Timber depot
-
కబళించిన మంటలు.. ఐదేళ్ల కుమారుడుసహా దంపతుల సజీవ దహనం
కుషాయిగూడ (హైదరాబాద్): ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయం. కుషాయిగూడ, సాయినగర్ కాలనీలో ఉన్న ఓ టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే తీవ్రమైన మంటలు పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి అంటుకుని వ్యాపించాయి. అందులో ఆరు కుటుంబాలు నివసిస్తుండగా, అందరూ ఏదో విధంగా ప్రాణాలతో బయటపడినా ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మాత్రం అగ్నికీలల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. కుషాయిగూడ పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అంతా గాఢ నిద్రలో ఉండగా.. సాయినగర్ కాలనీ ప్రధానరోడ్డు మార్గంలో ఉదయ్‌శంకర్, శివసాయి అనే అన్నదమ్ములు శ్రీ ఆదిత్యసాయి ఎంటర్ప్రైజెస్ పేరుతో గత 25 సంవత్సరాలుగా టింబర్ డిపో నడుపుతున్నారు. ఏ జరిగిందో తెలియదు కానీ తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అందులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న భవనానికి అంటుకున్నాయి. అదే సమయంలో బాత్రూంకు వెళ్లేందుకు నిద్రలేచిన వాచ్మెన్ కుమార్తె ఉమ మంటలను గమనించి కేకలు పెడుతూ తల్లిదండ్రులను లేపింది. వారు వెంటనే మూడో అంతస్తులో ఉండే యజమాని రాంచందర్షాకు సమాచారం ఇవ్వడంతో పాటు భవనంలో ఉన్న వారిని అప్రమత్తం చేశారు. అప్పటికే భవనమంతా దట్టమైన పొగలతో నిండిపోయి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కింద దుకాణాలు, పైన పోర్షన్లు మూడంతస్తుల భవనంలో కింద వాణిజ్య దుకాణాలు ఉండగా, పైన యజమాని నివాసంతో పాటు ఆరు పోర్షన్లు ఉన్నాయి. వాచ్మెన్ అరుపులతో నిద్రలోంచి మేల్కొన్న వారు దిక్కుతోచని స్థితిలో ఆర్తనాదాలు చేస్తూ భవనం నుంచి బయట పడేందుకు ప్రయత్నించారు. కొంతమంది భవనంపైకి వెళ్లి పక్క భవనంపై నుంచి సురక్షితంగా బయట పడగా, మరికొందరు మంటల్లోంచే బయటకు వచ్చి గాయాలపాలయ్యారు. అయితే రెండో అంతస్తులోని సింగిల్ గదిలో ఉంటున్న సూర్యాపేట జిల్లాకు చెందిన రెపినేని నరేష్ (37), అతని భార్య సుమ (28) కొంచెం ఆలస్యంగా నిద్రలేచారు. అప్పటికే బయటంతా మంటలు, పొగ తీవ్రరూపం దాల్చాయి. సింగిల్ రూం కావడంతో వారికి మరో మార్గం లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కుమారుడు జశ్వంత్ (5)ను తీసుకుని మంటల్లోంచే గది నుంచి బయటకు వచ్చేందుకు ప్రయతి్నంచి..మొదటి అంతస్తు మెట్ల వద్ద పడిపోయి సజీవ దహనమయ్యారు. నరేష్ దంపతుల పెద్ద కుమారుడు అది్వక్ శనివారం రాత్రి అక్కడికి సమీపంలోనే ఉన్న సుభాష్ చంద్రనగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక రెండో అంతస్తులో ఉన్న నారాయణ, ఉమ దంపతులు బయటకు వచ్చే క్రమంలో మంటల సెగ తాకి గాయపడ్డారు. పద్మావతి అనే మహిళ రెండో అంతస్తు నుంచి చీర సాయంతో దిగుతుండగా మంటల వేడికి చీర తెగడంతో కింద పడిపోయి గాయపడింది. ఆమె భర్త పూర్ణచందర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా వాచ్మెన్ వీరమల్లేష్ ఇంట్లో ఉన్న సిలిండర్ పేలుతుందోమోనన్న భయంతో లోపలికి వెళ్లి దాన్ని తీసుకువచ్చే క్రమంలో స్వల్పంగా గాయపడ్డాడు. మంటలు క్షణాల్లోనే మంటలు భవనాన్ని చుట్టుముట్టాయని వాచ్మెన్ కూతురు ఉమ చెప్పింది. ఆరు గంటలు శ్రమించాం: ఫైర్ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి ‘అగ్ని ప్రమాదం గురించి 4 గంటలకు మాకు సమాచారం అందింది. పది నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలానికి చేరుకున్నాం. అప్పటికే మంటలు, దట్టమైన పొగ కారణంగా బిల్డింగ్‌లోకి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. సుమారు ఆరు గంటల పాటు శ్రమించి లోనికి ప్రవేశించాం. ఓ కుటుంబం మిస్ అయ్యిందని చెప్పడంతో గాలించగా మొదటి అంతస్తు కారిడార్‌పై ఓ శవం, మెట్లపై రెండు శవాలను గుర్తించాం..’అని చర్లపల్లి అగ్ని మాపక అధికారి శేఖర్‌రెడ్డి తెలిపారు. కాగా సాయినగర్ కాలనీలో చేపట్టిన బాక్స్ డ్రైన్ పనుల కోసం రోడ్డును తవ్వేయడంతో ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి దగ్గరగా చేరుకోలేక పోయాయని స్థానికులు చెప్పారు. ఇలావుండగా అగిప్రమాదాలకు సంబంధించిన ఎలాంటి భద్రతా వ్యవస్థ లేకుండా టింబర్ డిపో నిర్వహిస్తున్న శ్రీ ఆదిత్య సాయి ఎంటర్ప్రైజెస్ యజమాని నూతలపాటి శివసాయిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. నరేష్, సుమ, జశ్వంత్‌ల మృతదేహాలకు గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలానికి తరలించారు. ఈ సందర్భంగా మార్చురీ వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. పేలిన రెండు సిలిండర్లు.. మంటలు భారీఎత్తున ఎగసి పడటానికి భవనం కింద ఉన్న ఆటోమొబైల్ షాప్ గోదామే ప్రధాన కారణమనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. గోదాంలోని టైర్లు, ఆయిల్ డబ్బాలతో పాటుగా ఇతర సామగ్రికి నిప్పు అంటుకోవడం వల్లే ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అంటున్నారు. ప్రమాదం జరిగిన టింబర్ డిపోలో 8 గ్యాస్ సిలిండర్లు ఉండగా వీటిల్లో రెండు పేలిపోయాయి. టింబర్ డిపోలో అన్ని గ్యాస్ సిలిండర్లు ఎందుకున్నాయో తెలియరాలేదు. అలాగే అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్నది కూడా తెలియరాలేదు. మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: హోంమంత్రి హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, కార్మి క శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంపై హోం మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మృతుల కుటుంబాలను, గాయపడ్డ వారిని ఆదుకుంటామన్నారు. గాంధీ మార్చురీ వద్ద మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తానిక్కడికి వచ్చానని, తల్లిదండ్రుల మృతితో అనాథగా మిగిలిన అద్విక్ బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వమే చూస్తుందని మల్లారెడ్డి చెప్పారు. కాగా బాధిత కుటుంబానికి జీహెచ్ఎంసీ తరఫున రూ.2 లక్షల చొప్పున రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియాను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు. -
కుషాయిగూడలో భారీ అగ్నిప్రమాదం
-
బోయిగూడ స్క్రాప్ గోడౌన్లో ఘోర అగ్ని ప్రమాదం(ఫోటోలు)
-
గోడౌన్లో అగ్నిప్రమాదంపై మంత్రి తలసాని దిగ్భ్రాంతి
-
గోడౌన్లో అగ్నిప్రమాదంపై మంత్రి తలసాని దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: బోయిగూడలోని స్క్రాప్ గోదాంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి మంత్రి తలసాని చేరుకుని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సంఘటన చాలా బాధాకరమని, మృతి చెందిన వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అగ్ని ప్రమాదం సమాచారం అందిన వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా కృషి చేసినప్పటికీ భారీగా ప్రాణ నష్టం జరిగిందని విచారం వ్యక్తం చేశారు. ఉదయం మూడున్నర గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తామని, అనంతరం చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా అధికారులకు ఆదేశాలు జారిచేయనున్నట్లు తెలిపారు. -
బోయిగూడలో భారీ అగ్నిప్రమాదం
-
Hyderabad: భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం
సాక్షి, హైదరాబాద్/ బన్సీలాల్‌పేట్/ రాంగోపాల్‌పేట్/గాంధీ ఆస్పత్రి: వారంతా వలస కార్మికులు. పొట్టచేతపట్టుకుని బిహార్ నుంచి నగరానికి వచ్చారు. ఒక తుక్కు సామాన్ల గోదాంలో పనికి కుదిరారు. అందులోనే నివాసం ఉంటున్నారు. అదే వారికి శాపమైంది. పొద్దునంతా పనిచేసి రాత్రి అదమరిచి నిద్రపోయిన వారి బతుకులు నిద్రలోనే తెల్లారిపోయాయి. అగ్నిప్రమాదం వారిని బుగ్గిపాలుచేసింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతా కాలిపోయాయి. ఈ హృదయ విదారకమైన ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున గాంధీ ఆసుపత్రి సమీపంలో ఉన్న న్యూ బోయగూడ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది వలస కార్మికులు సజీవదహనమయ్యారు. ఒకవ్యక్తి మాత్రం కిటికీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. న్యూ బోయగూడలో సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తికి ఉన్న రేకుల షెడ్డు గోదాములో మొత్తం నలుగురు వ్యాపారాలు చేస్తున్నారు. దీని మధ్య భాగంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సంపత్ కుమార్.. శ్రావణ్ ట్రేడర్స్ పేరుతో తుక్కు సామాన్ల గోదాం నిర్వహిస్తున్నారు. ఇందులో పాత న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులు భారీగా ఉన్నాయి. వీటిని వేరుచేసి, ప్యాక్ చేయడానికి బిహార్‌కు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. అతడి వద్ద పని చేస్తున్న 12 మందికి షెడ్డులోని పక్క దుకాణాల మీదుగా సిమెంట్‌తో నిర్మించిన మెజనైన్ ఫ్లోర్ (ఒకఫ్లోర్లో పైభాగంలో పార్టీషన్ చేసి నిర్మించిన భాగం)లోని ఇరుకు గదిలో బస కల్పించాడు. 2 గదుల్లో ముందుదాన్ని ఉండటానికి, వెనుక దాన్ని వంట గదిగా వినియోగిస్తున్నారు. వీటిలోకి చేరడానికి గోదాము నుంచే ఇరుకైన స్పైరల్ స్టెయిర్‌కేస్ (మెట్లమార్గం) ఏర్పాటు చేశారు. హఠాత్తుగా మంటలు అంటుకోవడంతో.. ఈ మెజనైన్ ఫ్లోర్లో ఉన్న గదిలో మంగళవారం రాత్రి 12 మంది నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున 2.30–2.45 గంటల ప్రాంతంలో కింద ఉన్న గోదాంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పురవ్వలు ఎగిసి పడ్డాయి. అక్కడే ఉన్న పేపర్లు, ప్లాస్టిక్ వస్తువులకు మంటలు అంటుకు న్నాయి. అదే షెడ్డులో మెజనైన్ ఫ్లోర్ కింద ఉన్న వైర్ల దుకాణానికి మంటలు విస్తరించాయి. ఆ వైర్ల కు పైన ఉండే ప్లాస్టిక్ తొడుగుకు మంటలు అంటు కోవడంతో పొగలు వ్యాపించాయి. దీంతో వారికి మెలకువ వచ్చింది. స్టెయిర్ కేస్ ఉన్న ప్రవేశ ద్వారం వైపు నుంచే మంటలు వస్తుండటం, పొగ చుట్టుముట్టడంతో వాళ్లు గందరగోళానికి గురయ్యా రు. ప్రాణాలు కాపాడుకునేందుకు 11 మంది వెను క ఉన్న వంట గదిలోకి వెళ్లారు. ప్రేమ్ అనే కార్మికుడు మాత్రం కిటికీ ఊచను వంచి కిందికి దూకేసి ప్రాణాలు రక్షించుకున్నాడు. వంటగదిలో అగ్నికీలలు చుట్టుముట్టడంతో 11 మందీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడున్న గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరిపై ఒకరుగా పడి 11 మందీ గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. 3.45 గంటలకు వచ్చిన ఫైర్ సిబ్బంది శ్రావణ్ ట్రేడర్స్ నుంచి మంటలు వస్తుండటాన్ని సమీపంలోనే ఉన్న టింబర్ ట్రేడింగ్ కంపెనీ వాచ్ మెన్ గమనించి 3.15 గంటల ప్రాంతంలో తన యజమానికి సమాచారమిచ్చాడు. ఆయన పోలీసులకు ఫోన్‌చేయగా, 3.45 గంటల ప్రాంతంలో ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. కిటికీ నుంచి కిందకు దూకి అపస్మారకస్థితిలోకి వెళ్లిన ప్రేమ్‌ను గుర్తించిన పోలీసులు... అతడి ద్వారానే గోదాంలో 11 మంది ఉన్నట్లు తెలుసుకున్నారు. గోదాంలో కార్మికులు ఉంటున్న ఫ్లోర్‌కు వెళ్లడానికి ఉన్న స్పైరల్ స్టెయిర్ కేస్ వేడెక్కి ఉండటంతో ఆ ఫ్లోర్‌లోకి ప్రవేశించడానికి అగ్నిమాపక సిబ్బందికి 2 గంటలు పట్టింది. అక్కడి వంట గదిలో కుప్పగా పడిఉన్న 11 మంది మృతదేహాలను అతికష్టమ్మీద కిందికి తెచ్చారు. మొత్తం 8 ఫైరింజన్ల కృషి ఫలితం గా ఉదయం 8 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. విచారణ జరిపిస్తాం ప్రమాద స్థలాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్‌కుమార్ సందర్శించారు. మృతుల కుటుంబాలకు తలసాని సానుభూతి తెలిపారు. చనిపోయిన 11 మంది కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేíషియా చెల్లి స్తామని ప్రకటించారు. మృతదేహాలను ప్రభుత్వ ఖర్చులతో వారి స్వగ్రామాలకు పంపిస్తామన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. అనుమతుల్లేకుండా గోదాం నిర్వహిస్తున్న సంపత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సంపత్, అతడి సోదరుడు శ్రావణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షార్ట్ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. సంపత్ గతంలో భన్సీలాల్‌పేటలో గోదాము నిర్వహించినప్పుడు గోడ కూలిన ఘటనలో ఒకరు మృతిచెందారు. దీంతో తన దుకాణాన్ని బోయగూడకు మార్చారు. మృతులు వీరే.. ఈ గోదాంలో టన్నుల కొద్దీ పోగైన స్క్రాప్ నిల్వలను మంగళవారం తరలించాల్సి ఉండగా వాయిదా పడింది. ఈలోపు అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో దీపక్ రామ్ (36), బిట్టుకుమార్ (21), సికిందర్ రామ్ కుమార్ (40), ఛత్తిరీల రామ్ అలియాస్ గోలు (22), సత్యేంద్రకుమార్ (38), డోగ్రా కుమార్‌రామ్ అలియాస్ దినేష్ రామ్ (35), సింతూ కుమార్ (27), దామోదర్ మహాల్దార్ (27), రాజేష్ కుమార్ (25), అంకజ్ కుమార్ (26), రాజేష్ (22) సజీవదహనమ య్యారు. వీరు బిహార్‌లోని కతిహార్, చాప్రా జిల్లాలకు చెందినవారు. మృతుల్లో ఒకరైన గోలుకు వచ్చే నెల 18న వివాహం నిశ్చయమైంది. వచ్చే నెల 7న సొంతూరు వెళ్లేందుకు రైల్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాడు. అనునిత్యం ఇందులోనే ఉండే వాచ్‌మన్ లూయిస్ మూడు రోజులుగా మరో చోట నైట్‌డ్యూటీకి వెళ్తుండటంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అపస్మారకస్థితిలో సజీవ దహనం అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 11 మంది కార్మికుల మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగ వెలువడిందని, వారంతా అది పీల్చడంతో ఊపిరితిత్తుల్లోకి చేరి అపస్మారకస్థితిలోకి వెళ్లారని ఫోరెన్సిక్ వైద్యులు గుర్తించారు. ఆ తర్వాతే మంటల్లో కాలిపోయి ఉంటారన్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి బొగ్గు మాదిరిగా మారడంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. మృతదేహాలను గుర్తుపట్టడం కష్టంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమ్.. మృతదేహాల వేళ్లకు ఉన్న ఉంగరాలు, మెడలో ఉన్న గొలుసులను బట్టి మృతులను గుర్తించాడు. శంషాబాద్ నుంచి మూడు విమానాల్లో మృతదేహాలను గురువారం పట్నాకు తరలించనున్నామని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ‘బోయగూడ’పై ప్రధాని విచారం హైదరాబాద్‌లోని బోయగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా సికింద్రాబాద్ బోయగూడలో జరిగిన ప్రమాదంలో కార్మికులు మరణించడం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బిహార్ వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. సమగ్ర విచారణ జరపాలి ఈ ఘటన అత్యంత బాధాకరమని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. పర్యవేక్షణ లోపాలే కారణం భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. అనుమతుల నుంచి ఫైర్‌సేఫ్టీ చర్యల దాకా అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపమే ప్రమాదాలకు కారణమని పేర్కొన్నారు. జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తాం జనావాసాల మధ్య ఉన్న గోదాములను గుర్తించి తరలించేందుకు ఏర్పాట్లు చేసేలా అధికారులను ఆదేశించామని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. బుధవారం బోయగూడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీస్, ఫైర్, జీహెచ్ఎంసీ, విజిలెన్స్ తదితర విభాగాల ఉన్నతాధికారులతో హోంమంత్రి ఆయన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం మహమూద్ అలీ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంలో 11 మంది చనిపోయారని తెలిపారు. నగరంలో ఎక్కడెక్కడ ఇలాంటి గోదాములున్నాయో వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రమాదాలు జరగకుండా అటువంటి భవనాలను గుర్తించడానికి జీహెచ్ఎంసీ, ఫైర్ సర్వీసెస్ నేతృత్వంలో ప్రత్యేక టీమ్‌లు వేసి, ఆయా భవనాల యజమానులపై భారీగా జరిమానాలు విధించాలని మంత్రి సూచించారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, డీజీ ఫైర్ సర్వీసెస్ సంజయ్‌కుమార్ జైన్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ అవినాశ్ మహంతి తదితరులు పాల్గొన్నారు. డీఎన్ఏ పరీక్షలు చేయిస్తాం డీఎన్ఏ టెస్టు కోసం మృతదేహాల నుంచి నమూనాలు సేకరించామని, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు గాంధీ ఆస్ప త్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ‘నిప్పు’ను తప్పించుకుందామని వస్తే.. గతంలో రాణిగంజ్‌లో కొనసాగిన యూనిట్లు అగ్ని ప్రమాదాల కారణంగానే బోయగూడకు తరలించిన బ్రిటీషర్లు ఇక్కడా అడపాదడపా ప్రమాదాలు న్యూ బోయగూడలో ఉన్న టింబర్ ఇండస్ట్రియల్ ఏరియా అతి పురాతనమైనది. గతంలో రాణిగంజ్ ప్రాంతంలో కొనసాగిన ఈ యూనిట్లను బ్రిటీషు ప్రభుత్వ హయాంలో బోయిగూడకు తరలించారు. కారణం రాణిగంజ్‌లోనూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడమేనని వ్యాపారులు చెబుతున్నారు. 1974నుంచి బోయగూడలో టింబర్ బిజినెస్ నిర్వహిస్తున్న ఓ వ్యాపారి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘దేశంలో టింబర్ ఇండస్ట్రియల్ ఏరియాల్లో న్యూ బోయగూడలో ఉన్నది అతి పురాతనమైనది. కొన్ని దశాబ్దాల నుంచి నగరంలో ఈ మార్కెట్ కొనసాగుతోంది. కొన్నేళ్ల కిందటివరకు చెక్క, కలపకు మాత్రమే పరిమితమైన యూనిట్లు ప్రస్తుతం ఫ్లైవుడ్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఇండస్ట్రియల్ ఏరియా తొలినాళ్లలో రాణిగంజ్‌లోని రైల్వే బ్రిడ్జ్ పక్కన ఉండేది. ఆ రోజుల్లో బొగ్గుతో నడిచే స్టీమ్ ఇంజిన్ రైళ్లే ఉండేవి. సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు ఈ రైళ్లు కొద్దిసేపు రాణిగంజ్ ప్రాంతంలో ఆగేవి. ఆ సమయంలో ఇంజిన్‌లో బొగ్గు నింపుతుండగా పెద్దపెద్ద నిప్పురవ్వలు ఎగిరి బయట పడుతుండేవి. అవి సమీపంలోని టింబర్ యూనిట్లపై పడటంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరిగి కలప, చెక్క బుగ్గైపోయేది. దీంతో నష్టపోయిన అనేక మంది వ్యాపారులు రోడ్లపై పడ్డారు. ఈ అంశాలను వివరిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సిందిగా బ్రిటీషు వారికి ఇండస్ట్రియల్ ఏరియా ప్రతినిధులు మొరపెట్టుకున్నారు. దీంతో స్పందించిన బ్రిటీషు పాలకులు ఈ బోయిగూడ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అప్పట్లో ముషీరాబాద్‌లో ఉన్న సెంట్రల్ జైల్ నిర్వాహకులకు లేఖ రాసి, ఈ ప్రాంతాలన్ని టింబర్ ఇండస్ట్రీలకు కేటాయించారు. అప్పుడు దాదాపు 50 యూనిట్లు ఇక్కడ పని చేసేవి. కాలానుగుణంగా కార్మికుల లేమి, విద్యుత్ తదితర సమస్యల కారణంగా చాలా మూతపడ్డాయి. ప్రస్తుతం 15 యూనిట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనూ అప్పుడప్పుడు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. టింబర్ యూనిట్లు, డిపోలకు తోడు స్క్రాప్ గోదాములు వచ్చి చేరడమే ప్రమాదాలకు ప్రధాన కారణం. బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి సమీపంలోనే పదేళ్ల క్రితం ఓ భారీ ఉదంతం చోటు చేసుకుని ఇద్దరు మరణించారు. ఆ తర్వాత ప్రమాదాలు జరిగినా, ప్రాణనష్టాలు లేవు’అని ‘సాక్షి’కి చెప్పారు. 11 గంటలకు పడుకున్నాం: ప్రేమ్ ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమ్ (22) ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మిగిలిన వాళ్లతో కలిసి నేను మంగళవారం రాత్రి 11 గంటలకు నిద్రకు ఉపక్రమించా. ఉన్నట్టుండి శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉండటంతో మెలకువ వచ్చింది. అప్పటికే దట్టమైన పొగతో మంటలు చుట్టుముట్టాయి. అంతా వెనుక వైపు ఉన్న వంట గదిలోకి వెళ్లగా, నేను మాత్రం పక్కనే ఉన్న కిటికీ నుంచి కిందికి దూకడంతో ప్రాణాలు దక్కాయి’ అని రోదిస్తూ చెప్పారు. పదిశాతం కాలిన గాయాలతో ఉన్న ప్రేమ్ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు. టెక్నాలజీతో కంట్రోల్ చేద్దాం సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటనలో ప్రమాదం జరిగిన ఫ్లోర్‌లోకి వెళ్లడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి రెండు గంటలు పట్టింది. బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు ఉన్న స్పైరల్ స్టెయిర్ కేస్ (మెట్లు) వేడెక్కిపోవడంతో ఇబ్బందిపడాల్సి వచ్చింది. వేకువజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో మంటలంటుకోగా ఉదయం 8 గంటలకు 8 ఫైరింజన్లు కష్టపడి మంటలార్పాయి. అయితే అగ్ని ప్రమాదాల్లో మంటలను త్వరగా ఆపేందుకు మన దేశంలో అత్యాధునిక పరికరాలేమున్నాయి, ఎలాంటి టెక్నాలజీని వాడి మంటలను అదుపు చేస్తున్నారు, ప్రాణాలను ఎలా కాపాడుతున్నారు? రిమోట్ కంట్రోల్డ్ ఫైర్ ఫైటింగ్ మెషీన్ ప్రస్తుతం ఢిల్లీ అగ్నిమాపక శాఖ దగ్గర ఉంది. తీవ్రమైన వేడి ఉన్నప్పుడు, ప్రమాద స్థలంలోకి వెళ్లే పరిస్థితి లేనప్పుడు రిమోట్ ద్వారా కంట్రోల్ చేసే మెషీన్లను సులువుగా వాడొచ్చు. 140 హార్స్ పవర్‌తో పని చేసే డీజిల్ ఇంజిన్ ఇందులో ఉంటుంది. నిమిషానికి దాదాపు 2,400 లీటర్ల నీటిని ఇది పంప్ చేస్తుంది. పైగా ఇందులోని ఆటోమైజ్డ్ వాటర్ జెట్.. నీటిని కోట్లాది చిన్న చిన్న నీటి బిందువులుగా మార్చేస్తుంది. అవసరమైన ప్రదేశాల్లో నురగను కూడా ఉత్పత్తి చేసి పంప్ చేస్తుంది. టర్న్ టేబుల్ ల్యాడర్ పెద్ద పెద్ద బిల్డింగుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాడటానికి టర్న్ టేబుల్ ల్యాడర్‌ను వాడుతున్నారు. దీని ద్వారా దాదాపు 32 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి మంటలు ఆర్పవచ్చు. నిచ్చెనను జాగ్రత్తగా ఆపరేట్ చేయడానికి కంప్యూటర్ మానిటరింగ్ ఉంది. డిస్ప్లే ఇండికేషన్లు కూడా ఉన్నాయి. మోటార్ సైకిళ్లకు మిస్ట్ సిస్టమ్ ఈ తరహా సిస్టమ్‌ను మోటార్ సైకిళ్లకు బిగిస్తారు. ఇది దాదాపు 40 మైక్రాన్ల స్థాయిలో నీటి అణువులను వెదజల్లుతుంది. చిన్నస్థాయి, ఎలక్ట్రిక్ మంటలను ఆర్పేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో బాగా పని చేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడానికి ముందు మంటల తీవ్రతను ఇది తగ్గించగలుగుతుంది. హై ప్రెజర్ హోస్ రీల్ సిస్టమ్ నీటిని సమర్థంగా వాడి మంటలార్పడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా అత్యధిక ఒత్తిడితో నీటిని, ఇతర మంటలార్పే పదార్థాలు, ద్రావణాలను చల్లుతారు. విదేశాల్లో కొత్త టెక్నాలజీలు ఏమొచ్చాయి డ్రోన్లతో... అగ్ని ప్రమాదాల్లో మంటలార్పేందుకు చైనాలో డ్రోన్లను వాడుతున్నారు. ఎంత ఎత్తుకైనా, ఎక్కడికైనా చాలా సులువుగా డ్రోన్లు వెళ్లిపోగలవు. కచ్చితత్వంలో మంటలను ఆర్పగలవు. ఆ మధ్య చైనాలోని చాంగ్‌క్వింగ్‌లో డ్రోన్లతో మంటలార్పే డ్రిల్‌ను కూడా నిర్వహించారు. షాట్‌గన్స్ మంటలార్పే ఇంపల్స్ ఫైర్ ఎక్స్‌టింగ్విషింగ్ సిస్టమ్ షాట్ గన్స్‌లో తక్కువ స్థాయిలో నీటిని వాడతారు. అయితే అత్యధిక వేగంతో మంటలపై దీన్ని ప్రయోగిస్తారు. వీటిలోంచి వచ్చే నీటి బిందువులు సెకనుకు 120 మీ. వేగంతో వెళ్లి పరిసరాలను చల్లబరుస్తాయి. దీంతో మంటలు ఆరిపోతాయి. రోబోటిక్ ఫైర్ ఫైటర్స్ చూడటానికి అచ్చం యుద్ధ ట్యాంకులా ఉంటుంది. ఇది నిమిషానికి 2 వేల నుంచి 20 వేల లీటర్ల నీటిని చల్లుతుంది. దీంట్లో కెమెరాలు, వేడిని గుర్తించే సెన్సార్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా రోబోలు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని దూరం నుంచే అగ్నిమాపక సిబ్బంది ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: వారిని రప్పించండి లేదా కేసు కొట్టేయండి -
Timber Depot: ‘టేక్’ఓవర్ చేసింది
తిండిలేని పరిస్థితి నుంచి ఉన్నత పారిశ్రామికవేత్తగా ఎదిగారు నాడు ఛీ అన్నవారు నేడు ఆమె అభివృద్ధికి ఆశ్చర్యపోతున్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టింబర్ డిపో యజమానిగా ఎదిగారు ప్రియ అడపా ఉద్యోగిగా చేరిన కంపెనీకే యజమాని అయ్యారు ముళ్ళబాటను రెండు దశాబ్దాలలో పూలబాటగా మార్చుకున్నారు. ఇంటీరియర్ డెకరేషన్, ఫర్నిచర్ తయారీలతో వ్యాపారంలో ముందడుగు వేస్తున్నారు. ఉత్తమ ఎంటర్‌ప్రెన్యూర్‌గా లేడీ లెజెండ్ అవార్డును అందుకున్న ప్రియ అడపా విజయగాథ ఆమె మాటల్లోనే... మా తల్లిదండ్రులకు మేం ఇద్దరు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలం. నేను మూడో అమ్మాయిని. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవటంతో, మా అమ్మమ్మ దగ్గర ఏలూరులో ఏడాదిపాటు పెరిగాం. అక్కడ ఎక్కువ కాలం ఉండటం ఇబ్బంది కావటంతో నా పదమూడో ఏట రెండు వేల రూపాయల ఉద్యోగానికి హైదరాబాద్ వచ్చాను. కొంతకాలానికి ఒక టింబర్ డిపోలో ఐదు వేల రూపాయల జీతానికి రిసెప్షనిస్టుగా చే రాను. ఆ తర్వాత అదే టింబర్ డిపోకు ఇన్చార్జి బాధ్యతలు కూడా చేపట్టాను. ఉద్యోగం చేస్తూనే, బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశాను. క్రమేపీ నా జీతం లక్ష రూపాయలకు చేరింది. మా డిపోలో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎక్కువగా జరిగేది. కొంతకాలానికి ఆ యజమాని విదేశాలకు వెళ్లిపోవాలనే ఉద్దేశంతో డిపో మూసేద్దామనుకున్న సమయంలో 2013 లో నేను ఆ కంపెనీని కొన్నాను. అదే అప్పుడు ‘ఎకో నేచురల్’ అనే నా బ్రాండ్. నా వయస్సు 24 సంవత్సరాలు. అంతకాలం నేను దాచుకున్న డబ్బుతో గుడ్ విల్ కింద రూ. 8 ల„ý లు చెల్లించాను. స్నేహితుల సహకారంతో.. కంపెనీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఏడాది పాటు సమస్యలు ఎదుర్కొన్నాను. నాకున్న అనుభవం తో వాటిని అధిగమించాను. స్నేహితుల సహకారంతో ఓపెన్ స్పేస్‌లో షెడ్ వేసి, లైసెన్స్ కొనుక్కుని కంపెనీని విస్తరించాను. ఒక అమ్మాయి ఇంత పెద్ద ఆర్డర్ చేస్తుందా అని కొందరు, అమ్మాయికి సపోర్ట్ చేద్దాం అని కొందరు, ఆడపిల్ల కనుక మోసం చేయదని కొందరు... ఇలా అందరూ అమ్మాయి అనే అంశం మీదే మాట్లాడినా, ఆర్డర్లు ఇస్తున్నారు. మా టింబర్ డిపోలో నాణ్యమైన టేకు చెక్క మాత్రమే సప్లయి చేస్తున్నాను. టేకు చెక్కతో చాలా సమస్యలు ఎదురవుతాయి. టేకు లోపల గుల్లగా ఉంటే బావుండదు. నా అనుభవాన్ని ఉపయోగించి, వాటితో చిన్న చిన్న ఇంటీరియర్స్ చేయటం ప్రారంభించాను. దాంతో నష్టాల నుంచి బయటకు వచ్చాను. నేను స్వయంగా ఒక ఎకరంలో పూర్తిగా టేకు చెక్కతో ఫామ్ హౌస్ కట్టాను. లొంగిపోకూడదు.. ఒంటరిగా ఉన్న అమ్మాయి కనిపిస్తే చాలు.. ఆశలు చూపిస్తారు, ప్రలోభాలకు గురి చేస్తారు. ఆ ఆశలు కొంతకాలం వరకే ఉంటాయి. పదిరోజుల ఆనందం కోసం ఎదురు చూస్తే, జీవితాంతం బాధపడాలి. నాకు ఎంతోమంది ఎన్నో ప్రలోభాలు చూపించారు. వేటికీ లొంగకుండా, వ్యక్తిత్వంతో నిలబడ్దాను. ఉన్నత స్థాయికి ఎదిగాను. అందరికీ ఇప్పుడు నేను కొనుక్కున్న కారు, ఇల్లు కనిపిస్తాయి. ఈ స్థాయికి రావడం వెనుక 20 సంవత్సరాల స్ట్రగుల్ ఉంది. ధైర్యంగా ఎదుర్కోవాలి జీవితంలో ఎదురైన ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలే కానీ కుంగిపోకూడదు. చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేయడం మొదలు పెడితేనే ఎదగడానికి అవకాశం వస్తుంది. అమ్మాయిగా పుట్టినందుకు కూడా చాలా గర్వంగా భావిస్తాను. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో బ్యాగు పోగొట్టుకుని, పది రోజుల పాటు తిండి లేకుండా ఫుట్‌పాత్ మీదే గడిపాను. ఆ సమయంలో ఒక కుటుంబం చేసిన సహాయం నా ఎదుగుదలకు బాటలు వేసింది. ఇప్పుడు ‘ఎకో నేచురల్’ అంటే ఒక బ్రాండ్. నాకు గుర్తింపు తెచ్చిన పేరు. నా ఎదుగుదలకు చిరునామా. – వైజయంతి పురాణపండ -
నేడు టింబర్ డిపోల బంద్
హైదరాబాద్: తెలంగాణ అటవీ శాఖ విధించిన నూతన ఆంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని సామిల్స్, టింబర్ డిపోలను ఈ నెల 11, 12, 13 తేదీల్లో సామూహికంగా బంద్ చేస్తున్నట్లు ది తెలంగాణ ఫెడరేషన్ ఆఫ్ టింబర్ మర్చంట్స్, సామిల్లర్స్, అలైడ్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఆదివారం సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన టింబర్ మర్చంట్స్ అసోసియేషన్ ముఖ్య ప్రతినిధుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ టింబర్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.గోపీకృష్ణ మాట్లాడుతూ.. జీవో 55ను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 55 తమకు తీవ్ర ఇబ్బందిగా పరిణమించిందని అన్నారు. వాల్టాపై ఆన్లైన్ అనుమతిని ఎత్తివేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నట్లుగా వేప, తుమ్మ, మామిడి చెట్లకు రూ. 450కి బదులుగా రూ. 50 చొప్పున అమలు చేయాలని కోరారు. రైతు పట్టా భూమిలో టేకుచెట్ల కొనుగోలుకు రవాణా అనుమతిని వారం రోజుల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు వాసుదేవరావు, విజయ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కలప అమ్మకాలపై సెస్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అటవీ సంపద తరుగుతున్నా సర్కారు ఖజానాకు పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం ఇకపై కలప క్రయవిక్రయాలపై ప్రత్యేక పన్ను విధించాలని యోచిస్తోంది. విలువైన అటవీ సంపద కారణంగా టింబర్ డిపోలు, సామిల్లుల్లో కోట్ల రూపాయల్లో టర్నోవర్ జరుగుతోంది. అయినా.. దీని వల్ల రాష్ట్ర సర్కారు ఖజానాకు పెద్దగా ఒరిగిందేమీ ఉండటం లేదు. మరోవైపు, విలువైన టేకు వనాలు క్రమంగా మైదానాలుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అటవీ విస్తీర్ణాన్ని 35%కు పెంచాలనే లక్ష్యంతో.. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం ఏటా వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఇకపై.. కలప విక్రయాలపై విధించనున్న పన్ను మొత్తాన్ని.. హరితహారం కార్యక్రమానికి వినియోగించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని అటవీశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అటవీ చట్టంలో మార్పులు చేర్పులు చేయాలని యోచిస్తోంది. ‘జంగిల్ బచావో.. జంగిల్ బడావో’అనే నినాదంతో అటవీరక్షణపై పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుట్టింది. కలప స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. కలప అక్రమ రవాణాను చూసీచూడనట్లు వ్యవహరించిన అటవీశాఖ ఉన్నతాధికారులపై కూడా కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా అటవీ నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించారు. ఈ మార్పుల్లో భాగంగా ఫారెస్టు పన్నును కూడా విధించేలా నిబంధనలను మార్చాలని భావిస్తోంది. మార్కెట్ ఫీజు మాదిరిగా ఆయా వ్యవసాయ ఉత్పత్తులపై ప్రస్తుతం జీఎస్టీతో పాటు, 1% మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లోనే కాకుండా, ఆ మార్కెట్ కమిటీ పరిధిలో ఎక్కడ క్రయవిక్రయాలు జరిగినా 1% మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే టేకు కలపపై ప్రస్తుతం 18% జీఎస్టీ అమల్లో ఉంది. ఇందులో 9% ఎస్జీఎస్టీ, 9%సీజీఎస్టీ. ఈ పన్నులో 50% రాష్ట్ర వాటా ఉన్నప్పటికీ, అదనంగా కొంత పన్ను విధించడం ద్వారా హరితహారం వంటి అటవీ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు మరింత ప్రోత్సాహం ఉంటుందని సర్కారు భావిస్తోంది. ప్రస్తుతం టింబర్ డిపోలు, సామిల్లులపై సరైన నిఘా కొరవడటంతో.. కలపపై ఆదాయం ప్రభుత్వానికి వచ్చే నామమాత్రంగానే ఉంటోంది. వాణిజ్యపన్నుల శాఖ పరిధిలో ఉండే ఈ సామిల్లులు, టింబర్ డిపోలు ఎంత చెల్లిస్తే అంతే అన్న ధోరణిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో రూ.కోట్ల విలువైన అటవీసంపద తరిగిపోతున్నా.. సర్కారు ఖజానాకు పెద్దగా ఒరిగిందేమీ లేకుండా పోతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 105 టింబర్ డిపోలు, సామిల్లులు ఉన్నాయి. వీటిలో స్మగ్లింగ్ కలపతోనే ఏటా కోట్ల రూపాయల దందా చేసేవే ఎక్కువ. కొన్ని సామిల్లులకు మహారాష్ట్రలోని యా వత్మాల్, కిన్వట్, పాండ్రకవుడా అటవీశాఖ డి పోల నుంచి మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి కూడా కలప దిగుమతి అవుతోంది. మయన్మార్, చైనా తదితర దేశాల నుంచి కూడా రాష్ట్రానికి కలప దిగుమతి చేసుకుంటున్నారు. ఘనా వంటి ఆఫ్రికా దేశాల నుంచి కూడా కలప వస్తోంది. బాంబే షిప్‌యార్డుల నుంచి ఇక్కడికి తరలించి స్థానిక అవసరాలకు కలపను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో రూ. వందల కోట్ల టర్నోవర్ జరుగుతోంది. జీఎస్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నది నామమాత్రమే. మార్కెట్ ఫీజు మాదిరిగా కొంత మొత్తాన్ని ప్రత్యేక పన్నుగా విధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. -
టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు అర్బన్ : పట్టణంలోని నెల్లూరురోడ్డులో గల ఓ టింబర్డిపోలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డిపోలోని రూ.60 లక్షలు విలువ చేసే టేకు సామగ్రి దగ్ధమైంది. ఘటనా స్థలాన్ని అగ్నిమాపకశాఖ ఏడీఎఫ్‌ఓ డి.యేసురత్నం పరిశీలించారు. స్థానిక నెల్లూరురోడ్డులో జయసుబ్బారెడ్డి అనే వ్యక్తి కొన్నేళ్లుగా టింబర్‌డిపో నిర్వహిస్తున్నారు. చెన్నై, ఇతర ప్రాంతాల నుంచి టేకు చెట్లను కొనుగోలు చేసి ఇంటి సామగ్రిగా తయారు చేసి విక్రయిస్తుంటాడు. రోజూ మాదిరే ఆదివారం రాత్రి డిపోను మూసివేసి ఇంటికెళ్లిన తర్వాత సోమవారం తెల్లవారుజామున 1–30 గంటల సమయంలో టింబర్డిపోలో మంటలు చెలరేగుతున్నాయని స్థానికులు ఫోన్లో తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ చిన్నయ్య సిబ్బందితో వెళ్లి మంటలను ఆర్పేందుకు యత్నించారు. అయితే మంటలు ఒక గది నుంచి మరొక గదికి వ్యాపించి భారీగా చెలరేగడంతో జిల్లాస్థాయి అధికారులకు తెలిపారు. వెంటనే వారు మైదుకూరు అగ్నిమాపక సిబ్బందిని కూడా ఘటనా స్థలానికి పంపించారు. వారు వచ్చేలోపు మూడు రౌండ్లు నీటిని కొట్టడంతో మంటలు కొద్దిగా తగ్గాయి. ఆ తర్వాత బద్వేలు, మైదుకూరు ఫైరింజన్లు 5 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. రూ.60 లక్షలు ఆస్తి నష్టం టింబర్ డిపోలో జరిగిన అగ్నిప్రమాదంలో సుమారు రూ.60 లక్షల మేర నష్టం వాటిల్లి ఉంటుందని టింబర్ డిపో యజమాని అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఇటీవలే రూ.1.20 కోట్ల టేకు మొద్దులను కొనుగోలు చేసి సామానుగా తయారు చేయించి డిపోలో భద్రపరిచామని, కొద్ది సరుకు అమ్ముడుపోగా రెండు గదుల్లోని సామగ్రి మొత్తం దగ్ధమైందని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏడీఎఫ్‌ఓ టింబర్డిపోలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని తెలుసుకున్న కడప ఏడీఎఫ్‌ఓ యేసురత్నం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెండు గదుల్లో దగ్ధమైన టేకు సామగ్రిని పరిశీలించడంతో పాటు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. చివరకు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. అలాగే ప్రమాదంలో ఎంత నష్టం సంభవించిందనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నష్టం అంచనా వేస్తామని తెలిపారు. -
బోయినపల్లి టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం
-
టింబర్ డిపోలో ఎగిసిపడ్డ మంటలు
-
కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం
-
ఛత్తీస్‌గఢ్‌లో మావోల దుశ్చర్య
- రూ. 5 కోట్ల ఆస్తి నష్టం ఛత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్‌లోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని సిరోంచ తాలూకా రోంపల్లి అటవీ శాఖకు చెందిన కలప డిపోకు ఆదివారం రాత్రి మావోయిస్టులు నిప్పుపెట్టారు. దీంతో సుమారు రూ. 5 కోట్ల విలువైన కలప కాలి బూడిదైంది. మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో భారీగా మావోయిస్టుల పోస్టుర్లు వెలిసాయి. మావోల బంద్ నేపథ్యంలో ఖమ్మం జిల్లా చర్లలో వ్యాపారులు దుకాణాలు మూసి వేశారు. -
కలప టింబర్ డిపోలో అగ్నిప్రమాదం
యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం ఉదయం భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. భువనగిరి ఖిల్లాకు సమీపంలోని ఓ కలప టింబర్ డిపోలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో డిపోలోని మూడు టింబర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనాస్ధలానికి చేరుకున్న అధికారులు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ప్రమాదంలో పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించినట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
భువనగిరిలో భారీ అగ్నిప్రమాదం
-
టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక మైదుకూరు రోడ్డులో ఉన్న స్టార్ టింబర్ డిపోలో మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమారు రూ.కోటి విలువైన కలప దగ్ధమైనట్టు బాధితులు చెప్పుతున్నారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తుంది. -
కలప డిపోలపై దాడులు
నంద్యాల(కర్నూలు): కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం నూనెపల్లెలో గురువారం ఉదయం అటవీశాఖ అధికారులు సోదాలు ప్రారంభించారు. సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం నుంచి కలపను ఇక్కడికి అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు కలప డిపోలపై దాడులు చేస్తున్నారు. డీఎఫ్‌వో శివప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న దాడుల్లో అనధికారికంగా నిల్వ ఉంచిన కలపను గుర్తిస్తున్నారు. -
టింబర్ డిపోలో అగ్నిప్రమాదం
వైఎస్సార్ జిల్లా అర్బన్: షార్టు సర్యూట్‌తో టింబర్ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన వైఎస్సార్ జిల్లా దేవుని కడప రోడ్డులో శనివారం రాత్రి జరిగింది. వివరాలు.. దేవుని కడప రోడ్డులోని తిరుపతి టింబర్ డిపోలో షార్టు సర్యూట్‌తో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటానా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఈ ప్రమాదంలో సుమారుగా రూ.10-15 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని డిపో యజమాని వెంకట సుబ్బయ్య తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పాతబస్తీ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలోని ఓ టింబర్ డిపో శనివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల వాళ్లు అప్రమత్తమవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు అంటుకోగానే.. ఫైరింజన్‌కు ఫోన్ చేశారు. సకాలంలో మూడూ ఫైరింజన్లు వచ్చి మంటలను ఆర్పివేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొద్ది రోజులుగా జనవాసాల్లో ఉన్న ఈ టింబర్ డిపోను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. -
షార్ట్ సర్క్యాట్తో టింబర్ డిపోలో మంటలు
-
అగ్గి.. బుగ్గి
= టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం = తెల్లవారుజామున ఘటన = లక్షలాదిరూపాయల టేకు కలప బూడిద = వాచ్‌మన్ కుటుంబానికి తప్పిన ప్రమాదం = భారీగా ట్రాఫిక్ జామ్ భోలక్‌పూర్,ముషీరాబాద్,న్యూస్‌లైన్: చిన్న అగ్గిరవ్వ...భారీ ప్రమాదం తెచ్చిపెట్టింది.. క్షణాల్లో మంటలు వ్యాపించి లక్షలాదిరూపాయలు ఆస్తినష్టం వాటిల్లింది.. భారీగా మంచుకురుస్తున్నా మంటలు అదుపుగాక చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు వ్యాపించడంతో వాటిల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సుమారు 12గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు అగ్నికీలలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..ముషీరాబాద్ ప్రధానమార్గం కేర్ ఆస్పత్రి పక్కవీధిలో ఈశ్వరయ్యకి చెందిన స్థలంలో లక్ష్మణ్ 14ఏళ్ల క్రితం టింబర్ డిపో కోసం స్థలాన్ని లీజుకు తీసుకొని మారుతీ టింబర్‌డిపో పేరుతో కలప వ్యాపారం చేస్తున్నారు. ఇందులో హనుమంతు,రేణుక దంపతులు వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఆరుగులు పిల్లలున్నారు. వీరంతా డిపోలో ఓ మూలన ఉన్న గదిలో ఉంటుంటారు. సోమవారం తెల్లవారుజామున 3:30 నుంచి 4గంటల మధ్యలో అనుమానాస్పదరీతిలో అగ్గి రాజుకొని క్రమంగా మంటలు వ్యాపించాయి. పక్క అపార్ట్‌మెంట్‌వాసులు దీన్ని గమనించి గట్టిగా కేకలు పెట్టడంతో వాచ్‌మన్ హనుమంతు నిద్రలేచి గదిలో నిద్రిస్తున్న భార్య, పిల్లలను బయటకు తీసుకొచ్చాడు. ఈలోపు మంటలు ఉవ్వెత్తున ఎగిసిపక్కనున్న రెండుభవనాలకు అంటుకున్నాయి. అసలే టేకుకర్రలు కావడంతో మంటలు భారీగా విస్తరించడంతో చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులుతీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నించినా అదుపులోకి రాకపోవడంతో 9 ఫైరింజన్లను రప్పించి సుమారు 12 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో లక్షలరూపాయల విలువైన టేకుకర్రలు దగ్ధమవ్వడంతోపాటు పక్క అపార్ట్మెంట్ పైపులు ఖాళీపోయాయి. వీధిన పడిన వాచ్‌మన్ కుటుంబం: ఈ అగ్నిప్రమాదంలో వాచ్‌మన్ కుటుంబసభ్యులు ఎలాగోలా బతికి బయటపడగా..గదిలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఆధార్‌కార్డులు, పిల్లల పుస్తకాలు, బట్టలు, రూ.5 వేల నగదు ఖాళీపోయాయని వాచ్‌మన్ భార్య రేణుక కన్నీరుమున్నీరయ్యింది. సందర్శించిన నేతలు,అధికారులు: అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నేతలు, అధికారులు హుటాహుటిన తరలివచ్చారు. ప్రమాదం గురించి ఆరాతీశారు. ఎంపీ అంజన్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే మణెమ్మ తనయుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు వాజిద్‌హుస్సేన్,ప్రభాకర్‌రెడ్డి, గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, జోనల్ కమిషనర్ శివపార్వతి తదితరులు చేరుకున్నారు. మారుతీ టింబర్‌డిపోకు ఎలాంటి అనుమతి లేకుంటే తప్పక యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టంచేశారు. స్తంభించిన ట్రాఫిక్ : ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రధానరోడ్డు కావడంతో ముషీరాబాద్-సికింద్రాబాద్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు మెల్లగా వెళ్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. -
టింబర్ డిపోలో అగ్నిప్రమాదం
-
ముషీరాబాద్‌లోని టింబర్ డిపోలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : ముషీరాబాద్‌లోని ఓ టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో డిపోలో నిల్వ ఉంచిన కలప తగలబడుతోంది. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. దాంతో సమీపంలోని భవనాలకు మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదం జరిగి అయిదు గంటలు గడిచినా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. సుమారు 2 కోట్ల మేరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఈ టింబర్ డిపోలో అగ్నిప్రమాదం జరిగింది. దాంతో స్థానికులు టింబర్ డిపోను అక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేసినా టింబర్ డిపో యజమాని మాత్రం పట్టించుకోలేదు. తరచు అగ్నిప్రమాదాలు జరగటంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.