సాక్షి, హైదరాబాద్ : గత కొంత కాలంగా చిత్ర పరిశ్రమలో నెలకొన్న వరుస వివాదాలకు తాత్కాలికంగా తెరపడింది. మీడియా, చిత్ర పరిశ్రమ సమస్యలపై హైదరాబాద్ ఎఫ్‌ఎన్‌సీసీలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు చర్చలకు కూర్చున్నారు. ఈ సమావేశంలో ఇరు వర్గాలు ఇటీవల పరిణామాలపై సుధీర్ఘంగా చర్చించారు. పరస్పర అవగాహన, సహకారంతో ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం.
టాలీవుడ్‌లో లైంగిక వేధింపులు, పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి దూషణలు, మీడియా డిబేట్లతో పాటు పలు అంశాలపై ఇటీవల టాలీవుడ్ ప్రముఖులతో పాటు సినీ హీరోలు రహస్య భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో టాలీవుడ్‌పై బురద చల్లుతున్న న్యూస్ ఛానెల్లకు ఇంటర్య్యూలు, ప్రచార కార్యక్రమాలు ఇవ్వకూడదని నిర్ణయించారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో మంగళవారం సినీ ప్రముఖులు, టీయూడబ్య్లూజే నేతల మధ్య జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సమావేశానికి ప్రెస్ అకాడమీ ఛైర్మెన్ అల్లం నారాయణ, టీయూడబ్య్లూజే ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, కోశాధికారి మారుతీ సాగర్‌లు, సినిమా రంగం నుంచి సురేష్ బాబు దగ్గుబాటి, అల్లు అరవింద్, కేఎల్ నారాయణ, దర్శకుడు ఎన్ శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు. ఈ సమావేశంలో మీడియాలో సినిమా ప్రచార ప్రకటనలు, పరిశ్రమలోని వివాదాలపై చర్చించారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment