చింతకానిలో మెగా హరితహారం కార్యక్రమంలో మొక్క నాటుతున్న జెడ్పీ చైర్మన్ కమల్‌రాజ్
సాక్షి, ఖమ్మం : జిల్లాలోని 21 మండలాల పరిధిలో 2019–20 సంవత్సరానికి సంబంధించి 3.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని శాఖలవారీగా విభజించిన అధికారులు ఆయా శాఖలోని పరిస్థితులనుబట్టి కొంత లక్ష్యాన్ని నిర్ణయించారు. అటవీ, పోలీస్ శాఖతో కలిపి కోటి మొక్కలు నాటాలని నిర్ణయించారు. అలాగే డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కోటి, సింగరేణి ఆధ్వర్యంలో 25వేలు, ఐటీసీ బీపీఎల్ ఆధ్వర్యంలో 50 వేలు, వ్యవసాయ శాఖ 15వేలు, ఎక్సైజ్ శాఖ 1000, మున్సిపాలిటీ, అర్బన్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో 28,600, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 10వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు.
వర్షాల ఆలస్యంతో..
సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షాలు ప్రారంభమైన వెంటనే హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వర్షాలతో భూమి మెత్తబడడం.. మొక్కలు నాటేందుకు అనువుగా ఉండడంతో ఈ కార్యక్రమానికి పూనుకుం టారు. వర్షాకాలం పూర్తయ్యే సమయానికి లక్ష్యం మేరకు మొక్కలు నాటడాన్ని పూర్తి చేస్తారు. అయితే ఈ ఏడాది అటువంటి పరిస్థితులు లేవు. సాధారణంగా జూలై మొదటి వారంలో వర్షాలు కురవడంతో అదే సమయంలో హరితహారం ప్రారంభమవుతుంది. ఈ ఏడాది ఆగస్టు వరకు వర్షాలు కురవలేదు. దీంతో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం సాధ్యం కాలేదు. ఇటీవల తుపాను, రుతుపవనాల ప్రభావంతో వరుసగా వర్షాలు కురుస్తుండడంతో ఇప్పుడే హరితహారం ప్రారంభించారు. హరితహారంలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని సూచించారు. ఈ మేరకు ప్రస్తుతం అధికారులు మొక్కలు నాటే పనిలో నిమగ్నమయ్యారు.
నాటింది 1.32 కోట్ల మొక్కలే..
హరితహారంలో భాగంగా ఇప్పటివరకు 1.32 కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. మొత్తం 3.29 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా.. ఆ దిశగా మొక్కలు నాటే ప్రక్రియ సాగడం లేదు. ఇటీవల కాలంలోనే మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభం కావడంతో ఇంకా ఊపందుకోలేదు. హరితహారంలో భాగంగా మొక్కలను పాఠశాలలు, ఇళ్ల ఆవరణ, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ స్థలాలు, డివైడర్ల మధ్యలో.. ఆర్‌అండ్‌బీ రహదారుల వెంట, అటవీ ప్రాంతాలు, ఖాళీ స్థలాల్లో నాటాలని నిర్ణయించారు. మొక్కలు నాటడమే కాకుండా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో మొక్కలు చనిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఏదైనా కారణంతో మొక్క చనిపోతే దాని స్థానం లో మరో మొక్కను నాటేలా చర్యలు చేపట్టారు. అయితే లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత పెంచేందుకు అధికారులు మెగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం ఒక్కో మండలంలో 5లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ క్రమంలో 15 మండలాల పరిధిలో సుమారు 50 లక్షల మొక్కలు నాటినట్లు తెలుస్తోంది. కాగా.. జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు మెగా హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
మొక్క నాటని వ్యవసాయ శాఖ
జిల్లాలోని వివిధ శాఖలు తమకు కేటాయించిన విధంగా మొక్కలు నాటుతూ వస్తుండగా.. వ్యవసాయ శాఖ మాత్రం ఈ ఏడాది ఒక్క మొక్క కూడా నాటని పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో రైతులతో అనుసంధానంగా ఉండే వ్యవసాయ శాఖ మొక్కలను నాటకపోవడంతో పలువురు ఆశ్చర్యపోతున్నారు.
కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ అధికారులతో సమావేశాలు నిర్వహించి.. హరితహారం కార్యక్రమం జిల్లాలో ఆలస్యంగా ప్రారంభం కావడంతో నత్తనడకన సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వివిధ ప్రభుత్వ శాఖలకు కేటాయించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు అధికారులు కృషి చేసున్నా.. వర్షాలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో మెగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. మంగళవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మొక్కలు నాటడంతో అడుగులు లక్ష్యం దిశగా పడుతున్నట్లు తెలుస్తోంది.
– ఖమ్మం, సహకారనగర్
Comments
Please login to add a commentAdd a comment