తణుకు: ప్రపంచ పటంలో తణుకు పట్టణానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. తణుకులోని ఆంధ్రాషుగర్స్ వల్ల ఆ గుర్తింపు లభించింది అంటే అతిశయోక్తి కాదు. అయితే భారతీయ అంతరిక్ష పశోధన సంస్థ (ఇస్రో) చేస్తున్న రాకెట్ ప్రయోగాల్లో ఆంధ్రాషుగర్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్రయోగాలకు కావాల్సిన ద్రవరూప ఇంధనాన్ని రూపొందించడంలో ఆంధ్రాషుగర్స్ విజయం సాధించింది.
చదవండి: త్వరలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు రిజిస్ట్రేషన్లు
ఇస్రో-ఆంధ్రాషుగర్స్ సహకారం 1984లో ప్రారంభం కాగా 1985 మార్చిలో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభానికి పైలెట్ ప్రాజెక్టు స్థాపనకు ఇస్రో ఆంధ్రాషుగర్స్ మధ్య ఒప్పందం ఖరారు అయ్యింది. 1988 జులై 24న ప్లాంటును జాతికి అంకితం చేశారు. అతి కీలకమైన అంతరిక్ష పరిశోధన రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారతదేశం సాగిస్తున్న జైత్రయాత్రలో ఇస్రో-ఆంధ్రాసుగర్స్ మధ్య ఏర్పడిన సహకారం ఫలప్రదమైన పాత్ర నిర్వహిస్తోంది.
రాకెట్ ఇంధనం తయారీ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన చిత్రపటంలో భారతదేశానికి సముచిత స్థానం కల్పించడంలో ఆంధ్రాషుగర్స్ ముఖ్య పాత్ర పోషించింది. తణుకు ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన ద్రవరూప ఇంధనం భారత మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞనంతో నిర్మించిన బహుళ ప్రయోజన ఉపగ్రహాలు INSAT-IIA, PSLV- D2, PSLV-D3 లలో వినియోగించారు. ప్రస్తుతం తణుకు పరిశ్రమలో చక్కెర ఉత్పత్తి నిలిచిపోయినప్పటికీ రాకెట్ ఇంధన తయారీతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.
చదవండి: Andhra Pradesh: ‘డిజిటల్ హెల్త్’కు నాంది
Comments
Please login to add a commentAdd a comment