‘ఫేక్‌ న్యూస్‌’ ప్రకంపనలు | who, Why Created Fake News | Sakshi
Sakshi News home page

‘ఫేక్‌ న్యూస్‌’ ప్రకంపనలు

Published Wed, Apr 4 2018 6:01 PM | Last Updated on Tue, Sep 18 2018 8:19 PM

who, Why Created Fake News - Sakshi

సాక్షి, బెంగళూరు: దేశంలో నకిలీ వార్తలు ప్రకంపనలు సష్టిస్తున్న నేపథ్యంలో వీటిని అరికట్టడం కోసం బాధ్యులైన జర్నలిస్టుల గుర్తింపు కార్డులు అంటే ఢిల్లీలోని ‘ప్రెస్‌ ఇన్‌ఫర్మేషన్‌ బ్యూరో’ జారీ చేసిన ‘అక్రిడిటేషన్‌ కార్డులు’ను రద్దు చేస్తామంటూ కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఓ సర్కులర్‌ తీసుకొచ్చి, ఆపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జోక్యంతో ఆ సర్కులర్‌ను చెత్తబుట్టలో పడేశారు.

అసలు ఇంతకు ఎవరు నకిలీ న్యూస్‌ను సష్టిస్తున్నారు? ఎవరు వాటికి ప్రచారం కల్పిస్తున్నారు? ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ప్రచారం చేస్తున్న నకిలీ వార్తలు ఎలాంటివి? ఎవరి లక్ష్యంగా అవి ప్రచారం అవుతున్నాయి ? వారం క్రితమే (గత గురువారం) ‘పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌’ సహ వ్యవస్థాపకుడు మహేశ్‌ విక్రమ్‌ హెగ్డేను నకిలీ వార్తల ప్రచురణ, ప్రచారం నేరారోపణల కింద బెంగళూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. వెంటనే ఆయన్ని విడుదల చేయాలంటూ ‘రిలీజ్‌ మహేశ్‌ హెగ్డే’  హాష్‌ ట్యాగ్‌తో కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే మొదలుకొని సామాన్య బీజేపీ కార్యకర్తల వరకు సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం సాగించారు.

మార్చి 18వ తేదీన ఓ జైన సన్యాసిని.. ముస్లిం యువకుడు దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడని, సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందంటూ పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌ ప్రచారం చేసింది. తన ఫేస్‌బుక్‌ పేజీలో కూడా పోస్ట్‌ చేయగా, అది వైరల్‌ అయింది. ఎల్లప్పుడు పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌ తప్పుడు వార్తలపై ఓ కన్నేసి ఉంచే ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ వెబ్‌సైట్‌ ‘అల్టర్‌ న్యూస్‌’ జర్నలిస్టులు రంగంలోకి దిగి బెంగుళూరు పోలీసుల నుంచి వాస్తవాలను సేకరించారు.

సదరు సన్యాసిపై ఎవరూ దాడి చేయలేదని, రోడ్డు దాటుతుండగా చిన్న ప్రమాదమై స్వల్ప గాయమైందని పోలీసులు చెప్పడంతోపాటు ఆ జైన సన్యాసి కూడా ధ్రువీకరించారు. ఈ నెల 12వ తేదీన రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నకిలీ వార్తలను ప్రచారుం చేస్తున్నారన్నది సులభంగానే అర్థం అవుతుంది. పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌లో ఒక్కటి కాదు, పదులు కాదు, పాతిక సంఖ్యల్లో నకిలీ వార్తలు వస్తున్నాయి. అవన్నీ కూడా మైనారిటీలకు వ్యతిరేకంగా హిందూత్వ శక్తులకు అనుకూలంగా ఉంటున్నాయి. అందుకనేమో వీటిని బీజేపీ, ఆరెస్సెస్‌ నాయకుల నుంచి కార్యకర్తల వరకు సోషల్‌ మీడియాలో చురుగ్గా షేర్‌ చేస్తున్నారు.

మచ్చుకు పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌లో మరికొన్ని నకిలీ వార్తలు
2016, ఆగస్టు నెలలో: సీనియర్‌ జర్నలిస్ట్‌ బార్కా దత్, హిజ్‌బుల్‌ ముజాహిద్దీన్‌ టెర్రరిస్ట్‌ గ్రూప్‌ కమాండర్‌ జకీర్‌ రషీద్‌ భట్‌ అలియాస్‌ జకీర్‌ మూసాతోని టూవీలర్‌పై వెనక తగులుకునేలా కూర్చొని వెళుతున్న దశ్యం అంటూ పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌ ప్రచారం చేసింది. ట్విటర్‌లో పుట్టిన ఈ వార్తను పోస్ట్‌కార్డ్‌ ప్రచారం చేయగా, దాన్ని హిందూత్వ శక్తులు వైరల్‌ చేశాయి. అల్లర్లు కొనసాగుతున్న కశ్మీర్‌లో తాను న్యూస్‌ కవరేజ్‌కి వెళ్లినప్పుడు కారు చెడిపోయిందని, కర్ఫ్యూ కారణంగా తాను కారు మరమ్మతు చేయించుకోలేక ఓ టూ వీలర్‌ బాటసారిని లిఫ్ట్‌ అడిగి గమ్యస్థానానికి చేరుకున్నానంటూ బార్కా దత్‌ వివరణ ఇచ్చారు.టూవీలర్‌ నడుపుతున్న వ్యక్తికి టెర్రరిస్ట్‌ కమాండర్‌కు దగ్గరి పోలికలు ఉన్నాయని పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌ వాదించింది. కనిపిస్తే కాల్చిచంపే ఉత్తర్వులు ఉన్నాయని తెలిసి, ఎక్కడో అజ్ఞాతంలో ఉన్న టెర్రరిస్టు కమాండర్‌ కర్ఫ్యూ సమయంలో, విస్తృతంగా పోలీసుల తనిఖీలు జరుగుతున్న సమయంలో టూ వీలర్‌పై ఎలా తిరుగుతాడని ‘అల్టర్‌ న్యూస్‌’ నిలదీసింది.

2017, మే నెల: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం త్వరలోనే మరో పాకిస్తాన్‌గా మారిపోనుంది. ఆ పుణ్యం ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కట్టుకోవచ్చు. ఎందుకంటే, ముస్లింల కోసం ఆమె త్వరలోనే ప్రత్యేక ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షను ప్రవేశపెట్టబోతున్నారు. ముస్లింలను మంచి చేసుకోవడం కోసం ఆమె రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఈ వార్తలో కూడా నిజం లేదని అల్టర్‌ న్యూస్‌ తేల్చింది.

2018, ఫిబ్రవరి 5: తమిళనాడులోని కొన్ని క్రైస్తవ బృందాలు మధురైలోని కలియార్‌ కోవిల్, శివగామి ఆలయాల్లోకి వెళ్లి ఆ ప్రాపర్టీ తమదని డిమాండ్‌ చేశాయని, క్రైస్తవ మిషనరీలు ఆ హిందూ దేవాలయాలను చర్చిలుగా మార్చేందుకు కుట్ర పన్నాయని పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌ ఎలాంటి ఆధారాలు లేకుండా  ఓ వార్తను ప్రచురించింది. ఇలాంటి నకిలీ వార్తలను పట్టుకునే మరో వెబ్‌సైట్‌ ‘బూమ్‌లివ్‌’ స్థానిక పోలీసు అధికారులతోని, స్థానిక జర్నలిస్టులతోని మాట్లాడి వాస్తవాలను బయట పెట్టింది. క్రైస్తవ బృందాలు ఆ ఆలయాల సమీపం నుంచి వెళ్లాయని, ఆలయాల లోపలికి ఎవరు వెళ్లలేదని, ప్రతి ఏట సంప్రదాయంగా జరిగే ఊరేగింపు అదని తేలింది. హిందుత్వ శక్తులు, ప్రధాని మోదీకి అనుకూలంగా ట్వీట్లు కూడా పెట్టే మహేశ్‌ విక్రమ్‌ హెగ్డే ఎలాంటి జర్నలిస్టో సులభంగానే గ్రహించవచ్చు.

నకిలీ వార్తలను అరికట్టాలంటూ స్మృతి ఇరానీ మాట్లాడం అంటే ‘దొంగే దొంగా దొంగా’ అని అరిచినట్లు ఉంది. అయితే జర్నలిస్టుల గుర్తింపు కార్డులు రద్దు చేయడం వల్ల నకిలీ వార్తలు ఆగుతాయా? గుర్తింపు కార్డులు కలిగిన జర్నలిస్టులు నకిలీ వార్తలు సృష్టిస్తున్నారా? ఇంట్లో కూర్చున్న వారు, పోస్ట్‌కార్డ్‌ న్యూస్‌ లాంటి మీడియా ముసుగేసుకున్న వారు నకిలీ వార్తలు సృష్టిస్తున్నారు. బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయా లాంటి వారే నకిలీ వార్తలను, ఫొటోలను ప్రచారం చేస్తుంటే ఇంకా ఎవరిని అరికడతాం.

పశ్చిమ బెంగాల్‌లో ఏడాది క్రితం మత ఘర్షణలు జరిగినప్పుడు ‘బెంగాల్లో పట్టపగలు ఓ హిందూ మహిళను వివస్త్రను చేస్తున్న ముస్లిం యువకులు’ అన్న కాప్షన్‌తో మరాఠీ చిత్రంలోని ఓ సన్నివేశం ఫొటోతో సోషల్‌ మీడియాలో ఆయన ప్రచారం చేశారు. అభాసు పాలవుతామని నరేంద్ర మోదీనే ఇరానీ సర్కులర్‌ను రద్దు చేశారు. అయితే తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే నకిలీ వార్తలు ఎక్కువయ్యాయన్న విషయాన్ని గ్రహించి వాటిని అరికట్టేందుకు సమగ్ర చట్టం తీసుకరావాలి. గతేడాదే జార్ఖండ్‌లో నకిలీ వార్తల కారణంగా రెండు వేర్వేరు సంఘటల్లో ఏడుగురు అమాయకులు మరణించారు. అపరిచితులు పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ ‘వాట్సాప్‌’లో తప్పుడు ప్రచారం జరగడంతో అమాయకులను అనుమానించి జనమే కొట్టి చంపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement