నూతన జీవో 239ను తక్షణమే సవరించి, వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని టీయూ డబ్ల్యూజే, ఐజేయూ డిమాండ్ చేసింది.
- జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడి
- టీయూడబ్ల్యూజే, ఐజేయూ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: నూతన జీవో 239ను తక్షణమే సవరించి, వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్లు ఇవ్వాలని టీయూ డబ్ల్యూజే, ఐజేయూ డిమాండ్ చేసింది. సోమవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవనంలో నిర్వహించిన విలేక రుల సమావేశంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ సీనియర్ నాయకులు కె. శ్రీనివాస్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కె. విరహత్ అలీలు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రామచంద్ర మూర్తి కమిటీ సూచనలను, సిఫారసులను యథాతథంగా అమలు చేయాలని కోరారు. చిన్న, మధ్యతరగతి పత్రికలకు తాము వ్యతిరేకం కాదని, పనిచేసే ప్రతి జర్నలిస్టు తరఫున తాము పోరాడతామన్నారు. నియోజకవర్గ, మండల స్థాయి జర్నలిస్టులందరికీ జిల్లా స్థాయి అక్రెడిటేషన్లు అందివ్వడం ద్వారా రైల్ పాసుల అంశంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించవచ్చని సూచించారు.
అక్రెడిటేషన్ల జారీకి విద్యార్హతలెందుకు?
జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు జారీ చేసేందుకు విద్యార్హతలను పెట్టడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం తమ జేబులోనే ఉందని.. తాము చెప్పినట్లుగానే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని చెప్పుకుంటున్న కొన్ని వర్గాల నాయకులు జీవో 239 ద్వారా తలెత్తిన సమస్యలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా హెల్త్‌కార్డులను అక్రెడిటేషన్‌తో సంబంధం లేకుండానే జారీ చేసి, ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టుల ఆరోగ్యాలకు భద్రత కల్పించాలన్నారు. రెండున్నర ఏళ్ల నుంచి ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల పక్షపాత ధోరణిని అవలంబిస్తుందని వాపోయారు. ఇకనైనా జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించకపోతే శీతాకాల సమావేశాల్లో జర్నలిస్టులమంతా కలసి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని వారు హెచ్చరించారు.