
అగ్గి.. బుగ్గి
= టింబర్ డిపోలో భారీ అగ్నిప్రమాదం
= తెల్లవారుజామున ఘటన
= లక్షలాదిరూపాయల టేకు కలప బూడిద
= వాచ్‌మన్ కుటుంబానికి తప్పిన ప్రమాదం
= భారీగా ట్రాఫిక్ జామ్
భోలక్‌పూర్,ముషీరాబాద్,న్యూస్‌లైన్: చిన్న అగ్గిరవ్వ...భారీ ప్రమాదం తెచ్చిపెట్టింది.. క్షణాల్లో మంటలు వ్యాపించి లక్షలాదిరూపాయలు ఆస్తినష్టం వాటిల్లింది.. భారీగా మంచుకురుస్తున్నా మంటలు అదుపుగాక చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు వ్యాపించడంతో వాటిల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది చేరుకొని సుమారు 12గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు అగ్నికీలలను అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..ముషీరాబాద్ ప్రధానమార్గం కేర్ ఆస్పత్రి పక్కవీధిలో ఈశ్వరయ్యకి చెందిన స్థలంలో లక్ష్మణ్ 14ఏళ్ల క్రితం టింబర్ డిపో కోసం స్థలాన్ని లీజుకు తీసుకొని మారుతీ టింబర్‌డిపో పేరుతో కలప వ్యాపారం చేస్తున్నారు. ఇందులో హనుమంతు,రేణుక దంపతులు వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఆరుగులు పిల్లలున్నారు. వీరంతా డిపోలో ఓ మూలన ఉన్న గదిలో ఉంటుంటారు. సోమవారం తెల్లవారుజామున 3:30 నుంచి 4గంటల మధ్యలో అనుమానాస్పదరీతిలో అగ్గి రాజుకొని క్రమంగా మంటలు వ్యాపించాయి. పక్క అపార్ట్‌మెంట్‌వాసులు దీన్ని గమనించి గట్టిగా కేకలు పెట్టడంతో వాచ్‌మన్ హనుమంతు నిద్రలేచి గదిలో నిద్రిస్తున్న భార్య, పిల్లలను బయటకు తీసుకొచ్చాడు.
ఈలోపు మంటలు ఉవ్వెత్తున ఎగిసిపక్కనున్న రెండుభవనాలకు అంటుకున్నాయి. అసలే టేకుకర్రలు కావడంతో మంటలు భారీగా విస్తరించడంతో చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నవారు భయంతో బయటకు పరుగులుతీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు యత్నించినా అదుపులోకి రాకపోవడంతో 9 ఫైరింజన్లను రప్పించి సుమారు 12 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో లక్షలరూపాయల విలువైన టేకుకర్రలు దగ్ధమవ్వడంతోపాటు పక్క అపార్ట్‌మెంట్ పైపులు ఖాళీపోయాయి.
వీధిన పడిన వాచ్‌మన్ కుటుంబం: ఈ అగ్నిప్రమాదంలో వాచ్‌మన్ కుటుంబసభ్యులు ఎలాగోలా బతికి బయటపడగా..గదిలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఆధార్‌కార్డులు, పిల్లల పుస్తకాలు, బట్టలు, రూ.5 వేల నగదు ఖాళీపోయాయని వాచ్‌మన్ భార్య రేణుక కన్నీరుమున్నీరయ్యింది.
సందర్శించిన నేతలు,అధికారులు: అగ్నిప్రమాదం విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నేతలు, అధికారులు హుటాహుటిన తరలివచ్చారు. ప్రమాదం గురించి ఆరాతీశారు. ఎంపీ అంజన్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే మణెమ్మ తనయుడు శ్రీనివాస్‌రెడ్డి, కార్పొరేటర్లు వాజిద్‌హుస్సేన్,ప్రభాకర్‌రెడ్డి, గ్రేటర్ కమిషనర్ సోమేశ్‌కుమార్, జోనల్ కమిషనర్ శివపార్వతి తదితరులు చేరుకున్నారు. మారుతీ టింబర్‌డిపోకు ఎలాంటి అనుమతి లేకుంటే తప్పక యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ సోమేశ్‌కుమార్ స్పష్టంచేశారు.
స్తంభించిన ట్రాఫిక్ : ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రధానరోడ్డు కావడంతో ముషీరాబాద్-సికింద్రాబాద్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు మెల్లగా వెళ్లడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు.