TUWJ leaders
-
దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచి విర్రవీగుతున్నారు
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల సమస్య తీరుస్తానని, ఇది తన హామీ అని మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఆదివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీయూడబ్ల్యూజే (హెచ్–143)) ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్‌లో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో జర్నలిస్టులకు రూ.54 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించిన ఘనత కేసీఆర్ సర్కారుదేనన్నారు. త్వరలోనే దీన్ని రూ.100 కోట్లకు చేర్చేలా కృషి చేస్తామన్నారు. ఉద్యమ సమయంలో మా వెంట నిలిచిన విద్యార్థులు, లాయర్లు, జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికే మీడియా అకాడమీకి రూ.15 కోట్ల వ్యయంతో ఐదంతస్తుల భవనం కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. విధి నిర్వహణలో మరణించిన 260 మంది విలేకరుల కుటుంబానికి రూ.లక్ష చొప్పున, అనారోగ్యంతో పనిచేయలేని విలేకరుల కుటుంబాలకు రూ.50 వేల చొప్పున అందజేసిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. మరణించిన విలేకరుల పిల్లలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యనందిస్తామని హామీ ఇచ్చారు. కరోనా సమయంలో 1,950 మందికి రూ.20 వేల చొప్పున ఇచ్చి ఆదుకున్నామని మంత్రి గుర్తుచేశారు. గుజరాత్, తమిళనాడు, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాల్లోనూ అక్రెడిటేషన్లు 3,000 దాటలేదని, కేవలం తెలంగాణలోనే 19,150 మందికి ప్రభుత్వం అక్రెడిటేషన్, వైద్య సదుపాయాలు కల్పించి గుర్తించిందన్నారు. త్వరలోనే మీ అందరికీ యూనియన్ కార్యాలయం కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం... ఏడేళ్లలో తాము అన్ని ఎన్నికలు గెలిచామని, ఒక్క దుబ్బాకలో 500 ఓట్లతో గెలిచి కొందరు విర్రవీగుతున్నారని బీజేపీని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఉద్దేశించి అన్నారు. తాము కూడా మోదీ, అమిత్‌షాలను విమర్శించగలమని.. కానీ, పదవులకు గౌరవమిస్తున్నామని పేర్కొన్నారు. తమ మౌనం గోడకు వేలాడే తుపాకీ అని, అది కాల్పులతో గర్జించడం మొదలుపెడితే ప్రత్యర్థులు తట్టుకోలేరన్నారు. తాను, ఈటల రాజేందర్, హరీశ్‌రావు ఎంతో మాట్లాడగలమని హెచ్చరించారు. ఉద్యమ సమయంలోని కేసీఆర్ వాగ్ధాటి మళ్లీ బయటికి వస్తే ఆయన్ను ఎదుర్కోవడం ఎవరితరం కాదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ద్వారా వివిధ శాఖల్లో ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలిచ్చామని, త్వరలోనే 55 వేల కొలువులకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మోదీ ఒక్కో జన్‌ధన్ ఖాతాల్లో వేస్తానన్న రూ.15 లక్షలు, ఏడాదికి ఇస్తానన్న 2 కోట్ల ఉద్యోగాలెక్కడ అని నిలదీశారు. కేంద్రం తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయమే చేస్తోందన్నారు. ప్రశ్నించే గొంతులని చెప్పుకునే రాష్ట్ర బీజేపీ నేతలు దీనిపై నోరుమెదపడం లేదని విమర్శించారు. తెలంగాణ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు చేపట్టిన ప్రభుత్వాన్ని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. అంతకుముందు జరిగిన కార్యక్రమంలో మరణించిన విలేకరుల కుటుంబాలకు కేటీఆర్ చెక్కులను అందజేశారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమానికి ప్రెస్ అకాడమీ, ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలను వివరించారు. -
మీడియా, టాలీవుడ్ వివాదాలకు ఫుల్స్టాప్
సాక్షి, హైదరాబాద్ : గత కొంత కాలంగా చిత్ర పరిశ్రమలో నెలకొన్న వరుస వివాదాలకు తాత్కాలికంగా తెరపడింది. మీడియా, చిత్ర పరిశ్రమ సమస్యలపై హైదరాబాద్ ఎఫ్ఎన్సీసీలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు చర్చలకు కూర్చున్నారు. ఈ సమావేశంలో ఇరు వర్గాలు ఇటీవల పరిణామాలపై సుధీర్ఘంగా చర్చించారు. పరస్పర అవగాహన, సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం. టాలీవుడ్లో లైంగిక వేధింపులు, పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి దూషణలు, మీడియా డిబేట్లతో పాటు పలు అంశాలపై ఇటీవల టాలీవుడ్ ప్రముఖులతో పాటు సినీ హీరోలు రహస్య భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో టాలీవుడ్‌పై బురద చల్లుతున్న న్యూస్ ఛానెల్‌లకు ఇంటర్య్యూలు, ప్రచార కార్యక్రమాలు ఇవ్వకూడదని నిర్ణయించారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో మంగళవారం సినీ ప్రముఖులు, టీయూడబ్య్లూజే నేతల మధ్య జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, టీయూడబ్య్లూజే ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, కోశాధికారి మారుతీ సాగర్లు, సినిమా రంగం నుంచి సురేష్ బాబు దగ్గుబాటి, అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, దర్శకుడు ఎన్ శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు. ఈ సమావేశంలో మీడియాలో సినిమా ప్రచార ప్రకటనలు, పరిశ్రమలోని వివాదాలపై చర్చించారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. -
సీఎం కేసీఆర్‌తో టీయూడబ్ల్యూజే నేతల భేటీ
హైదరాబాద్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కారించాలని సీఎం కేసీఆర్ సమాచారశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. టీయూడబ్ల్యూజే నేతలు గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ను కలిశారు. జర్నలిస్టులకు అక్రిడేషన్, హెల్త్ కార్డుల జారీ, ఫ్లాట్ల కేటాయింపుపై నేతలు ప్రధానంగా చర్చించారు. అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కారించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు. -
అక్రెడిటేషన్ల జారీలో జర్నలిస్టులకు అన్యాయం
ఐజేయూ, టీయూడబ్ల్యూజే నేతల ఆరోపణ * అక్రెడిటేషన్ కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీలో రాష్ట్ర అక్రిడిటేషన్ కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఇండియన్ జర్నలిస్టు యూనియన్(ఐజేయూ), తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆగ్రహం వ్యక్తం చేశాయి. సీనియర్ సంపాదకులు కె.రామచంద్రమూర్తి కమిటీ రూపొందించిన అసలు నివేదికలోని కీలకాంశాలను మార్చేసి సీఎం కేసీఆర్‌కు తప్పుడు నివేదిక సమర్పించిందని ఆరోపించాయి. నివేదికను టైపింగ్ చేసే సమయంలో పలు అంశాలను తారుమారు చేశారని, అసలు నివేదికను బయట పెట్టాలని డిమాండ్ చేశాయి. జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డుల జారీ అంశంపై ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, మాజీ సెక్రటరీ జనరల్ కె.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ నరేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే కార్యదర్శి వి.విరాహత్ అలీ, హెచ్‌జేయూ అధ్యక్షుడు కె.కోటిరెడ్డి గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో అక్రెడిటేషన్ కమిటీ తీరును దుయ్యబట్టారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలు, పాత జీవోలను కాదని అక్రెడిటేషన్ల కమిటీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు జారీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నా, అక్రెడిటేషన్ కమిటీ తీరుతో జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టం ప్రకారం ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులతోపాటు ఆర్టిస్టులూ జర్నలిస్టులేనని, అందరికీ అక్రెడిటేషన్ కార్డులను జారీ చేయాల్సి ఉండగా.. అక్రెడిటేషన్ కమిటీ మోకాలడ్డుతోందని ఆరోపించారు. కమిటీ సిఫారసుల మేరకే అక్రెడిటేషన్లు: అల్లం రామచంద్రమూర్తి కమిటీ నివేదికను తూచ తప్పకుండా అనుసరిస్తూ అక్రెడిటేషన్ దరఖాస్తుల స్క్రూటినీ నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. డెస్క్, ఆర్టిస్టు, స్కానర్స్ లాంటి వారికి అక్రెడిటేషన్లు ఇవ్వడానికి కూడా కమిటీకి అభ్యంతరం లేదన్నారు. అక్రెడిటేషన్ల కమిటీపై టీయూడబ్ల్యూజే, ఐజేయూ నేతల ఆరోపణలను ఖండిస్తూ ఆయన ప్రకటన విడుదల చేశారు. పద్ధతి ప్రకారమే అక్రెడిటేషన్లు: క్రాంతి, పల్లె రవి జర్నలిస్టులకు ప్రభుత్వం అందజేసే అక్రిడిటేషన్ల ప్రక్రియ నిబంధనల మేరకే జరుగుతున్నా... ఒక జర్నలిస్టు యూనియన్ తప్పుడు ప్రచారం చేస్తోందని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సీహెచ్ క్రాంతికిరణ్, ఉపాధ్యక్షుడు పల్లె రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రెడిటేషన్ కమిటీపై అపోహలు సృష్టించి, బురద చల్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇది నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లయితే.. ఆ ఆరోపణలు చేస్తున్న యూనియన్‌కు చెందిన ఇద్దరు సభ్యులు కూడా కమిటీలో ఉన్నారని, వారెందుకు అడ్డగించలేదని ప్రశ్నించారు. రామచంద్రమూర్తి కమిటీ సిఫారసుల మేరకే కార్డుల జారీ జరుగుతుందన్నారు.