
సమావేశంలో పాల్గొన్న అధికారులు
నిర్మల్‌టౌన్ : తెలంగాణకు హరితహారంలో భాగంగా ఈ ఏడాది జిల్లాలో కోటి రెండు లక్షల మొక్కలు నాటేందుకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో మంగళవారం సా యంత్రం జిల్లా అధికారులతో హరితహారంపై ఆమె సమీక్షించారు. ఆమె మాట్లాడుతూ.. వారం రోజుల్లోగా ప్రణాళికలు అందజేయాలన్నారు. 2018లో ప్రతీ శాఖకు సంబంధించి లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు. తమకు కేటాయించిన లక్ష్యం మేరకు ప్రతీ శాఖ వందశాతం ప్రగతి సాధించాలన్నారు. మొక్కలు నాటడంపై ప్రణాళికలు తయారుచేసి, వివరాలు నిర్ణీ త నమూనాలో వారం రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలన్నారు. జిల్లాలోని అన్ని వసతి గృహాలు, పాఠశాలల్లో కరివేపాకు, నిమ్మ, మునగ, బొప్పాయి, ఉసిరి, జామ తదితర మొక్కలు నాటాలన్నారు.
రైతుల పొలాలు, పొలం గట్లపై, ఇళ్ల ఆవరణలో మొక్కలు నాటేలా ప్రోత్సహించాలన్నారు. నీటి పారుదల, పంచాయతీ, రహదారులు, శ్మశాన వాటికలు, దేవాలయాలు, పోలీస్‌స్టేషన్, పారిశ్రామిక వాడలు, పరిశ్రమలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. డ్వామాకు 50లక్షలు, ఐకేపీకి 12లక్షలు, రెవెన్యూ శాఖకు 50వేలు, పంచాయతీరాజ్‌కు 3లక్షలు, అటవీశాఖకు 22లక్షలు, హార్టికల్చర్‌కు 5లక్షలు, అబ్కారీశాఖకు 1.50లక్షలు, ఇరిగేషన్‌కు 2లక్షలు, పోలీసు శాఖకు 2లక్షలు, ఆర్‌అండ్‌బీకి 50వేలు, విద్యాశాఖకు 20వేలు, నిర్మల్ మున్సిపాలిటీకి 1.5లక్షలు, భైంసా మున్సిపాలిటీకి లక్ష, పశుసంవర్ధక శాఖకు 70వేలు, ఐసీడీఎస్, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, మార్కెటింగ్, డీసీవో, విద్యుత్ తదితర శాఖలకు 2వేల నుంచి 5వేల చొప్పున మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ణయించినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులను ప్రోత్సహించి పొలంగట్లపై టేకు మొక్కలు నాటేలా, అలాగే అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కలు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జేసీ శివలింగయ్య, డీఎఫ్‌వో దామోదర్‌రెడ్డి, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో ప్రసూనాంబా, అన్ని శాఖల జిల్లా అధికారులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment