
అంతరిస్తున్న మొక్కలు నాటుతున్నాం
శంషాబాద్ రూరల్: జీవ వైవిద్య పరిరక్షణలో భాగంగా అంతరిస్తున్న, అరుదైన మొక్కల పెంపకం కోసం కృషి చేస్తున్నట్లు మైహోం గ్రూపు ఎండీ జూపల్లి జగపతిరావు అన్నారు. మండలంలోని ముచ్చింతల్‌లో శనివారం మైంహోం గ్రూపు ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. జిల్లా కలెక్టరు రఘునందన్‌రావు, ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జగపతిరావు మాట్లాడుతూ.. ముచ్చింతల్ సమీపంలోనే జీవ వైవిద్య పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇందుకోసం దేశ నలమూలల నుంచి అన్ని రకాల ఔషధ, పండ్లు, పూల మొక్కలను తెప్పిస్తున్నామని చెప్పారు. అంతరించిపోయిన సుమారు 140 రకాల మొక్కల సేకరణకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ పార్కు ఏడాదిన్నరలోపు పూర్తిస్థాయిలో ఏర్పాటు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. తమ వంతుగా లక్ష మొక్కల పెంపకం కోసం చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకోసం సొంతంగా నర్సరీ ఏర్పాటు చేశామన్నారు. నాటిన ప్రతి మొక్క బతికేలా సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని కలెక్టర్ రఘునందన్‌రావు అన్నారు.
మైహోం సంస్థ జీవ వైవిద్య పార్కు ఏర్పాటుకు చొరవ చూపడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇంటికి రెండు మొక్కల చొప్పున నాటుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, ఆర్డీఓ సురేష్ పొద్దార్, సర్పంచులు రాజశేఖర్‌రెడ్డి, లాలీచందర్, ఎంపీటీసీ సభ్యులు మోహన్‌నాయక్, ఎంపీడీఓ శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.