కుషాయిగూడ (హైదరాబాద్): ఆదివారం తెల్లవారుజాము 3 గంటల సమయం. కుషాయిగూడ, సాయినగర్ కాలనీలో ఉన్న ఓ టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే తీవ్రమైన మంటలు పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి అంటుకుని వ్యాపించాయి. అందులో ఆరు కుటుంబాలు నివసిస్తుండగా, అందరూ ఏదో విధంగా ప్రాణాలతో బయటపడినా ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మాత్రం అగ్నికీలల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మరో ఐదుగురు గాయపడ్డారు. కుషాయిగూడ పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
అంతా గాఢ నిద్రలో ఉండగా..
సాయినగర్ కాలనీ ప్రధానరోడ్డు మార్గంలో ఉదయ్‌శంకర్, శివసాయి అనే అన్నదమ్ములు శ్రీ ఆదిత్యసాయి ఎంటర్‌ప్రైజెస్ పేరుతో గత 25 సంవత్సరాలుగా టింబర్ డిపో నడుపుతున్నారు. ఏ జరిగిందో తెలియదు కానీ తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో అందులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న భవనానికి అంటుకున్నాయి. అదే సమయంలో బాత్‌రూంకు వెళ్లేందుకు నిద్రలేచిన వాచ్‌మెన్ కుమార్తె ఉమ మంటలను గమనించి కేకలు పెడుతూ తల్లిదండ్రులను లేపింది. వారు వెంటనే మూడో అంతస్తులో ఉండే యజమాని రాంచందర్‌షాకు సమాచారం ఇవ్వడంతో పాటు భవనంలో ఉన్న వారిని అప్రమత్తం చేశారు. అప్పటికే భవనమంతా దట్టమైన పొగలతో నిండిపోయి మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.
కింద దుకాణాలు, పైన పోర్షన్లు
మూడంతస్తుల భవనంలో కింద వాణిజ్య దుకాణాలు ఉండగా, పైన యజమాని నివాసంతో పాటు ఆరు పోర్షన్లు ఉన్నాయి. వాచ్‌మెన్ అరుపులతో నిద్రలోంచి మేల్కొన్న వారు దిక్కుతోచని స్థితిలో ఆర్తనాదాలు చేస్తూ భవనం నుంచి బయట పడేందుకు ప్రయత్నించారు. కొంతమంది భవనంపైకి వెళ్లి పక్క భవనంపై నుంచి సురక్షితంగా బయట పడగా, మరికొందరు మంటల్లోంచే బయటకు వచ్చి గాయాలపాలయ్యారు. అయితే రెండో అంతస్తులోని సింగిల్ గదిలో ఉంటున్న సూర్యాపేట జిల్లాకు చెందిన రెపినేని నరేష్ (37), అతని భార్య సుమ (28) కొంచెం ఆలస్యంగా నిద్రలేచారు. అప్పటికే బయటంతా మంటలు, పొగ తీవ్రరూపం దాల్చాయి.
సింగిల్ రూం కావడంతో వారికి మరో మార్గం లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో కుమారుడు జశ్వంత్ (5)ను తీసుకుని మంటల్లోంచే గది నుంచి బయటకు వచ్చేందుకు ప్రయతి్నంచి..మొదటి అంతస్తు మెట్ల వద్ద పడిపోయి సజీవ దహనమయ్యారు. నరేష్ దంపతుల పెద్ద కుమారుడు అది్వక్ శనివారం రాత్రి అక్కడికి సమీపంలోనే ఉన్న సుభాష్ చంద్రనగర్‌లోని బంధువుల ఇంటికి వెళ్లడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక రెండో అంతస్తులో ఉన్న నారాయణ, ఉమ దంపతులు బయటకు వచ్చే క్రమంలో మంటల సెగ తాకి గాయపడ్డారు.
పద్మావతి అనే మహిళ రెండో అంతస్తు నుంచి చీర సాయంతో దిగుతుండగా మంటల వేడికి చీర తెగడంతో కింద పడిపోయి గాయపడింది. ఆమె భర్త పూర్ణచందర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా వాచ్‌మెన్ వీరమల్లేష్ ఇంట్లో ఉన్న సిలిండర్ పేలుతుందోమోనన్న భయంతో లోపలికి వెళ్లి దాన్ని తీసుకువచ్చే క్రమంలో స్వల్పంగా గాయపడ్డాడు. మంటలు క్షణాల్లోనే మంటలు భవనాన్ని చుట్టుముట్టాయని వాచ్‌మెన్ కూతురు ఉమ చెప్పింది.
ఆరు గంటలు శ్రమించాం: ఫైర్ ఆఫీసర్ శేఖర్‌రెడ్డి
‘అగ్ని ప్రమాదం గురించి 4 గంటలకు మాకు సమాచారం అందింది. పది నిమిషాల వ్యవధిలోనే ఘటన స్థలానికి చేరుకున్నాం. అప్పటికే మంటలు, దట్టమైన పొగ కారణంగా బిల్డింగ్‌లోకి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. సుమారు ఆరు గంటల పాటు శ్రమించి లోనికి ప్రవేశించాం. ఓ కుటుంబం మిస్ అయ్యిందని చెప్పడంతో గాలించగా మొదటి అంతస్తు కారిడార్‌పై ఓ శవం, మెట్లపై రెండు శవాలను గుర్తించాం..’అని చర్లపల్లి అగ్ని మాపక అధికారి శేఖర్‌రెడ్డి తెలిపారు.
కాగా సాయినగర్ కాలనీలో చేపట్టిన బాక్స్ డ్రైన్ పనుల కోసం రోడ్డును తవ్వేయడంతో ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి దగ్గరగా చేరుకోలేక పోయాయని స్థానికులు చెప్పారు. ఇలావుండగా అగిప్రమాదాలకు సంబంధించిన ఎలాంటి భద్రతా వ్యవస్థ లేకుండా టింబర్ డిపో నిర్వహిస్తున్న శ్రీ ఆదిత్య సాయి ఎంటర్‌ప్రైజెస్ యజమాని నూతలపాటి శివసాయిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ వెంకట్‌రెడ్డి తెలిపారు. నరేష్, సుమ, జశ్వంత్‌ల మృతదేహాలకు గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలానికి తరలించారు. ఈ సందర్భంగా మార్చురీ వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి.
పేలిన రెండు సిలిండర్లు..
మంటలు భారీఎత్తున ఎగసి పడటానికి భవనం కింద ఉన్న ఆటోమొబైల్ షాప్ గోదామే ప్రధాన కారణమనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. గోదాంలోని టైర్లు, ఆయిల్ డబ్బాలతో పాటుగా ఇతర సామగ్రికి నిప్పు అంటుకోవడం వల్లే ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అంటున్నారు. ప్రమాదం జరిగిన టింబర్ డిపోలో 8 గ్యాస్ సిలిండర్లు ఉండగా వీటిల్లో రెండు పేలిపోయాయి. టింబర్ డిపోలో అన్ని గ్యాస్ సిలిండర్లు ఎందుకున్నాయో తెలియరాలేదు. అలాగే అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటన్నది కూడా తెలియరాలేదు.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: హోంమంత్రి
హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, కార్మి క శాఖ మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదంలో ముగ్గురు చనిపోవడంపై హోం మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మృతుల కుటుంబాలను, గాయపడ్డ వారిని ఆదుకుంటామన్నారు.
గాంధీ మార్చురీ వద్ద మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో తానిక్కడికి వచ్చానని, తల్లిదండ్రుల మృతితో అనాథగా మిగిలిన అద్విక్ బాధ్యతలు పూర్తిగా ప్రభుత్వమే చూస్తుందని మల్లారెడ్డి చెప్పారు. కాగా బాధిత కుటుంబానికి జీహెచ్‌ఎంసీ తరఫున రూ.2 లక్షల చొప్పున రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియాను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment