితావి ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనులకు అందించనున్నారు. పొలం గట్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహాలు, గ్రామాల్లోని అంతర్గత రోడ్ల వెంట, చెరువు గట్లపై, చెరువు గర్భంలో సిల్ట్ పేరుకున్న భూముల్లో, గ్రామాలను అనుసంధానం చేసే రోడ్ల వెంట, దేవాలయ భూములు, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూముల్లో మొక్కలను నాటనున్నారు. వారం రోజుల కార్యక్రమంలో ఓ వైపు ప్రజలకు అడవులతో జరిగే మేలును వివరిస్తూ మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు.
ఇప్పటికే పలు కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలు నాటాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్‌లు, బస్‌లపై హరితహారం పోస్టర్లు, స్టిక్కర్లు అంటిస్తూ ప్రజలకు అవగాహన కల్పించేలా ప్రచారం చేశారు. మొత్తం శాఖల వారీగా ఎన్ని మొక్కలు నాటారో కూడా ప్రభుత్వానికి ప్రతి రోజు నివేదిక అటవీ శాఖ అధికారులు అందించనున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 18.74 లక్షల మొక్కలు, భద్రాచలంలో 10.45 లక్షలు, ఖమ్మంలో 15.25 లక్షలు, కొత్తగూడెంలో 16.45 లక్షలు, మధిరలో 27.23 లక్షలు, పాలేరులో 22.08 లక్షలు, పినపాకలో 29.90 లక్షలు, సత్తుపల్లిలో 17.33 లక్షలు, వైరాలో 51.68 లక్షలు, ఇల్లెందు నియోజకవర్గంలో 34.72 లక్షల మొక్కలను నాటనున్నారు.
ఈ మొక్కలన్నీ 2.43 కోట్లు కాగా, మిగితా మొక్కలను అధికారులు సిద్ధంగా ఉంచారు. ప్రజా ప్రతినిధులు కూడా తమ నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో మొక్కలు నాటేందుకు సన్నద్ధులయ్యారు. పోడు భూములలో అధికారులు మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించడంతో వామపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గిరిజనులు పోడు చేసుకుంటున్న భూముల్లో ఎక్కడైనా అధికారులు మొక్కలు నాటితే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాయి.
మొక్కలు నాటనున్న మంత్రి తుమ్మల
హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం మధ్యాహ్నం 3.05 గంటలకు కలెక్టరేట్‌లో, 3.15 గంటలకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో, 3.20 గంటలకు వీవీ నగర్ కాలనీలో మొక్కలను నాటనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. 9,10 తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాకు రానుండటంతో ఆయనతో ఎక్కడ మొక్కలు నాటించాలనే దానిపై అధికారులు టూర్ షెడ్యూల్ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.