Hyderabad Fire Accident: 11 Dead In Fire At Scrap Godown In Hyderabad - Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్‌ తుక్కు సామాన్ల గోదాములో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది బుగ్గి

Published Wed, Mar 23 2022 7:24 AM | Last Updated on Thu, Mar 24 2022 3:27 AM

Hyderabad : Fire Accident In Bhoiguda Timber Depot - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ బన్సీలాల్‌పేట్‌/ రాంగోపాల్‌పేట్‌/గాంధీ ఆస్పత్రి: వారంతా వలస కార్మికులు. పొట్టచేతపట్టుకుని బిహార్‌ నుంచి నగరానికి వచ్చారు. ఒక తుక్కు సామాన్ల గోదాంలో పనికి కుదిరారు. అందులోనే నివాసం ఉంటున్నారు. అదే వారికి శాపమైంది. పొద్దునంతా పనిచేసి రాత్రి అదమరిచి నిద్రపోయిన వారి బతుకులు నిద్రలోనే తెల్లారిపోయాయి. అగ్నిప్రమాదం వారిని బుగ్గిపాలుచేసింది. మృతదేహాలు గుర్తుపట్టలేనంతా కాలిపోయాయి. ఈ హృదయ విదారకమైన ఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున గాంధీ ఆసుపత్రి సమీపంలో ఉన్న న్యూ బోయగూడ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11 మంది వలస కార్మికులు సజీవదహనమయ్యారు. ఒకవ్యక్తి మాత్రం కిటికీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. 

న్యూ బోయగూడలో సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తికి ఉన్న రేకుల షెడ్డు గోదాములో మొత్తం నలుగురు వ్యాపారాలు చేస్తున్నారు. దీని మధ్య భాగంలో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన సంపత్‌ కుమార్‌.. శ్రావణ్‌ ట్రేడర్స్‌ పేరుతో తుక్కు సామాన్ల గోదాం నిర్వహిస్తున్నారు. ఇందులో పాత న్యూస్‌ పేపర్లు, ప్లాస్టిక్‌ వస్తువులు భారీగా ఉన్నాయి. వీటిని వేరుచేసి, ప్యాక్‌ చేయడానికి బిహార్‌కు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. అతడి వద్ద పని చేస్తున్న 12 మందికి షెడ్డులోని పక్క దుకాణాల మీదుగా సిమెంట్‌తో నిర్మించిన మెజనైన్‌ ఫ్లోర్‌ (ఒకఫ్లోర్‌లో పైభాగంలో పార్టీషన్‌ చేసి నిర్మించిన భాగం)లోని ఇరుకు గదిలో బస కల్పించాడు. 2 గదుల్లో ముందుదాన్ని ఉండటానికి, వెనుక దాన్ని వంట గదిగా వినియోగిస్తున్నారు. వీటిలోకి చేరడానికి గోదాము నుంచే ఇరుకైన స్పైరల్‌ స్టెయిర్‌కేస్‌ (మెట్లమార్గం) ఏర్పాటు చేశారు.  

హఠాత్తుగా మంటలు అంటుకోవడంతో..
ఈ మెజనైన్‌ ఫ్లోర్‌లో ఉన్న గదిలో మంగళవారం రాత్రి 12 మంది నిద్రించారు. బుధవారం తెల్లవారుజామున 2.30–2.45 గంటల ప్రాంతంలో కింద ఉన్న గోదాంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా నిప్పురవ్వలు ఎగిసి పడ్డాయి. అక్కడే ఉన్న పేపర్లు, ప్లాస్టిక్‌ వస్తువులకు మంటలు అంటుకు న్నాయి. అదే షెడ్డులో మెజనైన్‌ ఫ్లోర్‌ కింద ఉన్న వైర్ల దుకాణానికి మంటలు విస్తరించాయి.  ఆ వైర్ల కు పైన ఉండే ప్లాస్టిక్‌ తొడుగుకు మంటలు అంటు కోవడంతో పొగలు వ్యాపించాయి.

దీంతో వారికి మెలకువ వచ్చింది. స్టెయిర్‌ కేస్‌ ఉన్న ప్రవేశ ద్వారం వైపు నుంచే మంటలు వస్తుండటం, పొగ చుట్టుముట్టడంతో వాళ్లు గందరగోళానికి గురయ్యా రు. ప్రాణాలు కాపాడుకునేందుకు 11 మంది వెను క ఉన్న వంట గదిలోకి వెళ్లారు. ప్రేమ్‌ అనే కార్మికుడు మాత్రం కిటికీ ఊచను వంచి కిందికి దూకేసి ప్రాణాలు రక్షించుకున్నాడు. వంటగదిలో అగ్నికీలలు చుట్టుముట్టడంతో 11 మందీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో అక్కడున్న గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో ఒకరిపై ఒకరుగా పడి 11 మందీ గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు.  

3.45 గంటలకు వచ్చిన ఫైర్‌ సిబ్బంది 
శ్రావణ్‌ ట్రేడర్స్‌ నుంచి మంటలు వస్తుండటాన్ని సమీపంలోనే ఉన్న టింబర్‌ ట్రేడింగ్‌ కంపెనీ వాచ్‌ మెన్‌ గమనించి 3.15 గంటల ప్రాంతంలో తన యజమానికి సమాచారమిచ్చాడు. ఆయన పోలీసులకు ఫోన్‌చేయగా, 3.45 గంటల ప్రాంతంలో ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి.  కిటికీ నుంచి కిందకు దూకి అపస్మారకస్థితిలోకి వెళ్లిన ప్రేమ్‌ను గుర్తించిన పోలీసులు... అతడి ద్వారానే గోదాంలో 11 మంది ఉన్నట్లు తెలుసుకున్నారు.

గోదాంలో కార్మికులు ఉంటున్న ఫ్లోర్‌కు వెళ్లడానికి ఉన్న స్పైరల్‌ స్టెయిర్‌ కేస్‌ వేడెక్కి ఉండటంతో ఆ ఫ్లోర్‌లోకి ప్రవేశించడానికి అగ్నిమాపక సిబ్బందికి 2 గంటలు పట్టింది. అక్కడి వంట గదిలో కుప్పగా పడిఉన్న 11 మంది మృతదేహాలను అతికష్టమ్మీద కిందికి తెచ్చారు. మొత్తం 8 ఫైరింజన్ల కృషి ఫలితం గా ఉదయం 8 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి.  

విచారణ జరిపిస్తాం
ప్రమాద స్థలాన్ని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్, మహమూద్‌ అలీ, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ సందర్శించారు. మృతుల కుటుంబాలకు తలసాని సానుభూతి తెలిపారు. చనిపోయిన 11 మంది కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేíషియా చెల్లి స్తామని ప్రకటించారు. మృతదేహాలను ప్రభుత్వ ఖర్చులతో వారి స్వగ్రామాలకు పంపిస్తామన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు.

అనుమతుల్లేకుండా గోదాం నిర్వహిస్తున్న సంపత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సంపత్, అతడి సోదరుడు శ్రావణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. షార్ట్‌ సర్క్యూటే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. సంపత్‌ గతంలో భన్సీలాల్‌పేటలో గోదాము నిర్వహించినప్పుడు గోడ కూలిన ఘటనలో ఒకరు మృతిచెందారు. దీంతో తన దుకాణాన్ని బోయగూడకు మార్చారు.  

మృతులు వీరే.. 
ఈ గోదాంలో టన్నుల కొద్దీ పోగైన స్క్రాప్‌ నిల్వలను మంగళవారం తరలించాల్సి ఉండగా వాయిదా పడింది. ఈలోపు అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో దీపక్‌ రామ్‌ (36), బిట్టుకుమార్‌ (21), సికిందర్‌ రామ్‌ కుమార్‌ (40), ఛత్తిరీల రామ్‌ అలియాస్‌ గోలు (22), సత్యేంద్రకుమార్‌ (38), డోగ్రా కుమార్‌రామ్‌ అలియాస్‌ దినేష్‌ రామ్‌ (35), సింతూ కుమార్‌ (27), దామోదర్‌ మహాల్దార్‌ (27), రాజేష్‌ కుమార్‌ (25), అంకజ్‌ కుమార్‌ (26), రాజేష్‌ (22) సజీవదహనమ య్యారు. వీరు బిహార్‌లోని కతిహార్, చాప్రా జిల్లాలకు చెందినవారు. మృతుల్లో ఒకరైన గోలుకు వచ్చే నెల 18న వివాహం నిశ్చయమైంది. వచ్చే నెల 7న సొంతూరు వెళ్లేందుకు రైల్‌ టికెట్‌ కూడా బుక్‌ చేసుకున్నాడు. అనునిత్యం ఇందులోనే ఉండే వాచ్‌మన్‌ లూయిస్‌ మూడు రోజులుగా మరో చోట నైట్‌డ్యూటీకి వెళ్తుండటంతో ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  

అపస్మారకస్థితిలో సజీవ దహనం 
అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైన 11 మంది కార్మికుల మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగ వెలువడిందని, వారంతా అది పీల్చడంతో ఊపిరితిత్తుల్లోకి చేరి అపస్మారకస్థితిలోకి వెళ్లారని ఫోరెన్సిక్‌ వైద్యులు గుర్తించారు. ఆ తర్వాతే మంటల్లో కాలిపోయి ఉంటారన్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి బొగ్గు మాదిరిగా మారడంతో పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. మృతదేహాలను గుర్తుపట్టడం కష్టంగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమ్‌.. మృతదేహాల వేళ్లకు ఉన్న ఉంగరాలు, మెడలో ఉన్న గొలుసులను బట్టి మృతులను గుర్తించాడు. శంషాబాద్‌ నుంచి మూడు విమానాల్లో మృతదేహాలను గురువారం పట్నాకు తరలించనున్నామని పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.  

‘బోయగూడ’పై ప్రధాని విచారం 
హైదరాబాద్‌లోని బోయగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్‌ఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 

5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
సికింద్రాబాద్‌ బోయగూడలో జరిగిన ప్రమాదంలో కార్మికులు మరణించడం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన బిహార్‌ వలస కార్మికుల మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు. 

సమగ్ర విచారణ జరపాలి
ఈ ఘటన అత్యంత బాధాకరమని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. 

పర్యవేక్షణ లోపాలే కారణం
భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కోరారు. అనుమతుల నుంచి ఫైర్‌సేఫ్టీ చర్యల దాకా అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యం, పర్యవేక్షణలోపమే ప్రమాదాలకు కారణమని పేర్కొన్నారు. 
జనావాసాల మధ్య ఉన్న

గోదాములను తరలిస్తాం 
జనావాసాల మధ్య ఉన్న గోదాములను గుర్తించి తరలించేందుకు ఏర్పాట్లు చేసేలా అధికారులను ఆదేశించామని హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. బుధవారం బోయగూడలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పోలీస్, ఫైర్, జీహెచ్‌ఎంసీ, విజిలెన్స్‌ తదితర విభాగాల ఉన్నతాధికారులతో హోంమంత్రి ఆయన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం మహమూద్‌ అలీ మీడియాతో మాట్లాడుతూ ప్రమాదంలో 11 మంది చనిపోయారని తెలిపారు. నగరంలో ఎక్కడెక్కడ ఇలాంటి గోదాములున్నాయో వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

అలాగే ప్రమాదాలు జరగకుండా అటువంటి భవనాలను గుర్తించడానికి జీహెచ్‌ఎంసీ, ఫైర్‌ సర్వీసెస్‌ నేతృత్వంలో ప్రత్యేక టీమ్‌లు వేసి, ఆయా భవనాల యజమానులపై భారీగా జరిమానాలు విధించాలని మంత్రి సూచించారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, జీహెచ్‌ ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్, డీజీ ఫైర్‌ సర్వీసెస్‌ సంజయ్‌కుమార్‌ జైన్, నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్, రాచకొండ కమిషనర్‌ మహేశ్‌భగవత్, సైబరాబాద్‌ జాయింట్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి తదితరులు పాల్గొన్నారు.

డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తాం
డీఎన్‌ఏ టెస్టు కోసం మృతదేహాల నుంచి నమూనాలు సేకరించామని, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు గాంధీ ఆస్ప త్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు.

‘నిప్పు’ను తప్పించుకుందామని వస్తే..

  • గతంలో రాణిగంజ్‌లో కొనసాగిన యూనిట్లు 
  • అగ్ని ప్రమాదాల కారణంగానే బోయగూడకు తరలించిన బ్రిటీషర్లు
  • ఇక్కడా అడపాదడపా ప్రమాదాలు 

న్యూ బోయగూడలో ఉన్న టింబర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా అతి పురాతనమైనది. గతంలో రాణిగంజ్‌ ప్రాంతంలో కొనసాగిన ఈ యూనిట్లను బ్రిటీషు ప్రభుత్వ హయాంలో బోయిగూడకు తరలించారు. కారణం రాణిగంజ్‌లోనూ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడమేనని వ్యాపారులు చెబుతున్నారు. 1974నుంచి బోయగూడలో టింబర్‌ బిజినెస్‌ నిర్వహిస్తున్న ఓ వ్యాపారి బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ‘దేశంలో టింబర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాల్లో న్యూ బోయగూడలో ఉన్నది అతి పురాతనమైనది. కొన్ని దశాబ్దాల నుంచి నగరంలో ఈ మార్కెట్‌ కొనసాగుతోంది. కొన్నేళ్ల కిందటివరకు చెక్క, కలపకు మాత్రమే పరిమితమైన యూనిట్లు ప్రస్తుతం ఫ్లైవుడ్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి.

ఈ ఇండస్ట్రియల్‌ ఏరియా తొలినాళ్లలో రాణిగంజ్‌లోని రైల్వే బ్రిడ్జ్‌ పక్కన ఉండేది. ఆ రోజుల్లో బొగ్గుతో నడిచే స్టీమ్‌ ఇంజిన్‌ రైళ్లే ఉండేవి. సికింద్రాబాద్‌ స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు ఈ రైళ్లు కొద్దిసేపు రాణిగంజ్‌ ప్రాంతంలో ఆగేవి. ఆ సమయంలో ఇంజిన్‌లో బొగ్గు నింపుతుండగా పెద్దపెద్ద నిప్పురవ్వలు ఎగిరి బయట పడుతుండేవి. అవి సమీపంలోని టింబర్‌ యూనిట్లపై పడటంతో తరచూ అగ్ని ప్రమాదాలు జరిగి కలప, చెక్క బుగ్గైపోయేది. దీంతో నష్టపోయిన అనేక మంది వ్యాపారులు రోడ్లపై పడ్డారు. ఈ అంశాలను వివరిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలు చూపాల్సిందిగా బ్రిటీషు వారికి ఇండస్ట్రియల్‌ ఏరియా ప్రతినిధులు మొరపెట్టుకున్నారు.

దీంతో స్పందించిన బ్రిటీషు పాలకులు ఈ బోయిగూడ ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అప్పట్లో ముషీరాబాద్‌లో ఉన్న సెంట్రల్‌ జైల్‌ నిర్వాహకులకు లేఖ రాసి, ఈ ప్రాంతాలన్ని టింబర్‌ ఇండస్ట్రీలకు కేటాయించారు. అప్పుడు దాదాపు 50 యూనిట్లు ఇక్కడ పని చేసేవి. కాలానుగుణంగా కార్మికుల లేమి, విద్యుత్‌ తదితర సమస్యల కారణంగా చాలా మూతపడ్డాయి. ప్రస్తుతం 15 యూనిట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనూ అప్పుడప్పుడు అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. టింబర్‌ యూనిట్లు, డిపోలకు తోడు స్క్రాప్‌ గోదాములు వచ్చి చేరడమే ప్రమాదాలకు ప్రధాన కారణం. బుధవారం అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతానికి సమీపంలోనే పదేళ్ల క్రితం ఓ భారీ ఉదంతం చోటు చేసుకుని ఇద్దరు మరణించారు. ఆ తర్వాత ప్రమాదాలు జరిగినా, ప్రాణనష్టాలు లేవు’అని ‘సాక్షి’కి చెప్పారు.

11 గంటలకు పడుకున్నాం: ప్రేమ్‌ 
ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రేమ్‌ (22) ‘సాక్షి’తో మాట్లాడారు. ‘మిగిలిన వాళ్లతో కలిసి నేను మంగళవారం రాత్రి 11 గంటలకు నిద్రకు ఉపక్రమించా. ఉన్నట్టుండి శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిగా ఉండటంతో మెలకువ వచ్చింది. అప్పటికే దట్టమైన పొగతో మంటలు చుట్టుముట్టాయి. అంతా వెనుక వైపు ఉన్న వంట గదిలోకి వెళ్లగా, నేను మాత్రం పక్కనే ఉన్న కిటికీ నుంచి కిందికి దూకడంతో ప్రాణాలు దక్కాయి’ అని రోదిస్తూ చెప్పారు. పదిశాతం కాలిన గాయాలతో ఉన్న ప్రేమ్‌ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.   

టెక్నాలజీతో కంట్రోల్‌ చేద్దాం
సికింద్రాబాద్‌ అగ్నిప్రమాద ఘటనలో ప్రమాదం జరిగిన ఫ్లోర్‌లోకి వెళ్లడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి రెండు గంటలు పట్టింది. బిల్డింగ్‌లోకి వెళ్లేందుకు ఉన్న స్పైరల్‌ స్టెయిర్‌ కేస్‌ (మెట్లు) వేడెక్కిపోవడంతో ఇబ్బందిపడాల్సి వచ్చింది. వేకువజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో మంటలంటుకోగా ఉదయం 8 గంటలకు 8 ఫైరింజన్లు కష్టపడి మంటలార్పాయి. అయితే అగ్ని ప్రమాదాల్లో మంటలను త్వరగా ఆపేందుకు మన దేశంలో అత్యాధునిక పరికరాలేమున్నాయి, ఎలాంటి టెక్నాలజీని వాడి మంటలను అదుపు చేస్తున్నారు, ప్రాణాలను ఎలా కాపాడుతున్నారు?

రిమోట్‌ కంట్రోల్డ్‌ ఫైర్‌ ఫైటింగ్‌ మెషీన్‌
ప్రస్తుతం ఢిల్లీ అగ్నిమాపక శాఖ దగ్గర ఉంది. తీవ్రమైన వేడి ఉన్నప్పుడు, ప్రమాద స్థలంలోకి వెళ్లే పరిస్థితి లేనప్పుడు రిమోట్‌ ద్వారా కంట్రోల్‌ చేసే మెషీన్లను సులువుగా వాడొచ్చు. 140 హార్స్‌ పవర్‌తో పని చేసే డీజిల్‌ ఇంజిన్‌ ఇందులో ఉంటుంది. నిమిషానికి దాదాపు 2,400 లీటర్ల నీటిని ఇది పంప్‌ చేస్తుంది. పైగా ఇందులోని ఆటోమైజ్డ్‌ వాటర్‌ జెట్‌.. నీటిని కోట్లాది చిన్న చిన్న నీటి బిందువులుగా మార్చేస్తుంది. అవసరమైన ప్రదేశాల్లో నురగను కూడా ఉత్పత్తి చేసి పంప్‌ చేస్తుంది. 

టర్న్‌ టేబుల్‌ ల్యాడర్‌
పెద్ద పెద్ద బిల్డింగుల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాడటానికి టర్న్‌ టేబుల్‌ ల్యాడర్‌ను వాడుతున్నారు. దీని ద్వారా దాదాపు 32 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి మంటలు ఆర్పవచ్చు. నిచ్చెనను జాగ్రత్తగా ఆపరేట్‌ చేయడానికి కంప్యూటర్‌ మానిటరింగ్‌ ఉంది. డిస్‌ప్లే ఇండికేషన్లు కూడా ఉన్నాయి.

మోటార్‌ సైకిళ్లకు మిస్ట్‌ సిస్టమ్‌
ఈ తరహా సిస్టమ్‌ను మోటార్‌ సైకిళ్లకు బిగిస్తారు. ఇది దాదాపు 40 మైక్రాన్ల స్థాయిలో నీటి అణువులను వెదజల్లుతుంది. చిన్నస్థాయి, ఎలక్ట్రిక్‌ మంటలను ఆర్పేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇరుకుగా ఉండే ప్రాంతాల్లో బాగా పని చేస్తుంది. అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడానికి ముందు మంటల తీవ్రతను ఇది తగ్గించగలుగుతుంది.

హై ప్రెజర్‌ హోస్‌ రీల్‌ సిస్టమ్‌
నీటిని సమర్థంగా వాడి మంటలార్పడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా అత్యధిక ఒత్తిడితో నీటిని, ఇతర మంటలార్పే పదార్థాలు, ద్రావణాలను చల్లుతారు.  

విదేశాల్లో కొత్త టెక్నాలజీలు ఏమొచ్చాయి

డ్రోన్లతో...
అగ్ని ప్రమాదాల్లో మంటలార్పేందుకు చైనాలో డ్రోన్లను వాడుతున్నారు. ఎంత ఎత్తుకైనా, ఎక్కడికైనా చాలా సులువుగా డ్రోన్లు వెళ్లిపోగలవు. కచ్చితత్వంలో మంటలను ఆర్పగలవు. ఆ మధ్య చైనాలోని చాంగ్‌క్వింగ్‌లో డ్రోన్లతో మంటలార్పే డ్రిల్‌ను కూడా నిర్వహించారు.

షాట్‌గన్స్‌
మంటలార్పే ఇంపల్స్‌ ఫైర్‌ ఎక్స్‌టింగ్విషింగ్‌ సిస్టమ్‌ షాట్‌ గన్స్‌లో తక్కువ స్థాయిలో నీటిని వాడతారు. అయితే అత్యధిక వేగంతో మంటలపై దీన్ని ప్రయోగిస్తారు. వీటిలోంచి వచ్చే నీటి బిందువులు సెకనుకు 120 మీ. వేగంతో వెళ్లి పరిసరాలను చల్లబరుస్తాయి. దీంతో మంటలు ఆరిపోతాయి.

రోబోటిక్‌ ఫైర్‌ ఫైటర్స్‌
చూడటానికి అచ్చం యుద్ధ ట్యాంకులా ఉంటుంది. ఇది నిమిషానికి 2 వేల నుంచి 20 వేల లీటర్ల నీటిని చల్లుతుంది. దీంట్లో కెమెరాలు, వేడిని గుర్తించే సెన్సార్లు కూడా ఉన్నాయి. వీటి ద్వారా రోబోలు ఉన్న ప్రాంతాల్లో పరిస్థితిని దూరం నుంచే అగ్నిమాపక సిబ్బంది ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంటారు.     –సాక్షి, సెంట్రల్‌డెస్క్‌ 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: వారిని రప్పించండి లేదా కేసు కొట్టేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement