హైదరాబాద్ : ఇకపై ఇల్లు కట్టుకోవాలంటే 10 మొక్కలైనా నాటాల్సిందేనని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అన్నారు. అలా అయితేనే భవన నిర్మాణాలకు అనుమతి ఇస్తామని చెప్పాలన్నారు. సోమవారం బీహెచ్‌ఈఎల్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రభుత్వ బాధ్యత కాదని, హరితహారం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు.
ప్రతి ఇంటిలో మొక్కలు నాటడంతోపాటు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. నాటిన మొక్కలన్నింటిపై ఆరు నెలల్లో సర్వే చేయిస్తామని, మొక్కలు ఎండిపోతే అధికారులపై చర్యలు ఉంటాయన్నారు. స్వయంగా తానే మొక్కలను పరిశీలిస్తానని స్పష్టం చేశారు. ఇకపై పూల బొకేలు ఇవ్వడం మానాలని, చెట్లతో స్వాగతం పలకాలని గవర్నర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు పాల్గొన్నారు.