ఉద్యానంపై ఉక్కు పిడికిలి
ఉద్యానంపై ఉక్కు పిడికిలి
Published Mon, Mar 13 2017 11:45 PM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM
- కడియం నర్సరీకి విద్యుత్తు షాక్
- వైఎస్ ఉచితంగా విద్యుత్తు ఇస్తే బాబు బాదుడే
- సుమారు 60 వేల మంది రైతులు సతమతం
- మోటార్లు బిగిస్తే ఒక్కో మోటారుపై రూ.50 వేలు అదనపు భారం
- నిరసన తెలిపినా అధికార పార్టీ నేతలు నిర్లక్ష్యమే...
సాక్షిప్రతినిధి, కాకినాడ : రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి. అందుకే రైతు పక్షపాతి ఎవరంటే ఎవరి నోటైనా ఠక్కున వచ్చే సమాధానం వైఎస్ రాజశేఖరరెడ్డి అని. ప్రజాప్రస్థానంతో రాష్ట్రమంతా పాదయాత్ర చేసేటప్పుడు ఆ మహానేత రైతుల బాధలను వారి పొలాలకు వెళ్లి నేరుగా చూసి చలించిపోయారు. అందుకే మెట్ట ప్రాంతంలో విద్యుత్‌పై ఆధారపడి వరి పండించే రైతులతోపాటు నర్సరీ రైతులకు కూడా ఉచిత విద్యుత్తు సరఫరా చేశారు. వైఎస్‌కు ముందు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయం దండగన్న చంద్రబాబు గత సార్వత్రిక ఎన్నికల్లో రైతుల పక్షాన ఉంటానని నమ్మబలికి రైతుల ఓట్ల కోసం వారికి రుణమాఫీ ప్రకటించారు. అది అరకొర మాఫీగానే మిగిలిపోయిందిగానీ రైతుల రుణాలన్నీ మొత్తంగాæ మాఫీ చేశానని చెప్పుకుంటున్నారు. రుణమాఫీ విషయాన్ని పక్కనబెడితే జిల్లాలో నర్సరీ రైతుల ఇబ్బందులను గుర్తించి అప్పట్లో వైఎస్ వారికి ఉచిత విద్యుత్తును ప్రకటించి అమలు చేశారు. విద్యుత్తు బకాయిలు చెల్లించనవసరం లేకుండా సడలింపు ఇచ్చారు. విద్యుత్తు చార్జీలు భారంగా మారాయని మొరబెట్టుకున్న నర్సరీ రైతులను మానవతా దృక్పధంతో రాజశేఖరరెడ్డి ఆదుకుంటే, అటువంటి రైతుల నెత్తిపై చంద్రబాబు విద్యుత్తు ఛార్జీల భారం మోపేందుకు ‘సై’ అంటున్నారు. నాటి వైఎస్‌కు నేటి చంద్రబాబుకు ఉన్న తేడా అదేనని రైతుల మధ్య చర్చ నడుస్తోంది.
వై.ఎస్. ఏమీ చేశారు...?
కడియం నర్సరీలకు రాష్ట్రంతోపాటు పలు రాష్ట్ర్రాల్లో మంచి గుర్తింపు ఉంది. కడియం మండలం ఆ మండలాన్ని ఆనుకుని మండపేట రూరల్, ఆలమూరు, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం మండలాల్లో కలిపి పాతిక గ్రామాల్లో సుమారు 15 వేల ఎకరాల్లో నర్సరీలు సాగుచేస్తున్నారు. 15వేల మంది రైతులు నేరుగా నర్సరీలు చేస్తుండగా సుమారు 40వేల మంది ఆ రంగంపై ఆధారపడి పొట్టపోసుకుంటున్నారు. విద్యుత్తు చార్జీల భారంతో నర్సరీ రంగం కుదేలవుతోందని రైతులు అప్పటి రోడ్లు భవనాలశాఖా మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుకు మొరబెట్టుకున్నారు. వైఎస్ సీఎం అయ్యాక 2004లో కాకినాడ వచ్చిన సందర్భంలో నర్సరీ రైతుల ఇబ్బందులను జక్కంపూడి ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన వైఎస్ విద్యుత్ బకాయిలు చెల్లించనవసరం లేదని, విద్యుత్ మీటర్లు బిగించవద్దని ఆదేశాలు జారీచేశారు. అంటే సుమారు 13 ఏళ్లుగా నర్సరీ రైతులు మహానేత వైఎస్ పుణ్యమా అంటూ చార్జీల సడలింపు పొందుతున్నారు. అటువంటి రైతులపై చంద్రబాబు సర్కార్ కత్తికట్టి చార్జీల భారం మోపేందుకు సిద్ధపడుతోంది. ఇందుకు ఏప్రిల్ ఒకటే తేదీని ముహూర్తంగా నిర్ణయించింది.
మోటార్లు బిగించి వసూళ్లకు...
వచ్చే నెల ఒకటి నుంచి నర్సరీల్లోని విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించి ప్రతినెలా బిల్లులు వసూలు చేయనుంది. ఇప్పటి వరకు వ్యవసాయ హోదాలో ఉన్న నర్సరీ రంగాన్ని ఉద్యాన రంగంగా పరిగణిస్తూ చంద్రబాబు సర్కార్ నర్సరీ రైతులపై భారం మోపుతోంది. ఫలితంగా ఈ రంగంపై ఆధారపడ్డ రైతులు ఆందోళన చెందుతున్నారు. వైఎస్ హయాంలో విద్యుత్ మీటర్లు పెడదామని ట్రాన్స్‌కో అధికారుల ప్రతిపాదనను తిరస్కరించి ‘ఆల్ నర్సరీస్ ఆర్ అగ్రికల్చర్ సెక్టార్..’అంటూ అధికారులకు తెగేసి చెప్పారని నాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన నర్సరీ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తాడాల వీరాస్వామి ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి చొరవతో నర్సరీలకు ఉచిత విద్యుత్తును అమలు చేశారన్నారు. రైతులకు తమ ప్రభుత్వం వెన్నంటి నిలుస్తుందంటోన్న చంద్రబాబు 40 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న నర్సరీ రంగంపై విద్యుత్ బిల్లుల భారం వేయడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు.నాడు రాజశేఖర్‌రెడ్డి కల్పించిన బిల్లుల సడలింపు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడని రైతులు ప్రశ్నిస్తున్నారు.
ఒక్కో మోటారుపై ఏడాదికి రూ.50 వేలు పైమాటే..
ఒక్కో మోటారుపై ఏడాదికి రూ. 50 వేలు వరకు విద్యుత్ బిల్లు భారం పడుతుందని అంచనా. అంటే నర్సరీ రైతులపై ఏడాదికి పడే భారం ఆరున్నర కోట్లు పై మాటే. 5 హార్స్‌పవర్ మోటారు ఒక్కో దానిపై ఏడాదికి రూ. 50వేల వరకు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా ఉన్న 5 హెచ్‌పీ మోటారుపై గంటకు 3.75 యూనిట్లు విద్యుత్తు అవసరమవుతుంది. 7 గంటలపాటు సరఫరా చేస్తారని లెక్కేసినా రోజుకు 26.25 యూనిట్లు వంతున నెలకు 787.50 యూనిట్లు వినియోగించాల్సి వస్తుంది. యూనిట్‌కు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.3.70. ఈ లెక్కన నెలకు రూ.2,913.75 విద్యుత్తు ఛార్జీలు చెల్లించాలి. విద్యుత్తు ఛార్జీలకు ఇతర ఛార్జీలు అదనంగా కలిపితే నెలనెలా ఒక మోటారు రూ. 3,500 పైనే బిల్లుల భారం పడనుంది. ప్రస్తుతం నర్సరీల్లో వినియోగిస్తున్న విద్యుత్తు మోటార్లు దాదాపు పాతవే. ఇవి ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తాయి.అంటే ఆ మేరకు భారం మరింత పెరుగుతుందంటున్నారు. నర్సరీల్లో మొక్కలకు నిత్యం నీటి అవసరాలు ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం రాయితీపై సోలార్ పంపుసెట్లు ఇస్తున్నాం వాటిని వినియోగించమని చెబుతోంది. వాతావరణ పరిమితులతోపాటు, సీజన్ల వారీగా చేలలో ప్యాకెట్లను మార్చడం, మబ్బుతో కూడిన వాతావరణం ఉన్న సమయాల్లో నీటిని తోడడంలో తలెత్తే ఇబ్బందులు, సోలార్‌పై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం తదితర కారణాలతో సోలార్ మోటార్లను అమర్చుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. ఈ అననుకూల పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు సర్కార్ నర్సరీ రైతులను నట్టేటా ముంచేసేందుకు సమాయత్తమవుతోందని వాపోతున్నారు.
నిరసనగా మోటారు సైకిల్ ర్యాలీ
చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై ఆందోళనతో ఉన్న నర్సరీ రైతులు రెండు రోజుల కిందట మోటర్‌సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కడియం నర్సరీ రైతు సంఘం అధ్యక్షుడు పుల్లా చంటి, ఇండియన్ నర్సరీ మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్ల సుబ్రహ్మణ్యం తదితర ప్రతినిధులు సుమారు 250 మంది రైతులతో కలిసి రాజమహేంద్రవరంలోని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి ఇంటికి వెళితే గంటన్నర తరువాత కానీ కలవలేకపోయామంటున్నారు. వైఎస్ ఇవ్వగా లేంది ఇప్పుడు ఇవ్వలేరా అని రైతులు ప్రశ్నిస్తే అప్పుడు పక్కాగా ఇచ్చి ఉంటే ఇలా ఉండేది కాదని అయినా అదంతా ఏపీఈఆర్‌సీ పరిధిలో ఉందని, సీఎం వద్దకు వెళదామని ముక్తసరిగా సమాధానం చెప్పారని రైతులు పేర్కొంటున్నారు. రైతుల విషయంలో మహానేత వైఎస్‌కు, ఇప్పటి సీఎం చంద్రబాబుకు ఉన్న తేడా ఇదేనంటున్నారు.
Advertisement
Advertisement