మన సార్లు.. ‘నర్సరీ’ తప్పారు | Cm kcr doing plantation | Sakshi
Sakshi News home page

మన సార్లు.. ‘నర్సరీ’ తప్పారు

Published Sun, Jul 5 2015 12:55 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

మన సార్లు.. ‘నర్సరీ’ తప్పారు - Sakshi

మన సార్లు.. ‘నర్సరీ’ తప్పారు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : ఆరు నెలలు కుస్తీ పట్టారు. రూ.27 కోట్లు వెచ్చించారు. 450 నర్సరీలలో 3.52 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లు.. భేటీలు.. సమీక్షలంటూ నానా హడావుడి చేశారు. తీరా అవసరానికో మొక్క దొరకలేదు. నాగపూర్ నర్సరీల నుంచి రాత్రికి రాత్రి మొక్కలు తెప్పించి మఖ్యమంత్రి, మంత్రుల చేత నాటించి ‘కార్యం’ గట్టెక్కించారు. కోట్లు ఖర్చు చేసినా.. సీఎం ఇష్టంగా నాటేలా మన నర్సరీలలో ఒక్క మొక్కనూ పెంచలేని అధికారుల తీరు హరితహారం భవితవ్యాన్ని సందిగ్ధంలో పడేసింది.  

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకానికి అప్పుడే ‘నిర్లక్ష్య’పు తెగులు పట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని సవాల్‌గా భావిస్తుంటే, జిల్లా యంత్రాంగం దాన్ని ‘లైట్’గా తీసుకుంటోంది. 450 నర్సరీల్లో 3.52 కోట్ల మొక్కలను నాటడానికి సిద్ధంగా ఉంచామని జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ప్రకటించారు. ప్రతి నర్సరీలో 20-30 జాతుల మొక్కలు ఉన్నాయని, ప్రజలు తమకు కావాల్సినవి తీసుకుని నాటుకోవాలని సామాజిక వనాల డీఎఫ్‌వో సుధాకర్‌రెడ్డి వంతపాడారు.

 ఇదీ జరిగింది..
 శనివారం జిల్లాలో జరిగిన హరితహారంలో సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని మిట్టపల్లి రెసిడెన్సియల్ స్కూల్, ఎంపీడీవో కార్యాలయం, 1500 రోజుల దీక్షా ప్రాంగణం, వైశ్య భవన్, నంగనూరు మండలం ముండ్రాయి, పాలమాకుల, రాజగోపాల్‌పేట ప్రాంతాల్లో 7 మొక్కలు నాటారు. అవన్నీ ఒకే రకం మొక్కలు. దాదాపు పది అడుగుల పొడవున్న ఇవి చూడ్డానికి ఆకర్షణీయంగా, బలిష్టంగా కనిపించాయి. శుక్రవారం మెదక్ నియోజకవర్గంలోని చిన్నశంకరంపేటలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సైతం ఇవే రకం మొక్కలు నాటారు.

హరితహారం నర్సరీలకు టెండర్లు పిలిచిన నాటి నుంచి సీఎం కేసీఆర్ మొక్కలు నాటి నీరు పోసిన నేటి (శనివారం) వరకు ‘సాక్షి’ నెట్‌వర్క్ జిల్లా వ్యాప్తంగా వివిధ నర్సరీల్లో కలియ తిరిగింది. మొక్కల పెరుగుదల సమాచారం సేకరించి ఎప్పటికప్పుడు కథనాలు ప్రచురించింది. ఏ నర్సరీలలోనూ ఇంత పెద్ద మొక్కలు కనిపించలేదు. కానీ రాత్రికి రాత్రే పెరిగి సీఎం, మంత్రుల కార్యక్రమంలో హల్‌చల్ చేసిన వీటి గురించి ఆరా తీయగా అసలు నిజం బయటికి వచ్చింది.

 నాగపూర్ నర్సరీల నుంచి..
 శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన 7 మొక్కలు, శుక్రవారం హరీష్‌రావు నాటినవి ‘తబూబియా’ జాతి మొక్కలు. వీటిని మహారాష్ట్రలోని నాగపూర్ ప్రైవేటు నర్సరీల నుంచి తెప్పించారు. ఒక్కటీ రూ.370 చొప్పున 3 వేల మొక్కలను తెప్పించినట్టు తెలిసింది. వీటికి రవాణా ఖర్చులు అదనం. దేశంలోనే మూడో పెద్ద పథకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారంతో వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలో ఊళ్లకు ఊళ్లను ఆకుపచ్చని వనాలుగా మార్చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఆయన ఆకాంక్షకు తగ్గట్టు మన అధికారులు నర్సరీల్లో మొక్కలను పెంచలేకపోయారు. మే చివరి వారం వరకు జిల్లాలోని నర్సరీలను ఏ అధికారీ పట్టించుకోలేదు. వీటి స్థితిగతులను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చాకే కదిలారు. అప్పటికే సమయం మించిపోయింది.

 ఎందుకిలా చేశారు...
 జిల్లా అధికారులు 3.52 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నట్టు ముందు నుంచీ చెబుతున్నా.. వాస్తవంగా అందులో 60 శాతం కూడా రెడీగా లేవు. వృక్ష శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం- ఒక మొక్కను వేరేచోట నాటినప్పుడు, కొత్త వాతావారణ పరిస్థితుల్లో ఇమడాలంటే పూర్తి ఆరోగ్యంతో ఆ మొక్క వయసు కనీసం 4 నెలలైనా ఉండాలి. ప్రస్తుతం నర్సరీల్లో పెరిగిన మొక్కలకు ఆ స్థాయి లేదు. అసలవి ఎదుగుతాయో లేదో తెలియని పరిస్థితుల్లో సీఎం, మంత్రులు చేత వీటిని నాటిస్తే తమ పరువు-కొలువులకు ఇబ్బందేనని ముందే పసిగట్టిన అధికారులు నాగపూర్ నర్సరీల నుంచి మొక్కలు తె ప్పించి ‘గట్టె’క్కారని విద్యావంతులు అంటున్నారు. దీనిపై సిద్దిపేట ఆర్డీవో ముత్యంరెడ్డిని వివరణ కోరగా- డీఎఫ్‌వో ఇచ్చిన మొక్కలనే తాము సీఎం చేత నాటించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement