పల్లె మెరవాలె | KCR Special Focus On Telangana Villages Development | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 10 2018 3:49 AM | Last Updated on Wed, Aug 15 2018 9:14 PM

KCR Special Focus On Telangana Villages Development - Sakshi

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు

సాక్షి, హైదరాబాద్‌: పల్లెలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ లను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. స్వచ్ఛమైన పల్లెల కోసం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలని సూచిం చారు. వచ్చే మూడు నెలల్లో గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మొదటి నెల రోజులు గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనులు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకునే క్రమంలో గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి, ముఖ్యంగా పారిశుధ్య సిబ్బందికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు.

వివాహ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంతోపాటు మరికొన్ని బాధ్యతలనూ గ్రామ పంచాయతీలకు అప్పగించాలని చెప్పారు. పంచాయతీలను పచ్చగా, పరిశుభ్రంగా మార్చే కార్యాచరణపై సీఎం కేసీఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి, సీనియర్‌ ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, పీకే ఝా, వికాస్‌రాజ్, నీతూప్రసాద్, స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనిని ఆగస్టు 15న ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నెల రోజులపాటు చేపట్టాల్సిన పనులపై మార్గనిర్దేశనం చేశారు. దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలను, ప్రత్యేకంగా కృష్ణ తులసి మొక్కలను నాటాలని సూచించారు.

గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు సీఎం చేసిన సూచనలివీ..

  1. వదిలేసిన గుంతలు, ఉపయోగించని, పాడుపడిన బావులను పూడ్చేయాలి. కూలిపోయిన ఇళ్లు, భవనాల శిథిలాలను తొలగించాలి
  2. మురికి కాల్వల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తీసి, అన్ని కాల్వలను పరిశుభ్రం చేయాలి. హా గ్రామంలోని అంతర్గత రహదారులపై గుంతలు పూడ్చాలి. గుంతల్లో మొరం పోయాలి. వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా చూడాలి
  3. దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలు, ప్రత్యేకంగా కృష్ణ తులసి మొక్కలు పెంచాలి. పిచ్చిమొక్కలను, సర్కారు తుమ్మలను, జిల్లేడు చెట్లను పూర్తిగా తొలగించాలి 
  4. గ్రామంలో ఉత్పత్తి అయ్యే చెత్త ఎంతో నిర్ధారించాలి. చెత్తను వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. డంప్‌ యార్డు కోసం స్థలం సేకరించాలి
  5. గ్రామానికి ఒక శ్మశాన వాటిక కచ్చితంగా నిర్మించాలి. హా గ్రామాలకు నియమితులైన స్పెషల్‌ ఆఫీసర్లు గ్రామస్తులను చైతన్యపరిచి వారానికోసారి శ్రమదానం చేయించాలి.

పచ్చదనం పెంచేందుకు చేసిన సూచనలివీ..

  1. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి ఒకటి చొప్పు న మొత్తం 12,751 నర్సరీలను ఏర్పాటు చేయాలి
  2. గ్రామంలోని రైతులతో, ఇంటి యజమానులతో మాట్లాడి వారు ఎలాంటి మొక్కలు పెంచుతారో తెలుసుకుని దానికి అనుగుణంగా నర్సరీల్లో మొక్కలు పెంచాలి
  3. దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాని మొక్కలు కూడా ఉన్నాయి. వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అలాంటి మొక్కలను అందుబాటులో ఉంచాలి.
  4. రైతులు పొలం గట్ల మీద, బావుల వద్ద మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించాలి. గ్రామ సమీపంలో ఏవైనా అడవులుంటే వాటిలోనూ మొక్కలు పెంచాలి.
  5. అన్ని విద్యాసంస్థల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఆ సంస్థల ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటే విధంగా కృషి చేయాలి. ఈ విషయంలో జిల్లా విద్యాధికారులకు లేఖలు రాయాలి.

ప్రత్యేకాధికారులు సేకరించాల్సిన వివరాలు

  1. గ్రామ పరిధిలో అన్ని రకాల రోడ్లు కలిపి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి. ప్రస్తుతం అవి ఎలాంటి స్థితిలో ఉన్నాయి?
  2. గ్రామ పరిధిలో మురికి కాల్వల పొడవు ఎంత? అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి?
  3. గ్రామంలో శ్మశాన వాటిక ఉందా? ఉంటే నిర్వహణ సరిగా ఉందా? లేకుంటే స్థలాన్ని సేకరించాలి
  4. గ్రామంలో దోబీఘాట్‌ ఉందా? ఉంటే ఏ పరిస్థితిలో ఉంది. లేకుంటే ఏర్పాటు చేయాలి.
  5. గ్రామంలో విద్యుత్‌ వీధి దీపాల పరిస్థితి ఎలా ఉంది. అన్ని వీధుల్లో స్తంభాలున్నాయా? 
  6. కామన్‌ డంప్‌ యార్డు ఉందా? ఉంటే ఎలా ఉంది? లేకుంటే స్థలం సేకరించాలి.
  7. పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది ఎంత మంది? వారికి జీతాలు ఎలా అందుతున్నాయి? 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement