అక్రెడిటేషన్ల జారీలో జర్నలిస్టులకు అన్యాయం
ఐజేయూ, టీయూడబ్ల్యూజే నేతల ఆరోపణ
* అక్రెడిటేషన్ కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీలో రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఇండియన్ జర్నలిస్టు యూనియన్(ఐజేయూ), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి కమిటీ రూపొందించిన అసలు నివేదికలోని కీలకాంశాలను మార్చేసి సీఎం కేసీఆర్‌కు తప్పుడు నివేదిక సమర్పించిందని ఆరోపించాయి.
నివేదికను టైపింగ్ చేసే సమయంలో పలు అంశాలను తారుమారు చేశారని, అసలు నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశాయి. జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డుల జారీ అంశంపై ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్ కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే కార్యదర్శి వి.విరాహత్ అలీ, హెచ్‌జేయూ అధ్యక్షుడు కె.కోటిరెడ్డి గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో అక్రెడిటేషన్ కమిటీ తీరును దుయ్యబట్టారు.
వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలు, పాత జీవోలను కాదని అక్రెడిటేషన్ల కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు జారీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నా, అక్రెడిటేషన్ కమిటీ తీరుతో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం ప్రకారం ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులతోపాటు ఆర్టిస్టులూ జర్నలిస్టులేనని, అందరికీ అక్రెడిటేషన్ కార్డులను జారీ చేయాల్సి ఉండగా.. అక్రెడిటేషన్ కమిటీ మోకాలడ్డుతోందని ఆరోపించారు.
కమిటీ సిఫారసుల మేరకే అక్రెడిటేషన్లు: అల్లం
రామచంద్రమూర్తి కమిటీ నివేదికను తూచ తప్పకుండా అనుసరిస్తూ అక్రెడిటేషన్ దరఖాస్తుల స్క్రూటినీ నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. డెస్క్, ఆర్టిస్టు, స్కానర్స్ లాంటి వారికి అక్రెడిటేషన్లు ఇవ్వడానికి కూడా కమిటీకి అభ్యంతరం లేదన్నారు. అక్రెడిటేషన్ల కమిటీపై టీయూడబ్ల్యూజే, ఐజేయూ నేతల ఆరోపణలను ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు.
పద్ధతి ప్రకారమే అక్రెడిటేషన్లు: క్రాంతి, పల్లె రవి
జర్నలిస్టులకు ప్రభుత్వం అందజేసే అక్రిడిటేషన్ల ప్రక్రియ నిబంధనల మేరకే జరుగుతున్నా... ఒక జర్నలిస్టు యూనియన్ తప్పుడు ప్రచారం చేస్తోందని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సీహెచ్ క్రాంతికిరణ్, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కమిటీపై అపోహలు సృష్టించి, బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లయితే.. ఆ ఆరోపణలు చేస్తున్న యూనియన్‌కు చెందిన ఇద్దరు సభ్యులు కూడా కమిటీలో ఉన్నారని, వారెందుకు అడ్డగించలేదని ప్రశ్నించారు. రామచంద్రమూర్తి కమిటీ సిఫారసుల మేరకే కార్డుల జారీ జరుగుతుందన్నారు.